Wing Commander Vyomika Singh
-
ప్రతిదాడులకు ఆస్కారం లేకుండా దాడి చేశాం
న్యూఢిల్లీ: ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు మరింతగా పెచ్చరిల్లకుండా చూసుకుంటూనే సరైన రీతిలో ప్రతీకార చర్యలు చేపట్టామని ప్రపంచ దేశాలకు భారత్ స్పష్టంచేసింది. ఈ మేరకు బుధవారం భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ, కల్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్‌లతో కలిసి ఢిల్లీలోని నేషనల్ మీడియా సెంటర్లో దాడి వివరాలను మీడియాకు వెల్లడించారు. తొలుత విక్రమ్ మిస్రీ మాట్లాడారు. ‘‘ ఏప్రిల్ 22న పహల్గాం ఉగ్రదాడి సూత్రధారులు, పాత్రధారులను చట్టం ముందుకు ఈడ్చుకురావాల్సిన అత్యావశ్యక పరిస్థితుల్లో ఈ దాడులు చేయాల్సి వచ్చింది. తమ భూభాగంలో ఉగ్ర వ్యవస్థపై పాకిస్తాన్ ఎలాంటి చర్యలు తీసుకోని కారణంగా మేం ‘బాధ్యతాయుతమైన’ దాడులు చేశాం. పహల్గాం ఉదంతం తర్వాత సైతం మరోసారి భారత్‌లో దాడులతో తెగించేందుకు ఉగ్రసంస్థలు కుట్రలు పన్నినట్లు విశ్వసనీయ నిఘా సమాచారం అందటంతో ముందస్తుగా మెరుపుదాడులు చేశాం. పౌర, జనావాసాలకు ఏమాత్రం హాని కలగకుండా కేవలం ఉగ్రవాదుల మౌలికవసతులే లక్ష్యంగా దాడులు జరిపాం. సీమాంతర దాడులు, సీమాంతర చొరబాట్లను నిరోధించడమే లక్ష్యంగా మంగళవారం అర్ధరాత్రి దాడులు కొనసాగాయి. బైసారన్‌లో హేయమైన ఉగ్రదాడి జరిగింది. అమాయకులను తమ కుటుంబసభ్యుల కళ్లెదుటే తలపై గురిపెట్టి కాల్చిచంపారు. దీంతో కుటుంసభ్యుల్లో అంతులేని విషాదం, భయం అలుముకున్నాయి. భారత్ అదే స్థాయిలో ఉగ్రవాదులకు దీటైన సమాధానం చెప్పదల్చుకుంది’’ అని మిస్రీ స్పష్టంచేశారు. ‘‘జమ్మూకశ్మీర్‌లో సాధారణ పరిస్థితులు నెలకొనడం ఇష్టంలేకే ఉగ్రవాదులు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. కోట్ల మంది పర్యాటకులతో వృద్ధిబాటలో పయనిస్తున్న కశ్మీర్ ఆర్థికవ్యవస్థను ఉగ్రవాదులు కూలదోయాలనున్నారు. ప్రత్యేకంగా హిందువులను చంపేసి కశ్మీర్ లోయలో, దేశంలో మత విద్వేషాలను రెచ్చగొట్టాలని చూశారు. కానీ భారతీయులు వీళ్ల నమ్మకాన్ని వమ్ముచేశారు. ఈ విషయంలో మన ప్రజలను కచ్చితంగా మెచ్చుకోవాల్సిందే’’ అని మిస్రీ అన్నారు. నారీశక్తి.. నాయకత్వం ‘ఆపరేషన్ సిందూర్’ దాడి వివరాలను ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన ఇద్దరు మహిళా అధికారులు మీడియాకు వివరించడం అక్కడి వారందర్నీ ఆశ్చర్యపరిచింది. భారత్ ఏఏ ప్రాంతాలపై దాడి చేసిందనే పూర్తి వివరాలను భారత ఆర్మీ తరఫున కల్నల్ సోఫియా ఖురేషి, భారత వాయుసేన తరఫున వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్‌లు మీడియాకు వెల్లడించారు. పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే), పాకిస్తాన్‌లోని ఏఏ ప్రాంతాల్లో ఏ విధంగా భారత్ దాడులు చేసిందో ఈ అధికారిణులు ఇద్దరూ సవివరంగా చెప్పారు. ధైర్యసాహసాలతో దాడులు చేసిన వైనాన్ని వనితలతో చెప్పించడం వెనుక భారత సర్కార్ దౌత్య పాటవం దాగి ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. లింగవివక్షకు తావులేకుండా కీలక సమయాల్లోనూ భారత్ సమానత్వానికి, మహిళా సాధికారతకు జై కొడుతుందని ఈ మీడియా సమావేశంలో భారత్ మరోసారి చాటిచెప్పిందని విశ్లేషకులు వ్యాఖ్యానించారు. సోఫియా ఖురేషి ప్రస్తుతం ఆర్మీ కార్ప్స్ ఆఫ్ సిగ్నల్స్‌లో కల్నల్‌గా ఉన్నారు. వింగ్ కమాండర్ వ్యోమికా ప్రస్తుతం హెలికాప్టర్ పైలట్‌గా సేవలందిస్తున్నారు. ఖురేషీ హిందీలో, వ్యోమికా ఇంగ్లిష్ లో మాట్లాడారు. ‘‘ పహల్గాం దాడికి ప్రతీకారంగానే ఈ ఆపరేషన్ చేపట్టాం. 