ఎద్దుల బండిని ఢీకొన్న లారీ
వల్లూరు : వల్లూరు మండలంలో శుక్రవారం తెల్లవారు జామున పొగ మంచు కమ్ముకుంది. దీంతో వాహన దారులకు అతి సమీపంలోకి వచ్చే వరకు ఎదురుగా వున్న వాహనాలు కనిపించక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ క్రమంలో మండల పరిధిలోని తప్పెట్ల గ్రామ సమీపంలో కడప – తాడిపత్రి ప్రధాన రహదారిపై తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని సీ కొత్తపల్లెకు చెందిన రైతు చంద్ర శేఖర్ అలియాస్ చెన్నయ్య బక్కిరెడ్డిపల్లె సమీపంలోని పొలంలో సేద్యం పనులకు ఎద్దుల బండిలో బయలుదేరాడు. అదే సమయంలో కడప వైపు నుండి కమలాపురం వైపు వెళ్తున్న లారీ పొగ మంచు కారణంగా కనిపించక పోవడంతో ముందుగా వెళ్తున్న ఎద్దుల బండిని వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎద్దుల బండి బోల్తా పడింది. బండిలో వున్న రైతు చెన్నయ్య కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో అతన్ని చికిత్స కోసం 108 వాహనంలో కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని, తీవ్రంగా మంచు కమ్ముకున్న పరిస్థితుల్లో మరో ప్రమాదం జరగకుండా రోడ్డుపైన బోల్తా పడి ఉన్న ఎద్దుల బండిని పక్కకు తొలగించి వాహనాల రాకపోకలను నియంత్రించారు.


