వైవీయూ ముఖ ద్వారం
కడప ఎడ్యుకేషన్: ప్రజాకవి యోగివేమన పేరుతో ఏర్పాటైన యోగివేమన విశ్వవిద్యాలయం 21వ వసంతంలోకి అడుగిడుతోంది. 2006లో మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మూడు విశ్వవిద్యాలయాలను ప్రకటించగా అందులో యోగివేమన విశ్వవిద్యాలయం ఒకటి. ఆ ఏడాదిలోనే మార్చి 9న 652 ఎకరాల్లో విశ్వవిద్యాలయంగా రూపుదిద్దుకుంది. జిల్లా వాసి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ఉండడంతో వైవీయూ శరవేగంగా అభివృద్ధి చెందింది. నేడు విశ్వవిద్యాలయ ప్రాంగణంలోని పి.జి. కళాశాల 29 కోర్సులతో, 1,200 మంది విద్యార్థులు, 100 మంది అధ్యాపక బృందం, 237 మంది పరిశోధక విద్యార్థులతో అలరారుతోంది. అకడమిక్‌గా పరిశోధనల పరంగా వైవీయూ ప్రగతిపథంలో దూసుకుపోతోంది. విశ్వవిద్యాలయం నిర్వహణలో ప్రొద్దుటూరులో వైఎస్సార్ ఇంజినీరింగ్ కళాశాల, అనుబంధంగా వైఎస్సార్ కడప, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో మరో 68 డిగ్రీ కళాశాలు 50 బీఈడీ కళాశాలలు, రెండు పి.జి. కళాశాలలు ఉన్నాయి.
తొలుత ఎస్వీయూ అధికారుల పర్యవేక్షణ
విశ్వవిద్యాలయం కొంతకాలం ఎస్వీయూ అధికారుల పర్యవేక్షణలో కొనసాగగా వైవీయూ తొలి, మలి వైస్ చాన్స్‌లర్‌గా ఆచార్య అర్జుల రామచంద్రారెడ్డి వ్యవహరించారు. రెండవ వైస్ చాన్స్‌లర్‌గా ఆచార్య బేతనభట్ల శ్యాంసుందర్ 2013 జూలై 15న బాధ్యతల స్వీకరించి 2016 జూలై వరకు బాధ్యతలు నిర్వహించారు. 2016 అక్టోబర్ 17న మూడవ వైస్ చాన్సలర్‌గా ఆచార్య అత్తిపల్లి రామచంద్రారెడ్డి 2019 అక్టోబర్ 6 వరకు పనిచేశారు. అనంతరం 2020 జనవరి 9వ తేదీన ఆచార్య మునగాల సూర్యకళావతి వైవీయూ తొలి మహిళా వైస్ చాన్సలర్‌గా బాధ్యతలు చేపట్టారు. 2023 జనవరి 7వ తేదీ వరకు కొనసాగారు. 2023 మే 11న ఆచార్య చింతా సుధాకర్ బాధ్యతలు తీసుకొని 2024జులై 18వ తేదీ వరకు సేవలందించారు. 2025ఫిబ్రవరి 18న ప్రణతి ప్రకాష్ బాబు వి.సి గా చేరి మార్చి 17న పుదుచ్చేరి సెంట్రల్ యూనివర్సిటీకి వీసీగా వెళ్లారు. ఆయన స్థానంలో 2025 అక్టోబర్ 8న వీసీగా ఆచార్య బెల్లంకొండ రాజశేఖర్ బాధ్యతలు స్వీకరించి పరిపాలన కొనసాగిస్తున్నారు.
అభివృద్ధికి అడుగులు ఇలా...
యోగివేమన విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విశ్వవిద్యాలయానికి నిధుల వరద పారించారు. ఆయన హయాంలో భవన నిర్మాణాలు పూర్తయ్యాయి. ఇదే క్రమంలో 2008లో ప్రొద్దుటూరులో వైఎస్‌ఆర్ ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటైంది. అనంతరం వైవీయూకు 2012లో 12బీ గుర్తింపు సైతం లభించడంతో పాటు పలు ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు, యంగ్ సైంటిస్టు అవార్డులను విశ్వవిద్యాలయ అధ్యాపక బృందం సొంతం చేసుకున్నారు.
ఏ గ్రేడ్..ఎన్‌ఐఆర్‌ఎఫ్
ర్యాంకింగ్‌లోనూ చోటు..
వైవీయూకు నాక్ ‘ఏ’గ్రేడ్ లభించడంతో అభివృద్ధికి మళ్లీ బీజం పడ్డట్లయింది. యోగివేమన విశ్వవిద్యాలయాన్ని 2023 డిసెంబర్ 28, 29, 30 తేదీల్లో నాక్ (నేషనల్ అసెస్‌మెంట్ అక్రిడేషన్ కౌన్సిల్ కమిటీ) బృందం సందర్శించింది. విశ్వవిద్యాలయ అధికారులు చక్కటి ప్రదర్శన కనబరచడంతో ఎ గ్రేడును కేటాయించింది. నిజానికి ఏ ప్లస్ గ్రేడ్ అతి తక్కువ పాయింట్లతో చేజారింది. అలానే గతేడాది కేంద్ర మానవవనరుల మంత్రిత్వశాఖ ఇచ్చిన విశ్వవిద్యాలయాల నేషనల్ ఇన్సిట్యూట్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్ (ఎన్‌ఐఆర్‌ఎఫ్)లో 51 నుంచి 100లోపు ర్యాంకును సొంతం చేసుకుంది. ఇక్కడి ప్రొఫెసర్లు ప్రపంచంలోని టాప్ సైంటిస్టుల్లో మొదటి పది మందిలో ఉండడం విశేషం. పలువురు ప్రొఫెసర్లు పేటెంట్లు అందుకోగా మరి కొంతమంది ప్రఖ్యాత సీవీరామన్ ఫెల్లోషిప్‌లు, యంగ్ సైంటిస్టు అవార్డులు, రామానుజన్ ఫెలోఫిఫ్‌లు, హంబోల్డ్ ఫెలోిషిప్పులు అందుకున్న వారు కూడా ఉన్నారు.
నేడు వైవీయూ వ్యవస్థాపక దిన వేడుకలు
అతిథిగా విశ్రాంత ఐఏఎస్,ఫౌండేషన్ ఫర్ రీపామ్స్ వ్యవస్థాపకులుడా. ఎన్ జయప్రకాష్ నారాయణ రాక
2006 మార్చి 9న పీజీ కేంద్రంనుంచి వర్సిటీగా రూపాంతరం
వైఎస్సార్ హయాంలో 652 ఎకరాల్లో యూనివర్సిటీ ఏర్పాటు
యూనివర్సిటీ అభివృద్ధికి నిధుల వరద పారించిన వైఎస్సార్


