
దేశ టెలికం పరిశ్రమలో ఒకప్పుడు రారాజులా వెలుగొందిన పారిశ్రామికవేత్త ఆయన. సొంతంగా రెండు ఐలాండ్‌లు.. విదేశాలలో వందల కోట్ల విలువైన విలాస భవనాలతో రాజభోగం అనుభవించిన ఎయిర్‌సెల్ వ్యవస్థాపకుడు సి.శివశంకరన్ తర్వాత కాలం కలిసిరాక నష్టాలలో కూరుకుపోయి దివాళా తీశారు. జీవితంలో ప్రతిఒక్కరికీ గతంలో చేసిన పొరపాట్ల గురించి పశ్చాత్తాపం ఉంటుంది. అప్పుడా తప్పు చేయకపోయింటే బాగుండు అని అనుకుంటుంటారు. శివశంకరన్ కూడా అలాంటి పశ్చాత్తాపాలనే వ్యక్తం చేశారు.
రెండే తప్పులు
దివాళా తీసిన సెల్యులార్ ఆపరేటర్ ఎయిర్ సెల్ వ్యవస్థాపకుడు సి.శివశంకరన్ ఇటీవల తనలో ఇంకా ఉన్న పశ్చాత్తాపాల గురించి నోరు విప్పారు. రణ్వీర్ అల్లాబాడియాతో కలిసి పాడ్‌కాస్ట్‌లో మాట్లాడిన ఈ పారిశ్రామికవేత్త రూ.7,000 కోట్లు కోల్పోయి తిరిగి పుంజుకున్న తన ప్రయాణం గురించి వెల్లడించారు. తన జీవితకాల అదృష్టాన్ని పోగొట్టిన రెండు చిన్న తప్పులను బయటపెట్టారు. అవి ఒకటి హిందీ నేర్చుకోకపోవడం, మరొకటి తన కెరీర్ ప్రారంభంలో ఢిల్లీ లేదా ముంబై వంటి ప్రధాన నగరాలకు మకాం మార్చకపోవడం.
హిందీ నేర్చుకుని ఉంటే..
తాను హిందీ నేర్చుకుని ఉంటే 140 కోట్ల మంది భారతీయులను ఆకర్షించేవాడినని శివశంకరన్ అన్నారు. కచ్చితంగా రూ.లక్ష కోట్లు సంపాదించేవాడిని. భౌగోళికం, భాష తనను భారతదేశ అధికార కారిడార్ల నుంచి ఎలా దూరం చేశాయో స్వయంకృషితో ఎదిగిన ఈ బిజినెస్ టైకూన్ వివరించారు.
అప్పు ఎప్పుడూ చేయలేదు
'నేను ఎప్పుడూ అప్పులు చేయాలనుకోను. నేను డబ్బును ఆకర్షిస్తాను" అని శివశంకరన్ అన్నారు. 68 ఏళ్ల జీవితంలో తాను వ్యక్తిగతంగా ఎప్పుడూ రూ.100 కూడా అప్పు తీసుకోలేదన్నారు. వ్యవస్థాపక ప్రవృత్తి, బిజినెస్ పరిజ్ఞానం ఉన్నప్పటికీ అతిపెద్ద డీల్స్ చేజారడానికి కారణం తనకు దూరదృష్టి లేకపోవడం కాదని, బహుశా కనెక్షన్ లేకపోవడం వల్ల కావచ్చునని వెల్లడించాడు.
రియల్ ఎస్టేట్ లో భారీ పెట్టుబడులు
దివాలా దాఖలు చేయడానికి ముందు తన అత్యంత ఖరీదైన కొనుగోళ్లను కూడా శివశంకరన్ వెల్లడించాడు. రియల్ ఎస్టేట్ లో భారీగా పెట్టుబడులు పెట్టానని, ప్రపంచవ్యాప్తంగా అనేక ఇళ్లు కొన్నానని చెప్పారు. సీషెల్స్ లో తనకు రెండు ద్వీపాలు ఉండేవని, వాటిని ఇప్పుడు అమ్మేశానని వెల్లడించారు. రిపబ్లిక్ ఆఫ్ శివ పేరుతో సొంత దేశంలా ఏర్పాటు చేసుకుని అక్కడ నివాసం ఉండాలని ఈ దీవులను కొనుగోలు చేశానని చెప్పారు. అన్ని ఖండాల్లో నివాసం ఉండాలనే కోరికతో సీషెల్స్, అమెరికా, కెనడా, లండన్‌లో ఇళ్లు కొన్నట్లు శివశంకరన్ చెప్పుకొచ్చారు.