9 ఉగ్రస్థావరాలపై దాడులు జరిపాం. గత మూడు దశాబ్దాల్లో పాకిస్తాన్లో ఎన్నో ఉగ్ర స్థావరాలు నెలకొల్పారు. ఇక్కడ రిక్రూట్మెంట్, భారత్‌పై విద్వేషాన్ని నూరిపోసేలా ప్రసంగాలు ఇవ్వడం, శిక్షణ కేంద్రాలున్నాయి’’ అని సోఫియా ఖురేషీ చెప్పారు. ‘‘ ఈ దాడుల్లో పాకిస్తాన్ ఆర్మీ సంబంధ ప్రాంతాల జోలికి వెళ్లలేదు. అత్యంత కచ్చితత్వంతో ఉగ్రవాదుల స్థావరాలపైనే దాడులు చేశాం. దాడి ప్రాంత పరిధికి తగ్గట్లుగా సరైన ఆయుధాలను, అనువైన సాంకేతకతను వినియోగించాం. దీని వల్ల లక్ష్యాలను మాత్రమే ధ్వంసంచేశాం. చుట్టుపక్కల ప్రాంతాలకు ఎలాంటి నష్టం జరగలేదు. ముందుగా నిర్ణయించుకున్న భవనాలను మాత్రమే నేలమట్టంచేశాం. ఆ శిబిరాల్లోని ఉగ్రవాదులను హతమార్చాం. లక్ష్యాల ఛేదనలో భారత సాయుధ బలగాల ప్రణాళికా రచన, దాడి, సామర్థ్యాలను ఈ దాడులు మరోసారి చాటిచెప్పాయి. ఇకమీదట పాకిస్తాన్ ఉద్రిక్తతలను పెంచుతూ దాడులు చేయాలని చూస్తే భారత్ కనీవినీ ఎరుగని రీతిలో దాడులతో విరుచుకుపడుతుందని మరోసారి స్పష్టంచేస్తున్నా. జై హింద్’’ అని వ్యోమికా సింగ్ తన మీడియా బ్రీఫింగ్ను ముగించారు. ఈ ఇద్దరు మహిళాధికారుల మధ్యలో కూర్చొని మీడియాకు వివరాలు వెల్లడించిన విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ ఒక కశ్మీరీ పండిట్. కీలక ప్రెస్మీట్లో ఎవరెవరు వేదికపై ఆసీనులై భారతవాణిని ప్రపంచానికి వినిపించాలనే విషయంలో కేంద్రప్రభుత్వానికి అత్యంత స్పష్టత ఉందని ఈ ముగ్గురిని చూస్తే తెలుస్తోంది. -
Operation Sindoor: యుద్ధ స్వరం... ఆ ఇద్దరు
‘ఆపరేషన్ సిందూర్’ ఒక సంచలనమైతే... ప్రెస్మీట్లో మిలిటరీ బ్రీఫింగ్ చేసిన ఇద్దరు మహిళా సైనికాధికారులు మరో సంచలనం. ఆ ఇద్దరు... చెప్పకనే ఎన్నో చెప్పారు. వారిలో మతాలకతీతమైన జాతీయ సమైక్యత కనిపించింది. ఎలాంటి అవరోధాలనైనా అధిగమించి జయించే మహిళాశక్తి కనిపించింది. ఆపరేషన్‌కు ‘సిందూర్’ అని పేరు పెట్టడం ప్రతీకాత్మకం. ఐక్యత, మత సామరస్యానికి సంబంధించిన శక్తిమంతమైన సందేశాన్ని తెలియజేసేలా ఇద్దరు మహిళా అధికారులు బ్రీఫింగ్‌కు నేతృత్వం వహించాలి అనే నిర్ణయం కూడా ప్రతీకాత్మకమైనదే. ప్రపంచ ఆసక్తి ఇప్పుడు రెండు పేర్లపై కేంద్రీకృతమైంది. కల్నల్ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్...భారత చరిత్రలో తొలిసారి ఇద్దరు మహిళా అధికారులు భారీ సైనిక చర్యపై అధికారిక విలేకరుల సమావేశానికి నాయకత్వం వహించారు. ఉగ్రవాదాన్ని గట్టిగా ఎదుర్కోవాలనే దేశ సంకల్పాన్ని మాత్రమే కాకుండా సాయుధ దళాల్లో పెరుగుతున్న మహిళల బలానికి వారు ప్రతీకలుగా కనిపించారు. ‘ఆపరేషన్ సిందూర్’ వివరాలను పంచుకోవడానికి నిర్వహించిన విలేకరుల సమావేశానికి కల్నల్ సోఫియా ఖురేషీ, భారత వైమానికి దళానికి చెందిన వింగ్ కమాండర్ వ్యోమికాసింగ్ నేతృత్వం వహించిన నేపథ్యంలో వారి గురించి తెలుసుకోవాలనే ఆసక్తి సర్వత్రా మొదలైంది. ‘పహల్గామ్లో ఇరవై ఆరుమందిప్రాణాలను బలిగొన్నారు. ఉగ్రవాద బాధితులకు న్యాయం చేసేందుకే ఆపరేషన్ సిందూర్ ప్రారంభించాం’ అన్నారు సోఫియా ఖరేషీ. పాక్, పాక్ ఆక్రమిత జమ్ము కశ్మీర్‌లోని తొమ్మిది ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకొని విజయవంతంగా దాడి చేసినట్లు ఆమె తెలియజేశారు. సంక్షోభ పరిస్థితుల్లో సైన్యం, ప్రజల మధ్య కమ్యూనికేషన్‌ను కొనసాగించడంలో ప్రొఫెషనల్ ఆఫీసర్స్ పాత్రను వింగ్ కమాండర్ వ్యోమికాసింగ్ వివరించారు.