తత్త్వదర్శనం
మనుషుల్లో రకరకాల వ్యక్తిత్వాలు కలవారు ఉంటారు. సాత్వికులు, మూర్ఖులు, మధ్యస్థంగా ఉండేవారు, తెలివైన వారు, కోపిష్ఠులు... వీరందరిలోనూ ప్రత్యేకంగా కనిపించే మరొక తరహా మనుషులు పొగగరుబోతులు!
పొగరు అంటే అవసరానికి మించిన ఆత్మాభిమానమే! పొగరన్న మాట విన్నప్పుడు ఓ కొండో, ఆకాశాన్ని తాకే చెట్టో గుర్తుకు రాక మానదు. ఎందుకంటే కొంతమందిలో అహంకారం ఆ స్థాయిలో ఉంటుంది. అయితే చిత్రం ఏమిటంటే... ఇలాంటివారిలోనూ ఒక స్థాయిలో జ్ఞానం దాగి ఉంటుంది. పొగరుబోతులు సహజంగా గర్వంతో ప్రవర్తిస్తారు. ఎందుకంటే వారు తమకంటూ ఏదో ప్రత్యేకమైన గొప్ప విలువుందని నమ్ముతారు. ఆత్మన్యూనతా భావం లేకుండా స్వశక్తి మీద విశ్వాసం ఉండటం ఆధ్యాత్మిక జగత్తులో ఓ గొప్ప పరిణామమే! ‘ధీరులు ఆత్మవిశ్వాసంతో భాసిస్తారు’ అని గీతాకృష్ణుడు చెబుతాడు. అయితే... పొగరు వేరు, ఆత్మవిశ్వాసం వేరు. ఆ రెండింటి మధ్య ఉండే సన్నటి గీతను గుర్తించాలి. సాధకుడు తనను తాను శక్తిమంతుడిగా నమ్మాలి. కానీ, అది తలబిరుసుతనంగా మారకూడదు. తనలో ఉన్న గొప్పతనాన్ని వినయపూర్వకంగా గ్రహించడం మాత్రమే ప్రగతికి పునాది వేస్తుంది.
పొగరును వినయంగా మార్చుకోవడంతో సాధన పరిపక్వత పొందుతుంది. జ్ఞాని మౌనంగా ఉన్నప్పటికీ వారి విజ్ఞత లోకానికి వెల్లడవుతుంది. అవసరమైనప్పుడు అతడు మాటల్లోనూ తన జ్ఞానాన్ని వ్యక్తపరుస్తాడు. అది అతిశయం ఎంతమాత్రం కాబోదు. అంతర్లీనంగా ఉన్న అతడి వినయాన్ని లోకం అర్థం చేసుకుంటుంది. ఏ విషయం తనలో పొగరుబోతుతనానికి ప్రేరణ కల్పించిందో దాన్ని మిథ్యగా తెలుసుకుని తొలగించుకోవాలి. విన యాన్ని సాధన చేయాలి. పండు సువాసనతో, మాధుర్యంతో తినేవారిని ఆకర్షిస్తుంది. అది పిందెగా ఉన్నప్పుడు వగరుగానో, చేదుగానో, పుల్లగానో ఉండవచ్చు. కాలగతిన ఆ స్థానంలో మాధుర్యం చోటు చేసుకుంటుంది. పొగరుబోతుతనం తొలుత వెగటు కలిగించినా, జ్ఞానంతో కూడిన సాధనతో అటువంటి వ్యక్తి కూడా తీయని ఫలంలాగా లోకానికి తప్పక ప్రీతి కలిగిస్తాడు. పొగరుబోతుతనం తప్పుకాదు. అదొక తెలియనితనం! అమాయకులైన పిల్లలు విద్యతో వినయాన్ని, జ్ఞానాన్ని సాధించినట్లు పొగరుబోతులు జీవితం బోధించే పాఠాలు ఒంటబట్టించుకున్నాక విలువలు నేర్చుకుని తప్పక జ్ఞానవంతులవుతారు...అవ్వాలి!
లోకంలో ప్రతి వ్యక్తిలోనూ కొద్దో గొప్పో అహంకారం ఉంటుంది. అహం లేకుండా మనిషి లేడు. ఆ అహం, అహంకారంగా మారకుండా చూసుకుని పరమాత్మను చేరే మార్గం సాధకుడు అన్వేషించాలి. పొగరుబోతుతనం శాశ్వతం కాదు. మనిషి ఆధ్యాత్మికంగా ఎదిగేకొద్దీ అదే పొగరుబోతుతనం వినయంగా మారుతుంది


