కోటిలింగేశ్వరా..శిరసా నమామి | Kotilingeshwara Swamy Temple Kammasandra Bengaluru | Sakshi
Sakshi News home page

కోటిలింగేశ్వరా..శిరసా నమామి

May 21 2026 4:54 PM | Updated on May 21 2026 5:10 PM

 Kotilingeshwara Swamy Temple Kammasandra Bengaluru

కోటి లింగేశ్వర నమఃశివాయ అనే ఉచ్చారణ వింటుంటే మనకి ఒక సందేహం కలుగుతుంది.... కోటి లింగాలతో శివాలయమా అని... ఔను! నిజంగానే కోటి లింగాలతో శివాలయం ఉంది అంటే ఆశ్చర్యపోతాము. దానికి తోడు 108 అడుగుల ఎత్తు కలిగిన అతి ఎత్తయిన శివలింగం... ఎదురుగా 36 అడుగుల పెద్ద నందీశ్వరుని విగ్రహం ఉంది. శివ లింగానికి, నందీశ్వరునికి మధ్య పెద్ద త్రిశూలం స్థాపించారు. సుమారు 97 లక్షల శివలింగాల ప్రతిష్ట జరిగి ఉంటుందని లెక్క. ఇవికాక ఉపదేవతలు... దేవి పీఠాలు వెరసి భక్తితో ఓం నమఃశివాయ అనే ఉచ్చారణతో లోకమే మర్చిపోతాము.  

కోటి లింగాల స్థాపన అంటేనే చిన్న విషయం కాదు. ఈ దేవాలయ ప్రతిష్టతో ఆ ఊరి అసలు పేరు మారిపోయి కోటి లింగేశ్వర అని చెప్తేనే తెలుస్తోంది. మరి అంతటి ప్రశస్తి ΄పొందింది. ఈ కోటి లింగేశ్వర దేవాలయం బెంగుళూరుకి సుమారు 80 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆ ఊరి పేరు కమ్మసంద్ర. ట్రైన్‌లో వెళ్తే బంగారుపెట్ట రైల్వేస్టేషన్‌లో దిగితే 13 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇక్కడ ఉండడానికి అంత సౌకర్యాలు లేవు. బెంగళూరు, కమ్మసంద్ర రెండు వేరు వేరు లోకాలని చెప్పొచ్చు. బెంగళూరు యాంత్రికమైన వేగంతో కూడుకున్న జీవితం అయితే కమ్మసంద్రలో ప్రశాంతమైన పల్లె వాతావరణం... భక్తితో కోటి లింగేశ్వర లోకం అని అనిపిస్తుంది. 

మరి ఈ దేవాలయాన్ని ప్రతిష్టించిన వ్యక్తి పేరు స్వామి సాంబశివమూర్తి. పేరులోనే శివ నామం ఉంది. అందుకేనేమో కోటి శివలింగాలను ప్రతిష్టించాలని మనసులో అనుకున్నారు. భారత్‌ ఎర్త్‌ మూవర్స్‌ లిమిటెడ్‌ అనే కేంద్ర సంస్థలో ఉన్నతమైన ఉద్యోగాన్ని వదిలి శివనామస్మరణతో కోటి లింగేశ్వర దేవాలయంలో తన శేష జీవితం గడిపారు. 

వీరి స్వప్నమే కోటిలింగాల ప్రతిష్ట. 2018లో స్వామి సమాధి ΄పొంది శివైక్యం అయ్యారు. ఇక్కడ 17 శక్తి స్వరూపాలను ప్రతిష్టించారు. అలాగే దుర్గ, పార్వతీదేవిల ప్రతిష్ట ఉంది. ఉప దేవతలుగా అన్నపూర్ణేశ్వరి, కరుమారి అమ్మ , సుబ్రమణ్యేశ్వర స్వామి, పాండురంగస్వామి, సీతారామలక్ష్మణులు, పంచ ముఖ గణపతి, కన్యకాపరమేశ్వరి ఉపదేవతా క్షేత్రాలు ఉన్నాయి. ముందుగా బ్రహ్మ, విష్ణు మహేశ్వరులను పూజించి దర్శనానికి వెళ్ళాలి. 

ఇక్కడ చూడదగ్గది సహస్రనామ శివలింగం. ఏకశిల మీద వేయి శివలింగాలను చెక్కి ఉంటుంది. ఒకేసారి వేయి శివలింగాల దర్శనం చేసినంత పుణ్యం దక్కుతుంది. అలాగే మరో పుణ్యఫలం పంచ ముఖ శివలింగం. ఇక్కడ భక్తులకి మరో మంచి పుణ్యం శివునికి అభిషేకం స్వయంగా చేసుకోవచ్చు. ఇక్కడ దేవాలయ యాజమాన్యాన్ని సంప్రదించి మనకి నచ్చిన వారి జ్ఞాపకార్ధం ఎనిమిది వేల నుండి రెండు లక్షల రూపాయలు వరకు చెల్లించి శివలింగ ప్రతిష్ట చేసుకోవచ్చు. ఆ విధంగా మనం కూడా కోటిలింగేశ్వర యజ్ఞంలో పాలుపంచుకోవచ్చు. 

ఎందరో ప్రముఖులు ఇందులో పాల్గొన్నట్లు పేర్లు కనిపిస్తాయి. గుడిలో వినాయకుడి గుడి ముందు భారీ బిల్వపత్ర వృక్షం, నాగలింగ వృక్షాలు ఉన్నాయి. ఆలయంలో పూజించే పవిత్రమైన దారాన్ని తీసికొని ఈ చెట్లకు కడితే కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. ఇక్కడికి రోజు వందల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఆలయాల్లో నిత్యసేవ, అన్నదానం, పేదలకు వస్త్రదానం జరుగుతాయి. ప్రతి సంవత్సరం ఆశ్వయుజ మాసంలో దసరా సందర్భంగా ఇక్కడ రథోత్సవం, జాతర జరుగుతుంది. మంజునాథుడు పరమ శివ భక్తుడు. 

వీరి చరిత్రలో కూడా కోటి లింగేశ్వర ప్రసక్తి ఉందని అంటారు. స్వతహాగా మంజునాథుడు భక్తిభావం లేకుండా తిరిగేవాడు. ఒకరోజు అతనిలో శివుని మీద భక్తి కలిగింది ఎవరు నమ్మలేదు. అప్పుడు మంజునాథుడు పక్కనే ఉన్న శివాలయంలోకి వెళ్లారు. అప్పుడు దీపాలు ఆరిపోయాయి. అది చూసి బాధతో శివ నామ స్మరణ చేసి కీర్తనలు పాడారు. అప్పుడు దీపాలు తిరిగి వెలిగాయి. అప్పుడే ఆయన తన తప్పుకి ప్రాయశ్చిత్తం కోసం కోటి లింగాలను ప్రతిష్ట చేయడానికి సంకల్పం చేశారని చెబుతారు. కోటి లింగేశ్వర యాత్రా దర్శనం అద్భుతం అని చెప్పొచ్చు. 
– ఈఎస్‌ మాధవన్, విశాఖపట్నం 

(చదవండి:
 

Advertisement
 
Advertisement
Advertisement