ఆ ఇల్లు సైనిక శిబిరంఅది ఇల్లు అనడం కంటే... చిన్నపాటి సైనిక శిబిరం అంటే బాగుంటుంది! కొట్ట వచ్చినట్లు కనిపించే మిలిటరీ క్రమశిక్షణ ఒకవైపు...‘ఆ యుద్ధంలో ఏం జరిగిందో తెలుసా?’‘ఒక వీర సైనికుడి గురించి చెబుతాను విను..’ ఇలాంటి విశేషాలు మరోవైపు. గుజరాత్‌లోని వడోదరాకు చెందిన ఖురేషిది సైనిక కుటుంబ నేపథ్యం. తాత, తండ్రీ సైన్యంలో పనిచేయడమే తాను సైన్యంలో పనిచేయాలనుకోవడానికి కారణం. బలం. ‘మహారాజా షాయాజీరావు యూనివర్శిటీ’లో బయోకెమిస్ట్రీలో పీజీ చేసిన ఖురేషి 1999 లో షార్ట్ సర్వీస్ కమిషన్ ద్వారా భారత సైన్యంలో చేరారు.చరిత్ర సృష్టించి...పుణెలో జరిగిన ‘ఎక్సర్సైజ్ ఫోర్స్ 18’లో పద్ధెనిమిది దేశాల సైనికులు పాల్గొన్నారు. ఈ విశిష్ట కార్యక్రమంలో భారత సైన్యానికి చెందిన బృందానికి నాయకత్వం వహించి చరిత్ర సృష్టించారు ఖురేషీ. అంతేకాదు.. ‘ఎక్సర్సైజ్ ఫోర్స్ 18’లో పాల్గొన్న 18 బృందాలలో ఆమె ఏకైక మహిళా కమాండర్.గర్వించదగిన కాలంఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షక చర్యల్లో భాగంగా కాంగోలో ఆరేళ్లు పనిచేశారు ఖురేషీ. అక్కడ ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నారు. ఇరు వర్గాల మధ్య కాల్పుల విరమణను పర్యవేక్షించారు. ఒకవైపు శాంతిపునరుద్ధరణ ప్రయత్నాలు చేస్తూనే, మరోవైపు సేవాకార్యమ్రాలకుప్రాధాన్యత ఇచ్చేవారు.‘ఘర్షణాత్మక ప్రాంతాల్లో శాంతిని నెలకొల్పేందుకు చేసిన ప్రయత్నాలు నాకు గర్వకారణం’ అంటారు ఖురేషీ.ఖురేషీలోని నాయకత్వ లక్షణాలు, చొరవ, ధైర్యసాహసాలను అప్పటి ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ బిపిన్ రావత్ గుర్తించారు. ‘సైన్యంలో పురుష, మహిళా అధికారులు అనే తేడా లేదు. జెండర్ప్రాతిపదికన కాకుండా బాధ్యతను భుజాన వేసుకునే సామర్థ్యం, నాయకత్వ లక్షణాల వల్లే ఆమె ఎంపిక జరిగింది’ అన్నారు రావత్. భారత పార్లమెంట్ పై ఉగ్రవాదుల దాడి తర్వాత చేపట్టిన ‘ఆపరేషన్ పరాక్రమ్’లో ఖురేషీ కీలక పాత్ర పోషించారు. ఆమె ధైర్యసాహసాలకు గాను జనరల్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ ప్రశంసలు అందుకున్నారు. కుటుంబ నేపథ్యం ఖురేషీకి సైన్యంలో పనిచేయాలనే లక్ష్యాన్ని ఇచ్చింది. విద్యానేపథ్యం విమర్శనాత్మక ఆలోచన దృష్టిని ఇచ్చింది. సమస్య పరిష్కారానికి శాస్త్రీయ దృష్టిని అందించింది. ఆకాశ పుత్రికఆకాశంలో కనిపించే విమానాలను చూస్తూ అందరు పిల్లల్లాగే చప్పట్లు కొడుతూ తెగ సంతోషించేది వ్యోమికా సింగ్. ఆ సంతోషానికి లక్ష్యం కూడా తోడైంది. ఆకాశంలో దూసుకు పోవాల్సిందే!‘నేను ఆరవ తరగతిలో ఉన్నప్పుడే పైలట్ కావాలనుకున్నాను. ఆకాశాన్ని సొంతం చేసుకోవాలనుకున్నాను. మా పేర్ల అర్థాల గురించి క్లాసులో మాట్లాడుకుంటున్నప్పుడు వ్యోమిక... నీ పేరుకు అర్థం ఆకాశ పుత్రిక అని అరిచారో ఎవరో. దీంతో పైలట్ కావాలనే కోరిక మరింత బలపడింది’ అని ఒక టీవీ షోలో బాల్య జ్ఞాపకాన్ని గుర్తుచేసుకున్నారు వ్యోమికా సింగ్.ఎన్సీసీ పునాదిపై...ఇంజినీరింగ్ చేస్తున్నప్పుడు ఎన్సీసీలో చేరిన వ్యోమికాకు సైనిక క్రమశిక్షణ అలవడింది. భారత వైమానిక దళంలో హెలికాప్టర్ పైలట్‌గా తన కలను నిజం చేసుకున్న వ్యోమిక 2019లో ఫ్లయింగ్ బ్రాంచ్‌లో శాశ్వత కమిషన్ హోదా పొందారు. తన కుటుంబంలో సాయుధ దళాల్లో చేరిన మొదటి వ్యక్తిగా వ్యోమిక గుర్తింపు పొందారు.