ఆర్టీపీపీలో నాలుగు ఇళ్లలో చోరీ యత్నం
● ఒక ఇంటిలో 3 తులాల బంగారు,
150 గ్రాముల వెండి ఆభరణాలు చోరీ
● సంఘటన స్థలాన్ని పరిశీలించిన జమ్మలమడుగు డీఎస్పీ వెంకటేశ్వరరావు
వేలి ముద్రలు సేకరిస్తున్న క్లూస్‌టీం
వస్తువులను చెల్లాచెదురుగా పడేసిన దృశ్యం
ఎర్రగుంట్ల : డాక్టర్ ఎంవీఆర్ రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టులోని వీవీరెడ్డి కాలనీలో ఎఫ్ టైపు–525, 535, జీ టైపు–350, 362 క్వార్టర్లలో గరువారం రాత్రి దొంగలు చోరీకి యత్నించారు. అయితే ఒక ఇంటిలో మాత్రం బంగారు, వెండి నగలు ఎత్తుకెళ్లారు. విషయం తెలుసుకున్న వెంటనే జమ్మలమడుగు డీఎస్పీ వెంకటేశ్వరరావు, కొండాపురం సీఐ రాజ, కలమల్ల ఎస్‌ఐ సునీల్‌కుమార్‌రెడ్డిలు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కడప నుంచి క్లూస్ టీం వచ్చి నాలుగు ఇళ్లలో పరిశీలించి వేలి ముద్రలను సేకరించారు.
ఆర్టీపీపీలోని వీవీరెడ్డి కాలనీలో ఎఫ్ టైపు వరుసలో ఎఫ్–525 క్వార్టర్స్‌లో సుబ్రమణ్యం శ్రేష్టి నివాసం ఉంటున్నారు. ఆయన పని మీద చైన్నెకు వెళ్లారు. అలాగే ఎఫ్–535 క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్న దుగ్గిరెడ్డి రామ్మోహన్‌రెడ్డి కుటుంబం హైదరాబాదుకు వెళ్లగా, ఆయన తాళాలు వేసి డ్యూటీకి వెళ్లారు. అలాగే జీ టైపు వరసలో ఉండే జీ–350 దేవచంద్ర కుటుంబంతో కలసి చిలంకూరుకు వెళ్లారు. జీ–362 క్వార్టర్స్‌లో ఉండే ఆదినారాయణరెడ్డి కూడా పనిమీద కుటుంబంతో బయటకు వెళ్లారు. ఈ నాలుగు క్వార్టర్స్‌లో ఏక కాలంలో ఇంటి తలుపులు పగలకొట్టి ఇంటిలోకి గుర్తు తెలియని దొంగలు ప్రవేశించి ఇంటిలోని బీరువాలను పగులగొట్టారు. అయితే జీ–350 క్వార్టర్స్‌లో ఉంటున్న దేవచంద్ర ఇంట్లో మాత్రం 3 తులాలు బంగారు, 150 గ్రాముల వెండి ఆభరణాలు చోరీ చేసినట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిగిలిన మూడు ఇళ్లలో చోరీకి యత్నించారు కానీ ఎలాంటి నగలు, నగదు దొంగలకు దొరకలేదు.
ఒకే ఇంటిలో రెండో సారి చోరీ...
ఆర్టీపీపీలోని ఎఫ్ టైపు 525లో 2020లో చోరీ జరిగింది. అప్పుడు పెద్ద మొత్తంలో నగదు, బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయి. అయితే మరలా అదే ఇంటిలో ఇప్పుడు చోరీ జరిగింది. అలాగే 2015 సంవత్సరంలో ఆర్టీపీపీలోని ఇదే కాలనీలో ఏకంగా 7 క్వార్టర్లలో చోరీ జరిగింది. అప్పుడు చోరీలను మధ్యప్రదేశ రాష్ట్రానికి చెందిన వారు చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. ఆ మేరకు దొంగలను కూడా పట్టుకుని కొంత మొత్తం రికవరీ చేశారు.
భద్రతపై ఉద్యోగుల ఆదోళన..
ఆర్టీపీపీలో వరుసగా చోరీలు జరుగుతుండటంతో భద్రతపై ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది. ఆర్టీపీపీలోని వీవీరెడ్డి కాలనీలోకి వెళ్లాలాంటే గేటు వద్ద ఎస్‌పీఎఫ్ సిబ్బంది పహారా ఉంటారు. గేటు దాటి లోనికి పోవాలంటే వారు నిత్యం తనిఖీ చేస్తుంటారు. దొంగలు ఏ విధంగా వస్తున్నారనే సందేహాన్ని ఉద్యోగులు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా ఏపీజెన్‌కో యజమాన్యం స్పందించి భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని ఉద్యోగులు కోరుతున్నారు.
ఆర్టీపీపీలో నాలుగు ఇళ్లలో చోరీ యత్నం


