వైద్య సేవల్లో జిల్లాకు ప్రథమ స్థానం
కడప రూరల్: నవంబర్ నెల వైద్య సేవలకు సంబంధించి జిల్లా వైద్య ఆరోగ్యశాఖకు ప్రథమ స్థానం లభించినట్లు ఆ శాఖ జిల్లా అధికారి డాక్టర్ నాగరాజు తెలిపారు. డెలివరీలు, ఇన్ పేషంట్, అవుట్ పేషెంట్, ల్యాబ్ టెస్ట్, వ్యాధి నిరోధక టీకాలతో పాటు ఇతర సేవలకు సంబంధించి నవంబర్ నెలకు రాష్ట్రంలోనే జిల్లాకు ప్రథమ స్థానం లభించినట్లు పేర్కొన్నారు. జిల్లావ్యాప్తంగా ఉన్న ప్రాథమిక, పట్టణ ఆరోగ్య కేంద్రాలు, వైద్యాధికారులు, పారామెడికల్ వైద్య సిబ్బంది ఇదే స్ఫూర్తితో ప్రజలకు వైద్య సేవలందించాలని కోరారు.
అట్లూరు: స్థానిక ఎంపీడీఓ కార్యాలయాన్ని గురువారం జెడ్పీ సీఈఓ సి.ఓబుళమ్మ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె రికార్డులను పరిశీలించి తగు సూచనలు, సలహాలు ఇచ్చారు. అనంతరం చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలను సందర్శించి తయారు చేసిన వర్మీకంపోస్టు ఎరువును పరిశీలించారు. అట్లూరు ఎస్సీ కాలనీలో పర్యటించారు. కాలనీలో ప్రజ లకు ఇబ్బందిగా ఉన్న పాడుబడిన బావిని పూడ్చాలని అధికారులను ఆదేశించారు. ఎంపీడీఓ కార్యాలయ భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో ఆ భవనాన్ని పరిశీలించి నూతన భవనానికి ప్రతిపాదనలు తయారు చేయాలని సూచించారు. ఎంపీడీఓ వెంగమునిరెడ్డి, ఏఓ భాస్కర్‌బాబు, డిప్యూటీ ఎంపీడీఓ గంగాధర్, పంచాయతీ కార్యదర్శి పాల్గొన్నారు.
వేంపల్లె: ఖాట్మండులో ఈనెల 16 నుంచి జరుగుతున్న అంతర్జాతీయ సౌత్ ఏషియన్ గోల్ షాట్‌బాల్ ఛాంపియన్ షిప్ పోటీల్లో వేంపల్లె మండలం వీరన్నగట్టుపల్లెకు చెందిన రాచవీటి తేజేంద్ర ప్రతిభ చూపాడు. ఈయన వేంపల్లెలోని వైఎస్సార్ వివేకానంద ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గెస్ట్ ఫిజికల్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. 2009 నుంచి 2025 వరకు కబడ్డీ, హ్యాండ్ బాల్, తైక్వాండో, షూటింగ్ బాల్ క్రీడల్లోనూ రాష్ట్ర, జాతీయస్థాయిలో రాణించారు. తేజేంద్రను కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు అభినందించారు.
మదనపల్లె: మదనపల్లె నుంచి టమాటను రైళ్ల ద్వారా వివిధ ప్రాంతాలకు ఎగుమతులు చేసేలా రైల్వేశాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు మార్కెటింగ్‌శాఖ అధికారులు వెల్లడించారు. గురువారం స్థానిక మార్కెట్ యార్డులో మార్కెట్ కమిటీ పాలకవర్గ సమావేశం చైర్మన్ శివరాం అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా చైర్మన్, కార్యదర్శి జగదీష్ పలు అంశాలను కమిటీ దృష్టికి తెచ్చారు.
కడప ఎడ్యుకేషన్: స్కూల్ గేమ్స్ అండర్ 14 జాతీయస్థాయి వాలీబాల్ టోర్నమెంట్ పోస్టర్‌ను గురువారం స్కూల్ గేమ్స్ రాష్ట్ర కార్యదర్శి భానుమూర్తి రాజు ఆవిష్కరించారు. జనవరి 5 నుంచి 9వ తేదీ వరకు జమ్మలమడుగులోని బాలికల ప్రభుత్వ కళాశాలలో ఈ పోటీలు జరగనున్నాయి. ఈ మేరకు గురువారం స్కూల్ గేమ్స్ రాష్ట్ర కార్యదర్శి భానుమూర్తి రాజు క్రీడా ప్రాంగణాన్ని సందర్శించి జిల్లా స్కూల్ గేమ్స్ కార్యదర్శులు శ్రీకాంత్ రెడ్డి, చంద్రావతి అలాగే టోర్నమెంట్ కార్యదర్శి శివశంకర్ రెడ్డిలకు పలు సూచనలు అందించారు. పాఠశాల హెడ్మాస్టర్లు బి. శ్రీనివాసులు రెడ్డి.సుబ్రహ్మణ్యం. సీనియర్ వ్యాయామ ఉపాధ్యాయులు బాబు,ప్రసాద్ రెడ్డి, శివకృష్ణ, చంద్రమోహన్ రెడ్డి, రాయుడు, అంకాల్ రెడ్డి, హేమాంబ రెడ్డి,మహేష్, చరణ్, పాల్గొన్నారు.
వైద్య సేవల్లో జిల్లాకు ప్రథమ స్థానం


