ప్రముఖ వాహన తయారీ సంస్థ మారుతి సుజుకి తన అన్ని మోడళ్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. సవరించిన ధరలు జూన్ 2026 నుంచి అమల్లోకి రానున్నాయి. మోడల్, వేరియంట్‌ను బట్టి తమ వాహనాల ధరలు రూ. 30,000 వరకు పెరుగుతాయని కంపెనీ తెలిపింది.
ఆటోమొబైల్ పరిశ్రమపై ప్రభావం చూపుతున్న ముడిసరుకుల ఖర్చుల నిరంతర పెరుగుదల, కొనసాగుతున్న ద్రవ్యోల్బణ ఒత్తిళ్ల కారణంగానే ధరలు పెంచడం జరిగిందని మారుతి సుజుకి వెల్లడించింది. ఈ ప్రభావంలో కొంత భాగాన్ని భరించేందుకు గత కొన్ని నెలలుగా తాము తగిన చర్యలు చేపడుతున్నప్పటికీ.., ప్రస్తుత ప్రతికూల వ్యయ వాతావరణం కారణంగా ధరల భారాన్ని పాక్షికంగా వినియోగదారులపై మోపడం తప్పడం లేదని కంపెనీ తెలిపింది.
వినియోగదారులపై భారాన్ని వీలైనంత వరకు తగ్గించడానికి తాము ప్రయత్నించామని, అయితే తమ పోర్ట్‌ఫోలియోలోని అన్ని మోడళ్లలో ఈ పెరుగుదల వేర్వేరుగా ఉంటుందని మారుతి సుజుకి తెలిపింది. కాగా.. మహీంద్రా, టాటా మోటార్స్, హ్యుందాయ్ మోటార్ ఇండియా వంటి కంపెనీలు ఇప్పటికే వాహనాల ధరల పెంపును అమలు చేశాయి.


