‘‘జర్నలిజం అన్నది ఎంతో బాధ్యతతో కూడుకున్నది. నిజాయతీ కలిగిన జర్నలిస్టులు ఉంటే సమాజానికి ఎంతో ప్రయోజనం ఉంటుంది. ప్రజలను, సమాజాన్ని కూడా చైతన్యవంతం చేసే శక్తి జర్నలిజానికి ఉంది. ఈ నేపథ్యంలో రూపొందిన చిత్రమే ‘ఆపరేషన్ అరుణారెడ్డి’. జర్నలిస్ట్ అరుణా రెడ్డి పాత్రలో హిందోళ చక్రవర్తి అద్భుతంగా నటించారు. నేను ఇప్పటివరకూ సుమారు 100కు పైగా సినిమాలకు స్క్రీన్ ప్లే రాసి ఉంటాను. నా కెరీర్లోనే ఇది బెస్ట్ స్క్రీన్ ప్లే అవుతుంది. నేను, నా భార్య కుసుమ లత కలిసి ఈ మూవీ స్క్రీన్ ప్లే రాశాం.
ఇండియాలోనే బెస్ట్ స్క్రీన్ ప్లే చిత్రంగా ‘ఆపరేషన్ అరుణారెడ్డి’ నిలుస్తుందని గర్వంగా చెప్పగలను’’ అని పోసాని కష్ణమురళి తెలిపారు. ఆయన కీలక పాత్రలో నటించి, కథ, స్క్రీన్ ప్లే, మాటలు, పాటలు, ఎడిటింగ్ అందించడంతో పాటు స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘ఆపరేషన్ అరుణారెడ్డి’. హిందోళ చక్రవర్తి టైటిల్ రోల్ చేశారు. బీజేపీ నేత, ఎంపీ రఘునందన్ రావు, కాజల్ శర్మ, ఆయేషా ఖాన్ ఇతర పాత్రలు పోషించారు. 3 ఇడియట్స్ మూవీస్ సమర్పణలో పోసాని కష్ణమురళి నిర్మించిన ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో పోసాని కృష్ణమురళి ‘సాక్షి’తో ఎక్స్‌క్లూజివ్‌గా చెప్పిన ఈ చిత్రం విశేషాలు ఈ విధంగా...
ప్రేక్షకులు ఊహించలేరు
శ్రీకాంత్ హీరోగా, ముమైత్ ఖాన్ ప్రధాన పాత్రలో నేను తీసిన ‘ఆపరేషన్ దుర్యోధన’ చిత్రం 2017 మే 31న విడుదలై 100 రోజులు ఆడింది. తెలుగు చిత్ర పరిశ్రమలో సూపర్ హిట్‌గా నిలిచి, 100 రోజుల పోస్టర్ పడ్డ చివరి చిత్రం మా ‘ఆపరేషన్ దుర్యోధన’. ఆ తర్వాత ఏ సినిమా కూడా నాకు తెలిసి 100 రోజులు ప్రదర్శించబడలేదు. ‘ఆపరేషన్ అరుణారెడ్డి’ టైటిల్ చూడగానే ‘ఆపరేషన్ దుర్యోధన’కి సీక్వెల్ తీశారేమో అనే అనుమానం అందరిలోనూ ఉంది. అయితే ఈ రెండు సినిమాలకు ఎలాంటి పోలిక లేదు... సీక్వెల్ అస్సలు కానే కాదు. సమాజంలో నేను చూసిన, విన్నటువంటి పలు వాస్తవ ఘటనల నేపథ్యంలో ఈ సినిమా కథ రాశాను. నేను, నా భార్య కలిసి స్క్రీన్ ప్లే రాశాం. ఈ స్క్రీన్ ప్లే ఎలా ఉంటుందంటే సినిమా ప్రారంభం నుంచి చివరి వరకూ తర్వాత ఏం జరుగుతుంది? అన్నది ప్రేక్షకులు ఊహించలేరు.
కొత్తవారికి ఎలాంటి ఇమేజ్ ఉండదు
‘ఆపరేషన్ అరుణారెడ్డి’ సినిమా కోసం అందర్నీ కొత్త వారినే తీసుకున్నాను. వారికి జనాల్లో ఎలాంటి ఇమేజ్ ఉండదు కాబట్టి ఆయా పాత్రలతో ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతారు. నిజాయతీ కలిగిన జర్నలిస్ట్ అరుణా రెడ్డి పాత్రలో హిందోళ చక్రవర్తి నటించారు. రాజకీయాల్లోకి ప్రజాసేవ కోసం ఎవరు వచ్చారు? వ్యాపారాలు చేయడం, డబ్బులు సంపాదించుకోవడం కోసం ఎవరు వచ్చారు? అన్నది ఆమె పాత్ర ప్రజల్ని హెచ్చరిస్తుంది. ఆమె హెచ్చరికలతో ప్రజలు ఎలా అప్రమత్తమయ్యారు? సరైన నాయకుల ఎంపికలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు? అనేది ఈ చిత్రంలో చాలా ఆసక్తికరంగా ఉంటుంది. నిజాలను నిర్భయంగా మాట్లాడేవారు సమాజంలో ఉండకూడదని కొందరు కుట్ర పన్ని, అరుణా రెడ్డి రోడ్డున పడే పరిస్థితి తీసుకొస్తారు.
