
స్వర్ణ పంచాయత్ పోర్టల్‌లోనే పన్నుల చెల్లింపు
కర్నూలు(అర్బన్): ఇక నుంచి జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో స్వర్ణ పంచాయత్ పోర్టల్‌లోనే పన్నుల చెల్లింపు జరగాలని జిల్లా పంచాయతీ అధికారి జి.భాస్కర్ తెలిపారు. మంగళవారం ఆయన జూమ్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో డిప్యూటీ ఎంపీడీఓ, పంచాయతీ కార్యదర్శులు పన్నుల చెల్లింపులు ఆన్‌లైన్‌లోనే జరిగేలా చర్యలు చేపట్టాలన్నారు. ఈ నెల 8, 9, 10వ తేదీల్లో స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా జిల్లాలోని అన్ని ఓహెచ్‌ఎస్‌ఆర్, జీఎల్‌ఎస్‌ఆర్ ట్యాంకులను శుభ్రం చేయించాలన్నారు. చెత్త సేకరణపై ప్రత్యేక దృష్టి సారించి, ఎక్కడా పారిశుద్ధ్య సమస్య తలెత్తకుండా జాగ్రత్త వహించాలన్నారు. గ్రామ పంచాయతీ పరిధిలోని ఇళ్ల యజమానుల అసెస్‌మెంట్ నెంబర్‌కు వారి ఆధార్‌ను లింకు చేయించాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఆధ్వర్యంలో పశువుల తాగునీటికి సంబంధించి ఏర్పాటు చేసిన టబ్‌లను ఎప్పటికప్పుడు నీటితో నింపాలన్నారు.
12 నుంచి ఇంటర్మీడియెట్ సప్లిమెంటరీ పరీక్షలు
కర్నూలు సిటీ: ఇంటర్మీడియెట్ సప్లిమెంటరీ పరీక్షలు ఈ నెల 12 నుంచి 20వ తేది వరకు నిర్వహించనున్నారు. పరీక్షలు ఉదయం 9 నుంచి మద్యాహ్నం 12 గంటల వరకు ఫస్ట్ ఇయర్, మద్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు సెకండియర్ పరీక్షలు జరుగనున్నాయి. మొత్తం 21,342 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. ఇందులో మొదటి సంవత్సరం విద్యార్థులు 15,292.. ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 5,032 మంది ఉన్నారు. పరీక్షల నిర్వహణకు 52 పరీక్షల కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రాక్టికల్స్ ఫెయిల్ అయిన విద్యార్థులకు, గైర్హాజరైన వారికి ఈ నెల 28వ తేది నుంచి జూన్ 1వ తేది వరకు కేవలం జిల్లా కేంద్రంలో మాత్రమే వీటిని నిర్వహించనున్నారు.
కొత్తిమీర అ‘ధర’హో
గోనెగండ్ల: ఒక్కసారిగా కొత్తిమీర ధర పెరిగిపోయింది. ఒక మడి ధర రూ. వెయ్యి నుంచి రూ. 1,200 వరకు పలుకుతోంది. పెళ్లిళ్ల సీజన్ కావడంతో కొత్తిమీరకు డిమాండ్ పెరిగింది. గోనెగండ్ల మండలంలో బోర్లు,బావుల కింద 1,500 ఎకరాల్లో రైతులు కొత్తిమీర పంటను సాగుచేశారు. ఈ ఏడాది ఉల్లి, మిరప తదితర పంటలు సాగుచేసిన రైతులు గిట్టుబాటు ధర లేక తీవ్రంగా నష్టపోయారు. ప్రస్తుతం కొత్తిమీర పంటకు రెండు రోజుల నుంచి ధరలు పెరగడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

స్వర్ణ పంచాయత్ పోర్టల్‌లోనే పన్నుల చెల్లింపు