రోజురోజుకి ఎండలు ఏ రేంజ్లో ఉన్నాయో తెలిసిందే. ఈ ఉక్కపోతలకి నోట్లోకి చల్లగా ఐస్‌క్రీమ్ వెళ్తే ఉంటుంది.. ఆ ఆనందం మాటలకందనిది. అందుకే ఈ కాలంలో చిన్న, పెద్ద అంతా ఐస్‌క్రీమ్‌లు తినేందుకు మక్కువ చూపిస్తుంటారు. అలాంటి టేస్టీ.. టేస్టీ.. కూల్ కూల్ ఐస్‌క్రీమ్‌లను ఈ బామ్మ తన ఇంట్లోనే స్వయంగా తయారు చేసి అందిస్తోంది. అత్యంత సహజసిద్ధమైన వాటితో ఎలాంటి యంత్రాలను ఉపయోగించుకుండా రుచికరమైన హోమ్మేడ్ ఐస్‌క్రీమ్‌లు అందిస్తోంది. దశాబ్దాలుగా ఆమె ఇలానే కొనసాగించడం విశేషం. ఆమె అందించే ఈ రుచికరమైన ఐస్‌క్రీమ్‌లు అనతి కాలంలోనే మంచి బ్రాండ్‌గా స్థిరపడిపోయింది. ఎవరా బామ్మ? ఏమా కథ చూద్దామా..!.
అహ్మదాబాద్‌కి చెందిన నిరంజన్ దేశాయ్ ఇంట్లోనే ఐసీక్రీమ్లు తయారు చేయడంలో నైపుణ్యం సాధించారామె. అంతా నిరూబెన్ అని ముద్దుగా పిలుచుకునే ఈ బామ్మ తన వంటగదిలోనే తొలిసారిగా ఐస్‌క్రీమ్ తయారు చేశారట. ఏ ఇతర బ్రాండ్లు ఆ బామ్మ తయారు చేసే ఐస్‌క్రీమ్ రుచికి సరితూగదట. ఆమె మామిడి, సీతాపలం, కొబ్బరి-అల్లం నిమ్మకాయ వంటి ప్లేవర్లలో కృత్రిమ రుచుల్లో ఎలాంటి ప్రిజర్వేటివ్‌లు ఉపయోగించకుండా తయారు చేయడం ఈ బామ్మ ప్రత్యేకత.
అంతేగాదు ఈ బామ్మ తాజాపాలు, మీగడ, స్టీవియా, పండ్లు లేదా డ్రైఫ్రూట్స్ వంటి నాలుగు సాధారణ పదార్థాలనే ఆమె ఉయోగిస్తారు. ఆమె తన ఐస్‌క్రీమ్ వ్యాపారాన్ని 1986లో ప్రారంభించింది. సాధారణ స్టవ్‌పై తయారైన ఆ వ్యాపారం దశాబ్దాలు గడిచేకొద్ది చిన్నపాటి సాంప్రదాయ కొలిమితో కూడిన పత్యేక గదిలో ఐస్‌క్రీమ్‌లు తయారు చేయడం ప్రారంభించారు. వాణిజ్య బ్రాండ్లు సాధారణంగా ఉపయోగించే పెద్ద పారిశ్రామిక యంత్రాలపై ఆధారపడకుండా సాంప్రదాయ పద్ధతిలోనే డెజర్ట్‌లను తయారు చేస్తుంది ఈ బామ్మ బృందం.
అలాగే తన ఐస్‌క్రీం రుచిని కాపాడుకోవడం కోసం ప్రతి రోజు లిమిటెడ్గానే ఐస్‌క్రీమ్‌లు తయారు చేస్తుంటారు. ఆ నేపథ్యంలోనే ఈ బామ్మ ఐస్‌క్రీమ్ ఓ ప్రసిద్ధ బ్రాండ్‌గా స్థిరపడటమే కాదు బల్క్ నుంచి టేక్ అవే ఆర్డర్ల అందించే స్థాయికి చేరువైంది. మొదటగా గులాబీ-కొబ్బరి, మిరియాలు, చాక్లెట్, బాదం, పిస్తా, కేసర్, యాలకులు వంటి రుచులతో ప్రారంభమైన ఈ నిరుబెన్ బామ్మ దుకాణం ప్రస్తుతం దాదాపు 27 రకాలా వైవిధ్యభరితమైన ఐస్‌క్రీమ్‌లను అందిస్తుంది.
అయితే ఈ బామ్మ వయసు పైబడటంతో కొన్ని రకాల పదార్థాలను సేకరించడం కష్టంగా మారి కొన్ని రకాలా ఐస్‌క్రీమ్‌ల తయారీని నిలిపివేసినప్పటికీ..కస్టమర్లు ఇష్టంగా ఆస్వాదించే కొన్ని రకాల హోమ్మేడ్ ఐస్‌క్రీమ్‌లను మాత్రం ఇప్పటికీ అందిస్తోంది. తన కాళ్లపై తాను నిలబడాలన్న తాపత్రయం ఉంటే.. ఎంత సవాలుతో కూడిన పనులైనా సునాయాసంగా జయిస్తూ ముందుకు సాగిపోతారనేందుకు ఈ బామ్మే ఉదాహరణ కదూ..!.
(చదవండి: కేన్స్ రెడ్‌కార్పెట్‌పై పటోలా గౌనులో మెరిసిన మౌనీరాయ్..!)