జమ్మూకశ్మీర్, ఈశాన్యప్రాంతాలతో సహా అత్యంత కఠినమైన భూభాగాల్లో చేతక్, చీతాలాంటి హెలికాప్టర్లు 2,500 గంటలకు పైగా నడిపిన అనుభవం ఆమెకు ఉంది. 2021లో 21,650 అడుగుల ఎత్తులో ఉన్న మణిరంగ్ పర్వతారోహణ యాత్రలో పాల్గొన్నారు. కమాండర్ వ్యోమికా సాహసాన్ని, అంకితభావాన్ని చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్‌తో సహా సీనియర్ డిఫెన్స్ అధికారులు గుర్తించారు. 2020లో అరుణాచల్‌ప్రదేశ్‌లో కీలక రెస్క్యూ ఆపరేషన్‌కు నేతృత్వం వహించి, విపత్కర పరిస్థితుల్లో ఉన్న పౌరులను సురక్షితప్రాంతాలకు తరలించారు. ఈశాన్య భారతంలో వరద సహాయక చర్యల్లో చురుగ్గా పాల్గొన్నారు. విపత్కర పరిస్థితులు ఎదురైనా చెరగని చిరునవ్వు ఆమె సొంతం. ప్రకృతి కల్లోలాలకు వెరవకుండా బాధితులకు అండగా ఉండడం ఆమె నైజం. ఆ ఇద్దరు... ది స్ట్రెంత్ ఆఫ్ ఇండియాకల్నల్ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్‌లపై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. వివిధ పార్టీల నేతలు వీరిని అభినందించారు. ‘ఇది కేవలం బ్రీఫింగ్ మాత్రమే కాదు. సాహసోపేతమైన ప్రకటన. ప్రతి యుద్ధంలో, ప్రతి మిషన్‌లోనూ మహిళలు ముందుండి నడిపిస్తారు’ అని కేంద్ర మాజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ట్వీట్ చేశారు. ‘విలేకరుల సమావేశంలో ఎవరు ఉన్నారో గుర్తుంచుకోండి. వారు... ఇండియన్ ఆర్మీకి చెందిన కల్నల్ సోఫియా ఖురేషీ, వైమానికి దళానికి చెందిన వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్. భుజం భుజం కలిపి ఒకే జెండాను మోస్తున్నారు. ఇది భారతదేశం. ఎప్పుడూ ఇలాగే ఉంటుంది. ఐక్యత, శాంతి ముందు విద్వేషానికి మాటలు ఉండవు’ అని యాక్టివిస్ట్, రైటర్ గుర్మెహర్ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. -
గతానికి భిన్నంగా...
ఏప్రిల్ నెల చివరలో జమ్మూ–కశ్మీర్‌లోని పహల్గామ్లో 26 మంది నిరాయుధులను దారుణంగా హత్య చేసినందుకు ప్రతీకారంగా, మే 7 ఉదయం పాకిస్తాన్లో ఉగ్రవాదులకు స్థావరంగా ఉన్న తొమ్మిది ప్రదేశాలపై భారత సైన్యం దాడి చేసింది. పహల్గామ్ ఘాతుక చర్యకు సమాధానం ఇచ్చి తీరుతామని దేశ రాజకీయ నాయకత్వం స్పష్టం చేయడంతో సైనిక దాడి తప్పదని తేలిపోయింది. అయితే, పాక్ ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై దాడి జరగడం ఇదే మొదటి సారి కాదు, కానీ సరిహద్దు రేఖలు మారుతున్నాయని సూచించే లక్షణాలు ‘ఆపరేషన్ సిందూర్’లో ఉన్నాయి.సరిహద్దును దాటి...పాకిస్తాన్లో ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై చివరి ప్రధాన దాడి 2019 ఫిబ్రవరిలో చోటు చేసు కుంది. ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రావిన్స్‌లోని బాలాకోట్‌ను అప్పుడు భారత వైమానిక దళం లక్ష్యంగా చేసుకుంది. ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా పాకిస్తాన్ కేంద్ర బిందువైన పంజాబ్ ప్రావిన్స్‌లోని ప్రదేశాలపై భారతీయ సైన్యం దాడికి దిగింది. 