21న రచ్చబండ
వైఎస్ జగన్ పుట్టినరోజును ఘనంగా నిర్వహిద్దాం
సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ సంస్థాగత నిర్మాణం అత్యంత బలంగా చేపట్టేలా కార్యాచరణ కొనసాగుతోందని పార్టీ రాష్ట్ర కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. ఇప్పటికే 10 నియోజకవర్గాల్లో కమిటీల నియామకం పూర్తయిందన్నారు. కమిటీల నియామకం పూర్తయిన నియోజకవర్గాల్లో 21న రచ్చబండ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆయన శుక్రవారం కడప, పుంగనూరు, మడకశిర, వేమూరు అసెంబ్లీ నియోజకవర్గాల నాయకులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ముందుగా మడకశిర నియోజకవర్గంలో కమిటీల ఏర్పాటు పూర్తయిందని చెప్పారు. తరువాత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియోజకవర్గం పుంగనూరులోను, అనంతరం వేమూరులోను కమిటీలు ఏర్పాటయ్యాయని తెలిపారు. పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్.. కడప పార్లమెంటులో పూర్తి చేద్దామని పిలుపునివ్వడంతో వాళ్లు కూడా ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి ఆధ్వర్యంలో 80 రోజుల్లో పూర్తి చేశారని చెప్పారు. ఈ నియోజకవర్గాల కమిటీల నియామకంలో పార్టీ జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గాల కో ఆర్డినేటర్ల ప్రోత్సాహం చెప్పుకోదగినదని పేర్కొన్నారు. పార్టీ నిర్మాణం పటిష్టం జరిగి క్షేత్రస్థాయిలో బలమైన నెట్‌వర్క్ ఏర్పాటైతే.. భవిష్యత్తులో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కిందిస్థాయిలో ఏది చేయాలన్నా, వాళ్ల ద్వారా చేయడం, లేదా ఇన్వాల్వ్ చేయడం కోసం పటిష్టమైన నాయకత్వం రికార్డు అయి ఉంటుందని చెప్పారు. పార్టీ అధినేత నేరుగా కనెక్ట్ అయ్యేందుకు, సెంట్రల్ ఆఫీసులో డేటా అందుబాటులో ఉండేందుకు, బీమా, ఐడీ కార్డులు అందించేందుకు, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైనా పదవులు ఇచ్చేటప్పుడు ప్రయారిటీ తెలుస్తుందని వివరించారు.
‘రేపు (ఆదివారం) మన అధ్యక్షులు వైఎస్ జగన్ పుట్టినరోజును ఘనంగా నిర్వహిద్దాం. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరించిన తీరు, చంద్రబాబు దుర్మార్గ విధానాలపై తీర్మానం, గవర్నర్‌కు మెమొరాండం ఇచ్చినది ఆయా కమిటీల సమావేశం సందర్భంగా తీర్మానం చేయాలి. స్థానిక సమస్యలు పెట్టాలి. ఉపాధి హామీ చట్టాన్ని మార్చిన ప్రభావం గ్రామాల్లో పడుతుంది. కాబట్టి, పేద కూలీలకు జరిగే నష్టం గురించి తీర్మానం చేయాలి. రైతుల సమస్యలు, మద్దతు ధర లేకపోవడం, ఎరువులు, విత్తనాలు లేకపోవడం వంటివాటిని చేర్చవచ్చు. సోషల్ మీడియా వేదికలు వాట్సాప్, ఎక్స్, ఇన్‌స్ట్రాగాం ద్వారా యాక్టివ్‌గా ఉండేవారిని గుర్తించి షేర్ చేసేలా చర్యలు తీసుకోవాలి. నియోజకవర్గ ఇన్‌చార్జీలు చొరవ తీసుకుని ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలి. మూడు, నాలుగునెలలు మీటింగులు జరగాలి. జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్‌చార్జీలు ఐదారుసార్లు సమావేశాలు నిర్వహిస్తే అదే గాడిలో పడుతుంది’ అని సజ్జల పేర్కొన్నారు.
సంస్థాగత కమిటీలు పూర్తయిన 10 నియోజకవర్గాల్లో నిర్వహణ
వైఎస్సార్‌సీపీ స్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి
నాలుగు నియోజకవర్గాల అసెంబ్లీ నాయకులతో టెలికాన్ఫరెన్స్