ఈ నేపథ్యంలో నిజాయతీ కలిగిన ఇలాంటి వారు జర్నలిజంలో ఉండాలని నిజాయతీపరుడైన ముఖ్యమంత్రి అండగా నిలబడి, సాయం చేస్తాడు. నేను అడగ్గానే సీఎం పాత్రలో నటించేందుకు ఒప్పుకున్న ఎంపీ రఘునందన్ రావుగారికి ప్రత్యేక ధన్యవాదాలు. నిజ జీవితంలోనూ ఆయన వాస్తవాలను మాట్లాడుతూ, నిజాయతీగా ఉంటారు కాబట్టే ముఖ్యమంత్రి పాత్రలో ఆయన్ని నటింపజేశాను. అప్పుడు ‘ఆపరేషన్ దుర్యోధన’ చిత్రంలో సీఎం పాత్రలో మోత్కుపల్లి నరసింహులు అన్నని నటింపజేశాను. నటుడిగా ఆయనకు అదే తొలి చిత్రం.
నటించేందుకు సిద్ధం
నేను ఏ విషయాన్ని అయినా ముక్కుసూటిగా మాట్లాడతాను. అందులో ఎలాంటి దాపరికాలు ఉండవు. ‘ఆపరేషన్ అరుణారెడ్డి’ సినిమాని నేను ఎవరిపైనో సెటైరికల్‌గా తీశాననుకుంటున్నారు. అందులో వాస్తవం లేదు. వంద శాతం నిజాయతీగా తీసిన చిత్రం ఇది. ఈ సినిమాకు, రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్, తెలుగుదేశం, బీజేపీ, కాంగ్రెస్... ఇలా అన్ని పార్టీల వారు ఈ చిత్రాన్ని నిరభ్యంతరంగా చూడొచ్చు. ఎందుకంటే అన్ని వర్గాల వారికి నచ్చే సినిమా ఇది. పైగా సెన్సార్ కూడా పూర్తయింది. సెన్సార్ సభ్యులు ఎలాంటి అభ్యంతరాలు చెప్పలేదు.
ఈ చిత్రాన్ని కుదిరితే ఈ నెలాఖరులో లేదంటే జూన్ నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాను. ఇకపై నా దర్శక–నిర్మాణంలో కుదిరితే ఏడాదికి రెండు సినిమాలు తీస్తాను... లేకుంటే కనీసం ఒక్క చిత్రం అయినా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాను. ప్రస్తుతం ‘డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్’ అనే మూవీ కోసం లైన్ అనుకున్నాను. ‘ఆపరేషన్ అరుణారెడ్డి’ విడుదల తర్వాత ఓ నెల గ్యాప్ తీసుకుని, ఆ తర్వాత ‘డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్’ స్క్రిప్ట్‌ని మొదలు పెడతాను. ఈ మూవీలో నాతో పాటు కొత్తవారు నటిస్తారు. నా పాత్ర నచ్చితే ఎవరి సినిమాలో అయినా నటించేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. ప్రస్తుతం కొందరు రచయితలు–దర్శకులు నన్ను సంప్రదిస్తున్నారు.
తొలిసారి పాటలు రాశాను
‘ఆపరేషన్ అరుణారెడ్డి’ చిత్రంలో ఓ పార్టీ అధ్యక్షుడి తనయుడి పాత్రను నేను చేశాను. నా పాత్రతో పాటు హిందోళ చక్రవర్తి, కాజల్ శర్మ, ఆయేషా ఖాన్ ... ఇలా అన్ని పాత్రలకు సమ ప్రాధాన్యం ఉంటుంది. ఈ చిత్రానికి మహదేవ్ ఎలేందర్ అద్భుతమైన సంగీతం, నేపథ్య సంగీతం అందించారు. భవిష్యత్తులో తను పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అవుతాడు. ఈ సినిమా కోసం తొలిసారి నేను రెండు పాటలు రాశాను. చాలా సరళమైన పదాలతో ఆ పాటలు అందరికీ అర్థం అయ్యేలా ఉంటాయి. కెమెరామేన్ సుధాకర్ ఎంతో ప్రతిభావంతుడు. ఆయన పనిని వెండితెరపై చూస్తారు.
– డేరంగుల జగన్ మోహన్