1971 యుద్ధంలో పాకిస్తాన్ సైన్యం లొంగిపోయిన తర్వాత,భారత వాయుసేన నియంత్రణ రేఖను దాటడం ఇదే మొదటిసారి. దక్షిణ పంజాబ్‌లోని బహావల్పూర్లో జైష్–ఎ–మొహమ్మద్ ప్రధాన కార్యాలయం ఉంది. పంజాబ్‌లోని మరొక ప్రదేశం మురీద్కే! ఇక్కడ లష్కరే తోయిబా చాలా కాలంగా ఉనికిలో ఉంది. అయితే కశ్మీర్లో వాస్తవ సరిహద్దును గుర్తించే ఎల్ఓసీకీ, పాకిస్తానీ పంజాబ్‌కు మధ్య వ్యత్యాసం ఏమిటంటే, స్థిరపడిన అంతర్జాతీయ సరిహద్దు. సూటిగా చెప్పాలంటే, ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై దాడులకు చెందిన భౌగోళిక ప్రాంతం ఇప్పుడు విస్తరించింది. ప్రతీకారం తీర్చుకునే విషయంలో పాకిస్తాన్‌లోని ఏ ప్రదేశం కూడా భారత్ లక్ష్యాలకు దూరంగా లేదని తాజా దాడులు స్పష్టంగా సందేశమిస్తున్నాయి.1971 నాటి యుద్ధంలోని ముఖ్యాంశాలలో ఒకటి, భారత సైన్యంలోని త్రివిధ బలగాలూ పాల్గొనడమే! నాటి యుద్ధంలో పూర్తి విజయం సాధించడానికి త్రివిధ దళాలు కలిసి పనిచేశాయి. ఆపరేషన్ సిందూర్‌లో కూడా మూడు దళాలూ పాల్గొన్నాయని ప్రభుత్వం తెలిపింది. వనరులను అత్యంత సమర్థంగా ఉపయోగించుకోవడానికి సైన్యం దీర్ఘకాలిక లక్ష్యంగా ఉన్న ఇంటిగ్రేటెడ్ థియేటర్ కమాండ్లకు ఇది శుభ సూచకం.నిజానికి భారతదేశం నుండి ప్రతిస్పందన అని వార్యం అయింది. అయినా భారీ స్థాయి దళాల కదలికల ద్వారా భారత్ ప్రతిస్పందన ఉంటుందని చెప్పే సూచన లేవీ లేవు. పాకిస్తాన్ వైపు మాత్రం వారు ప్రతిస్పందన కోసం సిద్ధమవుతున్నప్పుడు గణనీయ స్థాయిలో దళాల కదలిక కనిపించింది. అదే సమయంలో భారత్ సంయమన మార్గాన్ని ఎంచుకుంది. ఆపరేషన్ సిందూర్ సమయంలో జరిగిన దాడుల్లో ఏవీ పాకిస్తాన్ సైన్యాన్ని లక్ష్యంగా చేసుకోలేదు. ఈ దాడిని ఉగ్రవాద మౌలిక సదుపాయాల నిర్మూలనకే పరిమితం చేశారు. దాడుల తర్వాత కూడా ప్రభుత్వం తన మీడియా ప్రకటనలో భారతదేశం తీవ్ర స్థాయి యుద్ధంలోకి వెళ్లకుండా ఉండాలనుకుంటున్నట్లు స్పష్టంగా సూచించింది.ప్రతిదాడి చేయడానికి ముందు, భారతదేశం తాను అనుకున్న విధంగా ప్రతీకారం తీర్చుకోవడానికి గణనీయమైన స్థాయిలో అంతర్జాతీయ మద్దతును సాధించింది. చైనా మాత్రమే దీనికి మినహాయింపు. అదే సమయంలో, అంతర్జాతీయ ప్రధాన శక్తులు వాణిజ్య యుద్ధంతో పాటుగా పశ్చిమాసియాలో, ఉక్రెయిన్‌లో దీర్ఘకాలిక సంఘర్షణ సవాలును ఎదుర్కొంటున్నాయి. కాబట్టి ఇరుదేశాల మధ్య ఘర్షణలు ఒక స్థాయికి మించి పెరగకూడదని అవి ఆశిస్తున్నాయి.వికసిత భారత్, రుణ సంక్షోభ పాక్‌భారతదేశం మూడు దశాబ్దాలకు పైగా జమ్మూకశ్మీర్‌లో పాకిస్తాన్ ప్రాయోజిత ఉగ్రవాదంతో పోరాడు తోంది. ఈ క్రమంలో రెండు దేశాలలోనూ, వేర్వేరు ఆర్థిక పథాల్లో అభివృద్ధి జరుగుతోంది. భారత్ తన ఆర్థిక సరళీకరణ కార్యక్రమాన్ని ప్రారంభించిన 1991 నాటికి, పాకిస్తాన్ తలసరి జీడీపీ భారత్ కంటే ఎక్కువగా ఉంది. తాజాగా ప్రపంచ బ్యాంకు డేటా ప్రకారం, 2023లో పాకిస్తాన్ తలసరి జీడీపీ 1,365 డాలర్లు కాగా, భారత్ జీడీపీ 82 శాతం ఎక్కువగా 2,481 డాలర్ల వద్ద ఉంది. అంటే రెండు దేశాల ఆర్థిక పథాలు వాటి వ్యూహాత్మక ఎంపికలను ప్రభావితం చేశాయి.భారత్ ప్రపంచంలోనే మూడవ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే మార్గంలో ఉంది. ‘బ్రెగ్జిట్’ తర్వాత అది బ్రిటన్‌తో చేసుకున్న అత్యంత ముఖ్యమైన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని ఇటీవలే ముగించింది. మరోవైపు, పాకిస్తాన్ ఒక రుణ సంక్షోభం నుండి మరొక రుణ సంక్షోభానికి గురవుతూ, ఐఎమ్ఎఫ్ ఆపన్న హస్తం కోసం విజ్ఞప్తి చేస్తోంది. అది దాదాపు చైనా కాలనీగా మారింది. ఈ నేపథ్యంలో రెండు దేశాలు ఎంచుకున్న ఎంపికలనూ, పాకిస్తాన్ ఎదుర్కొంటున్న సార్వభౌమాధికారపు నిరంతర బలహీనతనూ పరిశీలించడం అవసరం. ప్రస్తుత పరిస్థితుల్లో జనరల్ అసీమ్ మునీర్‌కు అది ఎంతో ఉపయోగకరంగా ఉండవచ్చు.సంజీవ్ శంకరన్ వ్యాసకర్త ‘మనీ కంట్రోల్’ ఒపీనియన్స్–ఫీచర్స్ ఎడిటర్ -
దృఢసంకల్పంతో...
