భూమి సూర్యుడి చుట్టూ, తన చుట్టూ తనే తిరుగుతూ ఉంటుంది. ఎంత తిరిగినా మనల్ని పడిపోకుండా నిలబెడుతుంది. మనం జీవించడానికి గాలి, నీళ్లు, వెలుగు ఫ్రీగా ఇస్తుంది. మన జీవనానికి ఎంతో మేలు చేస్తున్న నేల తల్లిని రోజూ ఉదయం నిద్ర లేవగానే తాకి, కళ్లకు అద్దుకుంటే మనలో ఎంతో ప్రేమ, బాధ్యత కలుగుతాయి. ప్రపంచంలో ఎక్కడెక్కడో అగ్నిపర్వతాలు పేలుతుంటాయి. సునామీలు వస్తుంటాయి. కానీ, ఇక్కడ మనల్ని ఎంతో సురక్షితంగా ఉంచుతుంది.
నిర్లక్ష్యం తగదు
భూమి మనకు రోజులో 24 గంటల సమయం ఇచ్చింది. సగం వెలుతురు, సగం చీకటి. వెలుగులో పని చేసుకోవాలి, చీకటిలో విశ్రాంతి తీసుకోవాలి. ఎంతో జీవరాశికన్నా మనకు మంచి ఆలోచనలు ఇచ్చింది. తినడానికి, ఉండటానికి ఎంతో మంచిని ఇచ్చిన భూదేవిని మనం ఎంత బాగా చూసుకోవాలి. కానీ, మనలో చాలా మంది ఏం చేస్తారు, భూమి మీద ఉమ్మివేస్తారు, కాళ్లతో తన్నుతుంటారు, చెత్త పడేస్తుంటారు.. చాలా నిర్లక్ష్యంగా ఉంటారు. మనకు భూమి మీద ఉండే అవకాశాన్ని, హాయిగా తిరిగేలా సంతోషాన్ని ఇస్తున్న భూమిని శుభ్రంగా ఉంచుతూ, మనం కూడా మంచి చేస్తూ ఉంటే భూమితల్లి సంతోషిస్తూ, మనల్ని ఆశీర్వదిస్తుంది.
సరిపడే కాంబినేషన్
మన చుట్టూ ఎంత నీటుగా పెట్టుకుంటామో అంత మంచిని తిరిగి ఇస్తుంది భూమితల్లి. చెట్లు మనకు ఆక్సిజన్‌ని ఇస్తాయి, మనం వాటికి కార్బన్‌డై ఆక్సైడ్‌ను ఇస్తాం. ఉత్తర దక్షిణ ధ్రువాలు ఎప్పుడూ కలవవు. అలాగే అందరూ భిన్నంగా ప్రవర్తిస్తారు. కానీ, ఒకదాని నుంచి ఒకటి సాయం పొందుతూ కలిసి మెలిసి ఉంటాయి. ఇచ్చి పుచ్చుకోవడం అనే కాంబినేషన్ మన చుట్టూతా ఉంది. ఒక చెట్టు పువ్వు, కాయ, పండు ఇస్తుంది. మనం కూడా మన చుట్టూ ఉండేవారికి మనలోని మంచి పువ్వులను, ఫలాలను ఇవ్వాలి.
ఆనందమే బహుమతి
సూర్యోదయం వేళలలో పక్షుల కిలకిలారావాలు వినిపిస్తాయి. మొక్కలు రంగు రంగుల అందమైన పువ్వులను ఇస్తాయి. చెట్లు నీడను ఇస్తాయి. వర్షం పడితే నేల నుంచి మంచి వాసన వస్తుంది. ఇవన్నీ భూమాత మనకు ఇస్తున్న చిన్న చిన్న బహుమతులు. మన అమ్మ మనల్ని ప్రేమగా చూసుకుంటుంది కదా, అలాగే భూమాత కూడా ఎలాంటి ఫలితం ఆశించకుండా మనందరినీ చూసుకుంటోంది. చిన్నవాళ్లమా, పెద్దవాళ్లమా అని కూడా చూడదు. ప్రతి జీవికీ ఈ భూమ్మీద చోటు ఇచ్చింది. పక్షులకు గూళ్లు, జంతువులకు అడవులు, మనుషులకు ఇళ్లు.. అన్నీ భూమాత ఒడిలోనే ఉన్నాయి. ఇన్ని ఇస్తున్న భూమాతకు మనం తిరిగి ఏం ఇస్తున్నాం
∙మొక్కలను నాటి, సంరక్షించాలి. చెట్లను కాపాడుకోవాలి
∙ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలి
∙నీటి వృథాను అరికట్టాలి. భూమితల్లి ఆరోగ్యంగా ఉంటేనే మనమూ బాగుంటాం అనే ఆలోచనను చేయాలి. ఎంతో నేర్చుకునే అవకాశం ఇస్తున్న భూమిని మనం ఎలా చూసుకోవాలో మీ ఆలోచనల ద్వారా చూపండి. ధన్యవాదాలు చెబుతూ బాధ్యతగా నడుచుకుంటే ఎన్నో ఆనందాలను మనం అందుకోవచ్చు. ఈ విధంగా చెబితే పిల్లలు మరింతగా భూమితో కనెక్ట్ అవుతారు. ఏం చేయవచ్చు, ఏం చేయకూడదు.. అనేవి తమ సృజనతో పెద్దలకే పాఠాలు చెబుతారు.
నిర్వహణ: నిర్మలారెడ్డి
సినీ దర్శకుడు, నటుడు తరుణ్‌భాస్కర్ తల్లి గీతాభాస్కర్. నటిగానూ ఆమె మనకు పరిచయమే. ఇంతవరకే మనకు తెలుసు. కానీ, నలభై ఏళ్లుగా ఆర్ట్ టీచర్‌గా పిల్లల చేత వివిధ రకాల యాక్టివిటీస్ చేయిస్తూ, టీచర్లకు ఆర్ట్ కోర్సులను అందిస్తున్నారు ఆమె. పిల్లలకు, టీచర్లకు క్లాసులను నిర్వహిస్తున్నారు.

ఈ వేసవిలో పిల్లల చేత యాక్టివిటీస్ చేయించడానికి దాస్యం గీతాభాస్కర్ (Dhaassyam Geetha Bhascker) ‘సాక్షి ఫ్యామిలీ’ ద్వారా మన ముందుకు వచ్చారు. ‘ఫైవ్ ఎలిమెంట్స్’పై పిల్లల చేత డ్రాయింగ్, కార్టూన్, నాటకం, పాట, కవిత్వం, రచన.. ఇలా వారి వయసును బట్టి ఎవరెవరు ఏమేం చేస్తారో చేయమనండి. ఆ వి‘చిత్రాల’ను మాకు పంపించండి. ఊరు, పేరు, ఫొటోతో సహా ప్రచురిద్దాం.
మెయిల్ ఐడి sakshisummerkids@gmail.com


