రాష్ట్రంలో ఇసుక కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికారులను హెచ్చరించారు. జాయింట్ కలెక్టర్లు, మైనింగ్ అధికారులతో నూతన ఇసుక పాలసీపై శనివారం సచివాలయంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వర్క్ షాప్ నిర్వహించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ప్రజలకు ఇసుక వల్ల ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు. ప్రస్తుతం రోజుకు 35వేల టన్నుల ఇసుక సరఫరా జరుగుతోందని, దీనిని రోజుకు లక్ష టన్నులకు పెంచాలని పేర్కొన్నారు. గత మూడు నెలలుగా వరద పరిస్థితి కొనసాగుతుండటం వల్ల ఇసుక తవ్వకాలకు ఇబ్బందులు ఏర్పడ్డాయని, వరదలు తగ్గే వరకు ప్రత్యామ్నాయంగా పట్టాదారు భూముల్లోని ఇసుకపై దృష్టి సారించాలని అధికారులకు సూచించారు.