పహల్గామ్ ఉగ్రదాడికి భారత్ తగిన ప్రతీకారం తీర్చుకుంది. కుటుంబాల విచ్ఛిన్నమే లక్ష్యంగా పురుషులను మాత్రం ఎన్నుకుని... వారి మతం అడిగి మరీ భార్యల ఎదుటే భర్తలను ఉగ్రవాదులు చంపిన వైనం దేశాద్యంతం ప్రకంపనలు సృష్టించింది. ఇది కేవలం ఒక హింసాత్మక ఘటన కాదు. మానసిక యుద్ధ తంత్రం. ఈ విషయంపై భారత్ ఆచితూచి స్పందించింది. ఉద్రేకాలకు పోలేదు. కచ్చితమైన, వ్యూహాత్మకమైన, సమన్వయ యుతమైన మిలిటరీ ప్రతిచర్యకు దిగింది. నిఘా వర్గాల అంచనాలను ఒకటికి రెండుసార్లు పరిశీలించి మరీ ‘ఆప రేషన్ సిందూర్’ను నిర్వహించారు. పహల్గామ్ దాడులకు పాల్పడ్డ ఉగ్రవాదు లకు, పాకిస్తాన్‌లోని వారి గురువులను రూఢి చేసుకునేంతవరకూ అత్యంత ఓరిమితో వ్యవహరించారు. మిలటరీ భాషలో ఈ ఓరిమిని క్రమశిక్షణ అనాలి. మరోవైపు పాకిస్తాన్ యథావిధిగా పహల్గామ్ దాడి తరువాత సరిహద్దుల్లో తన పదాతి దళాలను పెంచుకుని భారత మిలిటరీ ప్రతిచర్య కోసం ఎదురు చూసింది. అయితే భారత్ ఈసారి తన వ్యూహాన్ని మార్చుకున్న విషయం పాక్‌కు తెలియలేదు.బయటకు కనిపించని అసలు వ్యూహంఏదో జరగబోతోందన్న సంకేతాలు రెండు వారాలుగా కనిపిస్తున్నా కచ్చితంగా ఏమిటన్నది చివరి క్షణం వరకూ బయటపడలేదు. ప్రధాని కేబినెట్ సమావేశాలు, ప్రతిపక్ష నేతలతోనూ మంతనాలు జరిపారు. భద్రతాదళ ఉన్నతాధికారులు, రక్షణ శాఖ మంత్రి అందరూ చర్చల్లో పాల్గొన్నారు. దేశ వ్యాప్తంగా మాక్ డ్రిల్స్కూ ఏర్పాట్లు పూర్తిస్థాయిలో జరిపారు. బయటకు కనిపించిన ఈ వ్యూహం వెనుక అసలైన ప్రతీకార చర్య చోటు చేసుకుంది. అణుబాంబుల బెదిరింపులతో మన ఆలోచనలను పక్కదారి పట్టించేందుకు జరిగిన విఫల యత్నాన్ని కూడా భారత్ అధిగమించింది. భారత రక్షణ దళాలు నియంత్రణ రేఖకు (ఎల్ఓసీ) ఆవల తొమ్మిది కీలక ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిపాయి. ఇది భారత సత్తాను, కృత నిశ్చయాన్ని చాటే ప్రణాళికా బద్ధమైన ప్రతిదాడి. యుద్ధాల్లో ప్రతీకాత్మకతకు ప్రాముఖ్యం ఉంటుంది. మానసిక యుద్ధాల్లో మరీ ఎక్కువ. అందుకే అనూహ్యంగా ఇద్దరు మహిళా సైనికాధికారులు కల్నల్ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీతో కలిసి ఆపరేషన్ సిందూర్ గురించిన అధికారిక ప్రక టన వెలువరించారు. విదేశీ వ్యవహారాల శాఖ కార్య దర్శితో ఇద్దరు మహిళ సైనికాధికారులు పాల్గొనడం పాకిస్తాన్‌తో పాటు ప్రపంచ దేశాలన్నింటికీ బలమైన సంకేతం పంపినట్లు అయ్యింది. భారత్‌కు తన గౌర వాన్ని కాపాడుకోవడం ఎలాగో తెలుసు అన్న సందే శాన్ని స్పష్టం చేసింది. అయితే, నియంత్రణ రేఖ వెంబడి పాకిస్తాన్ కాల్పులు జరుపుతూనే ఉంది. భారత్ వీటికి అంతే స్థాయిలో ప్రత్యుత్తరమూ ఇస్తోంది. దురదృష్టవశాత్తూ ఈ క్రమంలో భారత పౌరులు కొందరు ప్రాణాలు కోల్పోయారు. ఒకటి మాత్రం వాస్తవం: నిష్క్రియతో శాంతిని పొందలేమ న్నది అందరూ గుర్తించాలి.మునీర్‌పై విమర్శలుఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో పాకిస్తాన్ ఆర్మీ జనరల్ అసీమ్ మునీర్‌పై విమర్శలు వెల్లువెత్తు తున్నాయి. పాకిస్తాన్ భద్రతాంశాల విశ్లేషకురాలు అయేషా సిద్దిఖా ఆయన్ని ‘ఆలోచన లేని జనరల్’గా అభివర్ణించారు. మతానికి మాత్రమే కట్టుబడిన జనరల్‌కు వాస్తవిక కార్యాచరణ ప్రణాళికల గురించి ఏమీ తెలియదని విమర్శించారు. జనరల్ జియా–ఉల్ హక్, పర్వేజ్ ముషారఫ్‌ల మాదిరిగా తానూ ఏదో పేరు సంపాదించాలన్న తాపత్రయం ఆయనలో కనబడుతోంది. జియా, ముషారఫ్ ఇద్దరూ విభ జనకు ముందు భారత్‌లో పుట్టిన వారే. వాళ్లు సిద్ధాంతానికి వ్యూహాన్ని జోడించగల సమర్థులు. మునీర్ మతాన్ని, మాటలనే నమ్ముకున్నారు.