మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులకు కొన్ని ప్రత్యేక సందర్భాల్లో థర్డ్‌పార్టీ (ఇన్వెస్టర్ పేరిట మరొకరు) చెల్లింపులను అనుమతించే ప్రతిపాదనను సెబీ తీసుకొచ్చింది. ప్రస్తుత నిబంధనల కింద మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టాలంటే ఇన్వెస్టర్ తన బ్యాంక్ ఖాతా నుంచే ఆ మొత్తాన్ని బదిలీ చేయగలరు. మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ నుంచి వచ్చిన సూచనలతో సెబీ ఈ కొత్త ప్రతిపాదనతో ముందుకొచ్చింది.
ఉదాహరణకు ఉద్యోగి తరఫున పెట్టుబడులకు యాజమాన్యం చెల్లింపులు చేయొచ్చు. వేతనం నుంచి ఈ మేరకు యాజమాన్యం మినహాయించుకుంటుంది. అలాగే, అస్సెట్ మేనేజ్మెంట్ సంస్థలు (ఏఎంసీలు) మ్యూచువల్ ఫండ్ పంపిణీదారులకు కమీషన్‌ను నగదు రూపంలో కాకుండా మ్యూచువల్ ఫండ్స్ యూనిట్ల రూపంలో చెల్లింపులు చేసేందుకూ ఈ ప్రతిపాదన వీలు కల్పించనుంది. అలాగే, ఇన్వెస్టర్లు తమ చందాలో లేదా రాబడిలో కొంత మొత్తాన్ని సామాజికాభివృద్ధికి అందించే ప్రతిపాదనను కూడా సెబీ చేసింది. జూన్ 10 వరకు వీటిపై అభిప్రాయాలు తెలియజేయాలని కోరింది.


