మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్, దర్శకుడు జీతూ జోసెఫ్ కాంబినేషన్లోని సక్సెస్ఫుల్ ఫ్రాంచైజీ ‘దృశ్యం’. ఈ ఫ్రాంచైజీ నుంచి ఇప్పటికే రెండు భాగాలు (దృశ్యం, దృశ్యం 2) రాగా.. రెండూ సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు మూడో భాగం దృశ్యం 3 ప్రేక్షకులు ముందుకు వచ్చింది. అయిగే గత రెండు భాగాలను తెలుగులో హీరో వెంకటేష్ రీమేక్ చేయగా.. పార్ట్ 3 మాత్రం మలయాళ చిత్రాన్నే తెలుగు డబ్బింగ్ చేసి నేడు(మే 21) రిలీజ్ చేశారు. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.
కథేంటంటే..
దృశ్యం 2 ముగింపు సీన్‌తో ఈ సినిమా ప్రారంభం అవుతుంది. వరుణ్ హత్య కేసు నుంచి తన కుటుంబాన్ని కాపాడుకునేందుకు జార్జ్‌కుట్టి(మోహన్‌లాల్) వేసిన ప్లాన్ సక్సెస్ అవుతుంది. కోర్టు ఆదేశాలతో జార్జ్ ఫ్యామిలీపై ఎలాంటి కేసు నమోదు కాకుండా బయటపడతారు. తన జీవితంలో చోటు చేసుకున్న ఈ ఘటననే కాస్త మార్పులు చేసి ఓ సినిమాను నిర్మిస్తాడు జార్జ్. అది రిలీజై..బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అవుతుంది. అదే సమయంలో మానసిన సమస్యలను నుంచి బయటపడిన పెద్ద కూతురు అంజుకి పెళ్లి చేయాలని నిర్ణయించుకుంటారు. భార్య రాణి(మీనా) కూడా కూతురికి త్వరగా పెళ్లి చేస్తే బాగుంటుందని సలహా ఇస్తుంది. అయితే చాలా సంబంధాలు వచ్చినప్పటికీ.. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు అంజు గురించి నెగెటివ్‌గా చెప్పడంతో అవన్నీ తప్పిపోతాయి.
కొన్నాళ్ల తర్వాత తన కూతురికి వచ్చిన పెళ్లి సంబంధాలను ఇద్దరు చెడగొడుతున్నారనే విషయం తెలుస్తుంది? అసలు ఆ ఇద్దరు ఎవరు? ఎందుకు పెళ్లి సంబంధాలను చెడగొడుతున్నారు? కొడుకు(వరుణ్)ని పోగోట్టుకున్న బాధ నుంచి బయటపడేందుకు అమెరికా వెళ్లిన గీతా ప్రభాకర్, ప్రభాకర్ మళ్లీ జార్జ్ లైఫ్‌లోకి ఎందుకు వచ్చారు? సస్పెండ్ అయిన పోలీసు ఆఫీసర్ సహదేవన్ చేసిన కుట్ర ఏంటి? వరుణ్ హత్య కేసు నుంచి కూతురిని తప్పించేందుకు ఈ సారి జార్జ్ వేసిన ప్లాన్ ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే..
అనుకోకుండా జరిగిన హత్య కేసు నుంచి కుటుంబాన్ని కాపాడుకునేందుకు పెద్దగా చదువులేని మధ్యతరగతి వ్యక్తి ఏం చేశాడు? అనేది ‘దృశ్యం’ కథ. ఈ ఒక్క లైన్‌తోనే ఇప్పటికే రెండు పార్టులు తీసి హిట్ కొట్టాడు దర్శకుడు జీతూ జోసెఫ్. అందుకే పార్ట్ 3పై ముందుగానే భారీ అంచనాలు పెరిగాయి. ఈ సారి ఎలాంటి ట్విస్టులు ఉంటాయి? కేసు నుంచి తన ఫ్యామిలీని జార్జ్ ఎలా బయటపడేస్తాడు? అనే క్యూరియాసిటీతో థియేటర్స్‌కి వెళ్లిన ప్రేక్షకులను జీతూ పూర్తి స్థాయిలో సంతృప్తి పరచలేదు. ట్విస్టులు, సస్పెన్స్ సన్నివేశాలు ఉన్నప్పటికీ.. వాటిలో కొత్తదనం కొరవడింది. చివరి అరగంట తప్ప మిగతా కథనం అంతా రొటీన్‌గానే ఉంటుంది. ఫస్టాఫ్ కథనం స్లోగా సాగుతూ.. సహనానికి పరీక్షగా మారుతుంది.
ఇంటర్వెల్ సీన్ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. ఇక ద్వితియార్థం ప్రారంభంలో కూడా కథనం నెమ్మదిగానే సాగినప్పటికీ.. ఒక్కో పాత్ర ఎంట్రీతో కథపై ఆసక్తి పెరుగుతుంది. ఇక కూతురు పెళ్లి ఆపేదెవరని జార్జ్‌కి తెలిసిన తర్వాత కథనం పరుగులు పెడుతుంది. అంజు అరెస్ట్ కోసం జరిగే కుట్రలు.. వాటిని తిప్పికొట్టేందుకు జార్జ్ వేసే ప్లాన్స్ అన్నీ అదిరిపోతాయి. చివరి అరగంట అయితే మళ్లీ ‘దృశ్యం’, ‘దృశ్యం 2’ తరహాలో కథనం సీరియస్‌గా సాగుతూ.. తర్వాత ఏం జరుగుతుందా? అనే క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో కలిగించాడు దర్శకుడు. అక్కడ వచ్చే ట్విస్టులు ఆకట్టుకుంటాయి.
ఎవరెలా చేశారంటే..
ఎప్పటి మాదిరే మోహన్ లాల్ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. జార్జ్‌కుట్టి పాత్రలో జీవించేశాడు. అతని భార్య రాణిగా మీనా చక్కగా నటించింది. ఇక కూతుళ్లుగా నటించిన ఇద్దరూ తమ తమ పాత్రల పరిధిమేర బాగానే చేశారు. సహదేవన్, ప్రభాకర్ పాత్ర ధారులతో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు.
సాంకేతికంగా సినిమా పర్వాలేదు. సంగీతం, సినిమాటోగ్రఫీ ఈ సినిమాకు మరో ప్రధాన బలం. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమా స్థాయిని పెంచేసింది. ఎడిటింగ్ బాగుంది. తెలుగు డబ్బింగ్ అస్సలు బాగోలేదు. డబ్బింగ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.


