పట్టపగలే దోపిడీ
కొండాపురం : మండల పరిధిలోని పెంజి అనంతపురం గ్రామంలోని లక్ష్మి కాంతమ్మ, నారాయణరెడ్డి ఇంటిలో పట్టపగలే గుర్తు తెలియని వ్యక్తులు 6.5 తులాల బంగారం దోపిడీ చేశారు. స్థానికుల వివరాల మేరకు గ్రామంలోకి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు బియ్యం పెట్టమని అడుక్కుంటూ వచ్చారు. నారాయణరెడ్డి ఇంటివద్దకు వెళ్లగా బాత్‌రూమ్‌లో నారాయణరెడ్డి స్నానం చేస్తుండగా, లక్ష్మి కాంతమ్మ ఒక్కతే ఇంట్లో ఉండింది. ఇదే అదనుగా గుర్తుతెలియని వ్యక్తులు ఇంటిలోకి దూరి ఆమె ముఖంపై మత్తుమందు చల్లి ఆమెను తాడుతో కట్టేసి నోట్లో వస్త్రాలు పెట్టి బీరువాలోని ఒక నల్లపూసలదండ, ఒక చైన్ మొత్తం 6.5 తులాల బంగారం ఎత్తుకెళ్లారు. సీఐ రాజా, ఎస్‌ఐ ప్రతాప్ రెడ్డి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో
మహిళకు తీవ్ర గాయాలు
వల్లూరు : కడప – తాడిపత్రి ప్రధాన రహదారిపై మండల పరిధిలోని కొప్పోలు బస్టాపు సమీపంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పుత్త చిన్నాయపల్లె గ్రామానికి చెందిన సింగంరెడ్డి వర లక్ష్మి అనే మహిళ తీవ్రంగా గాయపడింది. స్థానికులు తెలిపిన సమాచారం మేరకు వరలక్ష్మి బస్టాపు వద్ద రోడ్డు దాటుతుండగా కమలాపురం వైపు నుంచి కడప వైపు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. దీంతో ఆమె తీవ్రంగా గాయపడి రక్తస్రావమైంది. స్థానికులతో పాటు అదే సమయంలో అటు వెళుతున్న వైఎస్‌ఆర్‌సీపీ నేత సంబటూరు ప్రసాద్‌రెడ్డి ఆమెను పరామర్శించి 108 వాహనానికి సమాచారం ఇచ్చారు. అనంతరం స్థానికులు ఆమెను చికిత్స కోసం కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న ఎస్‌ఐ శివ నాగిరెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.
బత్తల శ్రీనివాసరెడ్డికి
స్టేషన్ బెయిల్
పులివెందుల : బద్వేలుకు చెందిన సోషల్ మీడియా యాక్టివిస్ట్ బత్తల శ్రీనివాసరెడ్డికి పులివెందులలో స్టేషన్ బెయిల్ మంజూరైంది. మంగళవారం రాత్రి కడప కోర్టులో బెయిల్ మంజూరు కాగానే కోర్టు బయట వేచి ఉన్న పులివెందుల పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని పులివెందుల స్టేషన్‌కు తరలించారు. శ్రీనివాస్ రెడ్డిపై నమోదైన కేసు సెక్షన్ల ప్రకారం స్టేషన్ బెయిల్ కావడంతో బుధవారం రాత్రి అతనికి 41ఏ నోటీసులు జారీ చేసి విడుదల చేశారు. ఆ వెంటనే అతన్ని నెల్లూరు జిల్లాకు చెందిన వసంతపేట పోలీసులు పులివెందుల డీఎస్పీ ఆఫీస్ వద్ద అదుపులోకి తీసుకుని వెళ్లిపోయారు.
క్వార్టర్ ఫైనల్స్‌కు చేరిన క్రికెట్ పోటీలు
విజయవాడరూరల్ : మండలంలోని నున్న గ్రీన్ హిల్స్ మైదానంలో 69వ ఆంధ్రప్రదేశ్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్‌జీఎఫ్ ఏపీ) అండర్–17 బాలుర అంతర జిల్లా క్రికెట్ చాంపియన్‌షిప్ బుధవారం ప్రారంభమైంది. కృష్ణా, కడప, గుంటూరు, విశాఖ, తూర్పు గోదావరి జట్లు క్వార్టర్ ఫైనల్స్‌కు చేరాయి. ప్రారంభ మ్యాచ్‌లో కడప జిల్లా గుంటూరుపై 20 పరుగుల తేడాతో విజయం సాధించి క్వార్టర్ ఫైనల్స్‌కు అర్హత సాధించింది. కడప జిల్లా కర్నూలును 47 పరుగుల తేడాతో ఓడించింది.
పట్టపగలే దోపిడీ


