ప్రైవేటీకరణపై ఎరుపెక్కిన ఉద్యమం
● కలెక్టరేట్ వద్ద సీపీఐ ఆందోళన
● పోలీసులతో తోపులాట, ఉద్రిక్తత
● కార్యాలయంలోకి చొచ్చుకెళ్లిన శ్రేణులు
కడప సెవెన్‌రోడ్స్: రాష్ట్రంలో మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ చర్యలను నిరసిస్తూ సీపీఐ ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్ ఎదుట ఆందోళన జరిగింది. పెద్ద సంఖ్యలో వచ్చిన ఆ పార్టీ శ్రేణులు కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించగా, పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఇరు వర్గాల మధ్య వాగ్వివాదాలు, తోపులాటలు చోటుచేసుకున్నాయి. చివరికి పోలీసు వలయాన్ని చేధించుకుని ఆందోళనకారులు లోనికి వెళ్లి బైఠాయించారు. సామాన్యులకు వైద్య విద్య, వైద్యాన్ని దూరం చేసేందుకే మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ కోసం ప్రభుత్వం జీఓ నెం. 590, 107, 108లను జారీ చేసిందని, వాటిని రద్దు చేసే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని సీపీఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర స్పష్టం చేశారు. కొత్త వైద్య కళాశాలల్లో పీపీపీ విధానాన్ని అమలు చేయాలని బాబు సర్కార్ తీసుకున్న నిర్ణయం అత్యంత ప్రమాదకరమైందని ధ్వజమెత్తారు. ఇది సామాజిక న్యాయం, విద్యార్థుల హక్కులు, ఉపాధి భద్రత, పేద, మద్యతరగతి వర్గాల భవిష్యత్తుపై తీవ్ర ప్రతికూల ప్రభావాలు చూపుతుందన్నారు. పీపీపీ విధానంలో ప్రభుత్వ భూ ములు, భవనాలు, వసతులు, కళాశాలలు, ఆస్పత్రు లు దాదాపు 60 ఏళ్లు ప్రైవేటు సంస్థల చేతుల్లోకి వెళ్లిపోతాయన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం జీఓను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సీపీఐ నాయకులు నాగసుబ్బారెడ్డి, బాదుల్లా, చంద్రశేఖర్, సుబ్రమణ్యం, మద్దిలేటి, ఏఐఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బి.శివతేజ, ఎల్.చంద్ర, ఏఐవైఎఫ్ అధ్యక్ష, కార్యదర్శులు ప్రభాకర్, శరత్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ ఆపాలంటూ కలెక్టరెట్ ఎదుట బైఠాయించిన సీపీఐ శ్రేణులు.. కలెక్టరేట్‌లో దూసుకొస్తున్న, సీపీఐ, విద్యార్థి సంఘాల నేతలు
ప్రైవేటీకరణపై ఎరుపెక్కిన ఉద్యమం


