చీరాల ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి సమర్పించిన నామినేషన్ ప్రజాప్రాతినిధ్య చట్టం, ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా లేదని, చట్టప్రకారం బహిర్గతం చేయాల్సిన వాస్తవాలను వెల్లడించలేదంటూ మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. అంబిక కృష్ణ అనే కుమార్తె ఉన్నప్పటికీ బలరాం తన నామినేషన్‌లో ఆమె వివరాలు పొందుపరచలేదని పిటిషన్‌లో పేర్కొనడంతో ఇప్పుడు ఈ వ్యవహారం జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది. కరణం బలరాం ఎన్నికను రద్దు చేయాలని కోరుతూ ఈ నెల 7వ తేదీన ఆమంచి హైకోర్టులో ఎన్నికల పిటీషన్ (ఈపీ) దాఖలు చేయడంతో చీరాల టీడీపీ శ్రేణుల్లో ఆందోళన మొదలైంది. ప్రకాశం జిల్లా టీడీపీ నేతలు, కార్యకర్తల్లో గత మూడు రోజులుగా ఇదే చర్చ కొనసాగుతోంది.