పాత కక్షలే హత్యకు కారణం
కడప అర్బన్ : కడప నగర శివార్లలో స్వరాజ్ నగర్‌లో ఖాళీగా ఉన్న ఎన్జీఓ ప్లాట్‌లలో ఈనెల 11వ తేదీన రాత్రి వల్లెపు వెంకటయ్య అలియాస్ వెంకట్ (27) అనే యువకుడిని దారుణంగా హత్య చేసిన కేసులో ప్రధాన నిందితుడు అరుణ్ కుమార్ అలియాస్ అరుణ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అలాగే అతని బంధువు అయిన బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందితుడిని కోర్టులో హాజరు పరచగా రిమాండ్‌కు తరలించారు. బాలుడిని జువైనల్ హోం( ప్రభుత్వ బాలుర గృహం)కు తరలించారు. ఈ సంఘటనపై కడప డీఎస్పీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ ఏ. వెంకటేశ్వర్లు వివరాలను వెల్లడించారు.
పాత కక్షలను మనసులో పెట్టుకుని..
ఈ కేసులో ప్రధాన నిందితుడు అరుణ్‌కుమార్ అలియాస్ అరుణ్ హత్యకు గురైన వల్లెపు వెంకటయ్య అలియాస్ వెంకట్ చిన్ననాటి స్నేహితులు. మృతుడికి మొదట వెంకట సుధతో వివాహమైంది. కుటుంబ కలహాల కారణంగా వారిద్దరూ విడిపోయారు. తర్వాత అతను భవిత అలియాస్ అక్కమ్మను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆమెను వివాహం చేసుకున్న సమయంలో అరుణ్ తన మోటార్ సైకిల్‌ను కుదువకు పెట్టి మృతుడికి ఆర్థికంగా సహకరించాడు. అదే క్రమంలో మృతుడు వెంకట్ కూడా పూచీకత్తుగా ఉండి అరుణ్‌కు చెందిన మోటార్ సైకిల్‌ను కుదువ పెట్టి, తనకు తెలిసిన వారి వద్ద నుంచి డబ్బులు ఇప్పించాడు. అయితే చెప్పిన సమయానికి అరుణ్ డబ్బులు చెల్లించక పోయే సరికి వెంకట్, అరుణ్‌ను అతని కుటుంబ సభ్యులను ఉద్దేశించి అసభ్యకరంగా తిట్టడంతో మనస్తాపానికి గురయ్యాడు. దీంతో అతను వెంకట్‌పై కక్ష పెంచుకున్నాడు. అతనితో స్నేహ పూర్వకంగా ఉన్నట్లు నటిస్తూనే చంపేందుకు అవకాశం కోసం ఎదురు చూశాడు. ఈ నేపథ్యంలో ఈనెల 11వ తేదీ సాయంత్రం అరుణ్ తన చిన్నాన్న కుమారుడైన బాలుని సహకారం తీసుకున్నాడు. వారిద్దరూ కలిసి వెంకట్‌కు అతిగా మద్యం తాగించారు. పూర్తిగా మత్తులో ఉండగా, ఇద్దరు కలిసి వెంకట్‌ను సిమెంట్ ఇటుక దిమ్మెలతో తల పైన రక్తం వచ్చేలా కొట్టి దారుణంగా హత్య చేశారు. తొలుత హత్యకు కారణమైన వారి వివరాలు తెలియరాలేదు. తరువాత క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ సిబ్బంది సహకారంతో ‘సోను’ అనే జాగిలం ప్రధాన నిందితుడి ఇంటిని కనుగొనడంలో కీలక పాత్ర పోషించింది. నిందితుల నుంచి రెండు సెల్‌ఫోన్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని కోర్టులో హాజరు పరచగా రిమాండ్‌కు ఆదేశించారు.
నేరస్తులను గుర్తించడంలో
నేర్పరి ‘సోను ’ జాగిలం..
మంగళగిరి పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో శిక్షణ పూర్తి చేసుకుని ఇటీవలే జిల్లా పోలీస్ శాఖ డాగ్ స్క్వాడ్‌లో చేరిన ‘సోను’ డ్యూయల్ ట్రైనింగ్ పొందింది. పేలుడు పదార్థాలను, నేరస్తులను గుర్తించడంలో నేర్పరిగా పేరు గాంచింది. జిల్లా పోలీస్ శాఖలో చేరిన కొద్ది కాలంలోనే హత్య కేసు ఛేదించి ‘శభాష్.. సోను’ అని పోలీస్ ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుంది.
ఈ కేసులో నిందితులను అరెస్టు చేసేందుకు కృషి చేసిన దర్యాప్తు అధికారి రిమ్స్ పోలీసు స్టేషన్ సీఐ బి.రామక్రిష్ణా రెడ్డి, ఎస్‌ఐ సుభాష్ చంద్ర బోస్, క్లూస్ టీం ఎస్‌ఐ ఎస్.వినీల, డాగ్ స్క్వాడ్ సిబ్బంది మహబూబ్ హుసేన్, సుధీర్ రాజ, సోను జాగిలం, హెడ్ కానిస్టేబుల్ హరి ప్రసాద్, సుధాకర్, కానిస్టేబుల్ ఇస్మాయిల్, సుందర్‌ను అభినందించారు.
హత్య కేసులో నిందితుడి అరెస్టు
పోలీసుల అదుపులో మరో బాలుడు
కేసు ఛేదనలో కీలక పాత్ర పోషించిన పోలీస్ జాగిలం ‘సోను’
వివరాలు వెల్లడించిన
కడప డీఎస్పీ ఏ.వెంకటేశ్వర్లు


