భారీ కాయంతో ఉన్న ఇండియన్ గౌర్ (అడవి దున్న)
సాత్పూర టైగర్ రిజర్వ్ నుంచి 120 గౌర్లు తెప్పించడానికి అటవీశాఖ ప్రణాళిక
ఈ సమయంలో ఎన్ఎస్టీఆర్కు వచ్చిన అడవిదున్న
ఆత్మకూరు రూరల్: 160 ఏళ్ల కిందట ఆచూకీ లేకుండా పోయిన ఇండియన్ గౌర్ (అడవి దున్న)లను నల్లమల అటవీ ప్రాంతానికి తీసుకురావాలని అటవీశాఖ ప్రణాళిక వేస్తున్న తరుణంలో అనుకోని అతిథిలా ఓ అడవి దున్న పర్వత శ్రేణిలో కనువిందు చేస్తోంది.
ప్రణాళిక దశలో ఉండగా..
160 ఏళ్ల కిందట నుంచి ఆచూకీ లేని దున్నలను తిరిగి నల్లమలకు రప్పించే ప్రయత్నాలు ఊపందుకున్నాయి. ఓ ఫార్మాస్యూటికల్ కంపెనీ ఇందుకోసం రూ.కోటి విరాళంగా ప్రకటించింది. వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ (డబ్ల్యూడబ్ల్యూఎఫ్) ఇందుకు సంబంధించిన సాంకేతిక సలహాలు ఇస్తోంది. మధ్యప్రదేశ్ నుంచి 120 అడవి దున్నలను నల్లమలకు తీసుకువచ్చే మహత్తర ప్రాజెక్ట్‌కు ఎన్ఎస్టీఆర్ (నాగార్జునసాగర్ – శ్రీశైలం టైగర్ రిజర్వ్) నాయకత్వం వహిస్తోంది.
ఇందుకోసం ఎన్ఎస్టీఆర్ ఆత్మకూరు డిప్యూటీ డైరెక్టర్ విగ్నేష్ అపావ్ మధ్యప్రదేశ్‌లోని సాత్పూరా టైగర్ రిజర్వ్ డీడీ రిషిబా సింగ్ నేతృత్వంలో అటవీ అధికారుల సమన్వయ సమావేశం జరిగింది.మొత్తం 120 అడవి దున్నలను బ్యాచ్‌లుగా రప్పించాలని నిర్ణయించారు. వీటికి నల్లమల వాతావరణం అలవాటు కావడానికి ప్రత్యేక ఎన్క్లోజర్లు ఏర్పాటు చేయనున్నారు. ఈ తరుణంలో మానవ ప్రయత్నం లేకుండానే అడవి దున్న కృష్ణా నది దాటి వచ్చి ఎన్‌ఎస్‌టీఆర్‌లో ముందస్తు అతిథిగా తిరుగుతోంది.

పులులకు మంచిరోజులు
అడవిదున్న సుమారు 800 నుంచి 1500 కిలోలు ఉంటుంది. అలాంటి అడవి దున్నల సమూహం నల్లమలలో తిరిగితే ఆహార కొరతతో ఇబ్బంది పడుతున్న పెద్ద పులులకు సమస్య తీరినట్టేనని అటవీ అధికారులు భావిస్తున్నారు. వయోజన అడవి దున్నను వేటాడడం పెద్దపులికి అంత సులభం కాకపోయినా ఒక్కో హెర్డ్‌లో ఉండే పిల్ల దున్నలు, వృద్ధాప్యంలో ఉండే దున్నలు పులులకు అందుబాటులో ఉండే ఆహారమే.
డిసెంబర్ నాటికి తీసుకొస్తాం
నల్లమలలో అదృశ్యమైన అడవి దున్నలను తిరిగి తీసుకు వచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. డిసెంబర్ నాటికి తొలివిడత దున్నలను మధ్యప్రదేశ్ లోని సాత్పూరా టైగర్ రిజర్వ్ నుంచి నల్లమలకు తీసుకు వస్తాం. వాటిని అడవిలో ప్రత్యేక ఎన్క్లోజర్లలో ఉంచి పరిశీలన అనంతరం స్వేచ్ఛగా వదులుతాం.
– విగ్నేష్ అపావ్, డిప్యూటీ డైరెక్టర్, ప్రాజెక్ట్ టైగర్, ఆత్మకూరు


