ఉద్యోగం పోయింది.. ఈఎంఐ కట్టలేని స్థితి నుంచి విజయం! | From Job Loss and Crushing EMIs to a Remarkable Success Story | Sakshi
Sakshi News home page

ఉద్యోగం పోయింది.. ఈఎంఐ కట్టలేని స్థితి నుంచి విజయం!

May 21 2026 3:47 PM | Updated on May 21 2026 4:24 PM

From Job Loss and Crushing EMIs to a Remarkable Success Story

ఒకప్పుడు నెలకు రూ.5 లక్షల జీతం తీసుకుంటూ.. పెద్ద కంపెనీలో డైరెక్టర్ స్థాయిలో పనిచేసిన వ్యక్తి, ఒక్కసారిగా ఉద్యోగం కోల్పోయి జీవితంలో తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొన్నాడు. ఆ తరువాత ఎదురైన ఇబ్బందులే అతన్ని జీవితంలో సక్సెస్ సాధించేలా చేశాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

గౌరవ్ కవాత్రా అనే వ్యక్తి 2018లో ఆయన ఒక చైనా మల్టీనేషనల్ కంపెనీలో డైరెక్టర్‌గా పనిచేశారు. ఆ సమయంలో నెలకు రూ.5 లక్షల జీతం ఉన్నప్పటికీ.. రూ. 2 కోట్ల హౌస్ లోన్ ఉండేది. ప్రతి నెల జీతం వస్తుండడంతో ఈఎంఐ చెల్లించడానికి ఇబ్బంది ఉండేది కాదు. ఇలాంటి సమయంలో అనుకోకుండా.. సంస్థ అతన్ని ఉద్యోగం నుంచి తొలగించింది.

అనుకోకుండా ఉద్యోగం పోవడంతో కవాత్రాకు ఏం చేయాలో అర్థం కాకుండా పోయింది. జీవితంలో అత్యంత కష్టమైన రోజులు ప్రారంభమయ్యాయి. కొత్త ఉద్యోగం కోసం ఆయన అనేక ప్రయత్నాలు చేశారు. ఎన్నో తిరస్కరణలకు గురయ్యారు.  నిరాశ, భయం, ఆర్థిక ఒత్తిడి కవాత్రాను మానసిక ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేసింది. ఇలాంటి సమయంలో రాత్రిళ్లు నిద్రపోయేవాడు కాదు. తీవ్ర ఆందోళనతో రోజుకు 12 నుంచి 15 సిగరెట్లు తాగేవాడు. ఆ అలవాటును మానుకోవడానికి ఆయనకు ఎనిమిదేళ్లు పట్టిందని చెప్పారు.

ఉద్యోగం లేకుండా ఉన్నప్పుడు.. తన కుమార్తె అడిగిన కొన్ని ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పలేని పరిస్థితి వచ్చిందని కవాత్రా తన బాధను సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. పొరుగువారు.. ఇంట్లో కూర్చొని ఉన్న తనను చూసినప్పుడు తాను మరింత అవమానంగా ఫీలయ్యేవాడినని చెప్పారు.

అయితే.. ఈ అనుభవం అతని జీవితానికి ఒక పాఠం నేర్పింది. పెద్ద కంపెనీలో ఉద్యోగం, అధిక జీతం ఇవన్నీ శాశ్వత భద్రత కాదని కవాత్రా గ్రహించారు. నేను నా జీవితాన్ని ఒక కార్పొరేట్ లోగోకు బానిసలా మార్చుకున్నాను, అని ఆయన అన్నారు. డిగ్రీలు ఒక స్థాయి వరకు మాత్రమే ఉపయోగపడతాయని, కానీ నైపుణ్యాలు జీవితాంతం విలువనిస్తాయని ఆయన గుర్తించారు.

ఈ సంక్షోభం తర్వాత.. ఆయన తనలో కొత్త నైపుణ్యాలను అభివృద్ధి చేసుకున్నారు. మార్కెటింగ్ ఎలా చేయాలి, ప్రజలను ఎలా నిర్వహించాలి, వ్యాపారాన్ని ఎలా నడపాలి వంటి విషయాలను నేర్చుకున్నారు. క్రమంగా ఆయన కన్సల్టింగ్ రంగంలో అడుగుపెట్టి తన కెరీర్‌ను తిరిగి నిర్మించుకున్నారు.

ఇదీ చదవండి: దిగ్గజ కంపెనీ లేఆఫ్స్‌.. 8,000 మందిపై ప్రభావం!

ప్రస్తుతం ఆయన దేశంలోని అనేక పెద్ద ప్రాజెక్టులకు సలహాదారుగా పనిచేసినట్టు చెబుతున్నారు. రూ.6,500 కోట్ల విలువైన ప్రాజెక్టులకు సలహాలు ఇచ్చారని, 19 రాష్ట్రాల్లో 65 కంపెనీలతో కలిసి పనిచేశారని పేర్కొన్నారు. ఒకప్పుడు ఉద్యోగం కోల్పోయిన వ్యక్తి, ఇప్పుడు అనేక మందికి మార్గదర్శకుడిగా మారడం.. ఆయన ప్రయాణంలో గొప్ప విజయం అనే చెప్పాలి.

Advertisement
 
Advertisement
Advertisement