ప్రస్తుతం జరుగుతున్నది రెండు సరిహద్దుల మధ్య యుద్ధం కాదు. సైద్ధాంతికమైనది. త్యాగమంటే ఏమిటో చెప్పేది. నష్టానికి దేశాలు న్యాయం పొందడం ఎలాగో చెప్పేది. ఆపరేషన్ సిందూర్ అన్న పేరు కేవలం ప్రతీకాత్మకమైంది మాత్రమే కాదు. భారతీయ సంప్రదాయంలో కుంకుమ బొట్టుకు ఉన్న ప్రాశస్త్యం తెలియంది కాదు. పహల్గామ్లో ఉగ్రవాదులు కుటుంబంలోని భర్తలే లక్ష్యంగా కాల్పులు జరిపారు. అందుకే మహిళల నుదుటి బొట్టును కాపాడేందుకే ఈ దాడులు చేసిందన్న సంకేతాన్ని భారత్ పంపింది. బెదిరింపులు, బుల్లెట్లు భారత సంకల్పాన్ని దెబ్బతీయలేవని, అణ్వాయుధాల పేరుచెప్పినా ఇక వదిలేది లేదన్నది ఆపరేషన్ సిందూర్ ఇచ్చే స్పష్టమైన సందేశం. మరి ఈ దాడులకు పాక్ స్పందించకుండా ఉంటుందా? కచ్చితంగా స్పందిస్తుంది. కాకపోతే ఎప్పుడు, ఎలా అన్నది వేచి చూడాలి. ఇందుకు భారత రక్షణ దళాలు పూర్తి సన్నద్ధంగానే ఉన్నాయి. పాక్ కవ్వింపులకు దిగితే గట్టి సమాధానం ఇచ్చేందుకు సిద్ధంగానే ఉన్నట్లు ఇండియా స్పష్టమైన సంకే తాలిచ్చింది. అంతేకాదు... ఇదేదో పరిస్థితిని మరింత జటిలం చేసుకునేందుకు మాత్రం కాదనీ, పొరుగు దేశం తన హద్దుల్లో తానుండటం మేలన్న సంకేతాన్ని ఇచ్చేందుకేననీ స్పష్టం చేసింది. హద్దు మీరితే అంతే గట్టి సమాధానం దొరుకుతుందన్న హెచ్చరిక కూడా అందులో ఉంది. మనోజ్ కె. చన్నన్ వ్యాసకర్త భారత సైన్యంలో లెఫ్ట్‌నెంట్ కల్నల్ (రిటైర్డ్) -
Operation Sindoor: ఎవరీ కల్నల్ సోఫియా, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్
ఢిల్లీ: పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత దళాలు చేపట్టిన ఆపరేషన్ సిందూర్ విజయం వంతంగా ముగి;సింది. పాకిస్తాన్‌తో పాటు పాక్ ఆక్రమిత కశ్మీర్లో మంగళవారం అర్ధ రాత్రి భారత భద్రతా దళాలు ఆర్మీ,నేవీలు సంయుక్తంగా ఆపరేషన్ సిందూర్‌ను చేపట్టాయి.ఆపరేషన్‌లో భాగంగా లక్షిత దాడుల్ని అరగంటలోపు నేలమట్టం చేసింది. 9స్థావరాల్లో ఉన్న 80 మందికి పైగా ఉగ్రవాదుల్ని మట్టిలో కలిపేశాయి. అనంతరం ఆపరేషన్ సిందూర్‌పై మీడియా సమావేశం జరిగింది. ఈ ఆపరేషన్‌కు సారధ్యం వహించిన భారత సశస్త్ర దళాల్లో ఇద్దరు సీనియర్ మహిళా అధికారులు వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్, కర్నల్ సోఫియా ఖురేషీ,విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రిలు మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఆపరేషన్ సిందూర్‌కు నాయకత్వం వహించిన సశస్త్ర దళాలకు నాయకత్వం వహించిన వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్, కర్నల్ సోఫియా ఖురేషీలు ఉగ్రమూకల్ని ఎలా మట్టుబెట్టామన్నది వెల్లడించారు. దాడి దృశ్యాలకు సంబంధించిన వీడియోల్ని బహిర్ఘతం చేశారు. దీంతో ప్రపంచ మొత్తం ఈ ఇద్దరి మహిళా అధికారులు గురించి చర్చ మొదలైంది. ఎవరీ కల్నల్ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్కల్నల్ సోఫియా ఖురేషీ(Colonel Sophia Qureshi) ఇండియన్ ఆర్మీలోని త్రివిధ దళాలలైన ఆర్మీలోని సిగ్నల్‌కోర్‌కి చెందిన కల్నల్ సోఫియా ఖురేషీ. అనేక సాహసోపేతమైన విజయాలతో సైనిక చరిత్రలో తన స్థానాన్ని సుస్థిర పరుచున్నారు. ఆర్మీ కల్నల్ హోదాలో ఆపరేషన్ సిందూర్‌కు ముందుండి నాయకత్వం వహించారు. ఫోర్స్ 18కు నాయకత్వం 2016 మార్చిలో అప్పటి లెఫ్టినెంట్ కర్నల్ ఖురేషీ భారత్ ఆతిథ్యమిచ్చిన ఫోర్స్ 18 అనే