ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం కొవ్వొత్తుల ర్యాలీ చేసేందుకు వచ్చిన తమను కనీసం డొమెస్టిక్ ఎరైవల్స్ వద్దకు కూడా వెళ్లనివ్వకుండా ఎలా ఆపుతారని పోలీసులను ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిలదీశారు. రన్ వే మీద నుంచి తనను లాక్కెళ్లడంపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. రన్‌వేకు కొన్ని మీటర్ల దూరం వరకు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ పోలీసులు దాదాపు అరగంట పాటు ఆయనను అక్కడే అడ్డుకున్నారు. దాంతో, వైఎస్ జగన్ వాళ్ల తీరును నిరసించారు. ఈరోజు పోలీసులు ఇద్దరిని కిడ్నాప్ చేశారని, వాళ్లలో ఒకరు లోక్ సభ సభ్యుడని ఆయన మండిపడ్డారు. అసలు రన్‌వే మీద ఆపడం ఏంటని, వచ్చినవాళ్లు పోలీసులేనా, వాళ్లకు ఒక ఐడీ కార్డు కూడా లేదని.. ఈ వ్యవహారం ఏంటని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కేబినెట్ హోదా కలిగిన ప్రతిపక్ష నాయకుడితో ప్రవర్తించాల్సిన విధానాన్ని పోలీసులు పాటించకపోవడంతో అక్కడున్న ప్రతి ఒక్కరూ పోలీసుల తీరుపై తీవ్రంగా మండిపడ్డారు.