బహుళజాతీయ సైనిక విన్యాసంలో భారత సైన్యం తరఫున ఒక దళానికి నాయకత్వం వహించిన తొలి మహిళా అధికారిగా చరిత్ర సృష్టించారు. ఈ విన్యాసం మార్చి 2 నుండి 8 వరకు పుణేలో జరిగింది. ఇందులో ఆసియన్ దేశాలతో పాటు జపాన్, చైనా, రష్యా, యుఎస్, దక్షిణ కొరియా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా వంటి 18 దేశాలు పాల్గొన్నాయి. ఈ విన్యాసంలో పాల్గొన్న దళాల్లో, లెఫ్టినెంట్ కర్నల్ ఖురేషీ మాత్రమే మహిళా కమాండర్‌గా ఉండడం ఆమె నాయకత్వ నైపుణ్యానికి నిదర్శనం.పీస్ కీపింగ్ ఆపరేషన్స్‌లోనూఆమె నేతృత్వంలోని 40-సభ్యుల భారత దళం శాంతి భద్రతలను కాపాడేందుకు, సంఘర్షణ లేదా సంఘర్షణానంతర ప్రాంతాలకు సైనిక సిబ్బందిని మోహరించి ఉద్రిక్తత పరిస్థితులను తగ్గించే విభాగమే ఈ పీస్ కీపింగ్ ఆపరేషన్స్ (PKOs). ఈ పీకేవో ఆపరేషన్స్‌లో కీలక పాత్ర పోషించారు. హ్యూమానిటేరియన్ మైన్ యాక్షన్ (HMA) వంటి కీలక శిక్షణ కార్యక్రమాల్లో పాల్గొంది. దేశవ్యాప్తంగా అనుభవజ్ఞులైన పీస్ కీపింగ్ శిక్షణాదారులలోంచి ఆమెను ఎంపిక చేశారు.యుఎన్ శాంతి పరిరక్షణలో విశిష్ట అనుభవం2006లో, యుఎన్ శాంతి పరిరక్షణ మిషన్ (కాంగో) లో మిలిటరీ అబ్జర్వర్‌గా పనిచేశారు. 2010 నుంచి ఆమె పీకేవోలో కొనసాగుతూ వచ్చారు. అందులో ఆమె విశేష సేవలు అందిస్తున్నారు. సైనిక సేవ ఆమెకు వారసత్వంగా ఆమె తాత సైన్యంలో సేవలందించగా, ఆమె భర్త కూడా మెకనైజ్డ్ ఇన్ఫెంట్రీకి చెందిన అధికారి. ఈ విధంగా ఆమె కుటుంబం సైనిక సేవలతో ముడిపడిందివింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ (Wing Commander Vyomika Singh)వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్, భారత వైమానిక దళానికి చెందిన పైలట్. ఆపరేషన్ సిందూర్‌లో పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లో ఉన్న ఉగ్రవాద శిబిరాలపై వైమానిక దాడులు ఈమె నేతృత్వంలోనే జరిగాయి. వ్యోమికా సింగ్ విషయానికొస్తే.. వ్యోమిక అంటే ఆకాశపు కుమార్తె అని అర్ధం. ఆ పేరులో ఆమె చిన్ననాటి కల ప్రతిబింబిస్తుంది. చిన్నప్పటి నుంచే ఆమెకు పైలట్ కావాలనే సంకల్పం ఉండేది. స్కూల్ రోజుల్లోనే ఆమె ఎన్సీసీలో చేరి, తరువాత ఇంజినీరింగ్ పూర్తి చేశారు. కుటుంబంలో మొదటిసారిగా సైన్యంలో చేరిన వ్యక్తిగా ఆమె పేరు గడించారు. 2019 డిసెంబర్ 18న, ఆమెకు శాశ్వత కమిషన్ లభించి, హెలికాప్టర్ పైలట్‌గా ఐఏఎఫ్‌లో ఆమె ప్రయాణం అధికారికంగా ప్రారంభమైంది.చల్లని గాలుల మధ్య నుండి మసక చీకట్ల వరకూ అన్నీ సాహసాలే వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ ఇప్పటివరకు 2,500కు పైగా ఫ్లయింగ్ గంటలు పూర్తి చేశారు. చేతక్, చీటాహ్ వంటి హెలికాప్టర్లను నడిపుతూ, జమ్మూ కాశ్మీర్ లోని ఎత్తయిన ప్రాంతాలు నుండి, ఈశాన్య భారతదేశంలోని గిరిజన ప్రాంతాల వరకూ సేవలందించారు. 2020లో అరుణాచల్ ప్రదేశ్‌లో, ప్రాణాపాయ పరిస్థితుల్లో సామాన్యులను రక్షించేందుకు ఆమె ఒక కీలకమైన రెస్క్యూ ఆపరేషన్‌ను విజయవంతంగా నిర్వహించారు. 2021లో ఆమె మౌంట్ మనిరంగ్ (21,650 అడుగుల ఎత్తు) పైకి ప్రయాణించిన త్రివిధ దళాల మహిళా ఎక్సపిడిషన్‌లో పాల్గొన్నారు.ఆపరేషన్ సిందూర్ తర్వాత పహల్గాంలో 26 మంది సాధారణ పౌరుల హత్యకు ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో, దేశానికి సమాచారం ఇవ్వడమే కాక, భారత సైన్యం ఇప్పుడు ఎవరిచేత ప్రాతినిధ్యం వహించబడుతోంది అన్న దానిలో స్పష్టమైన మార్పును వింగ్ కమాండర్ సింగ్ చూపించారు.