ఉద్యోగుల హక్కు పెన్షన్
● డీఆర్‌ఓ విశ్వేశ్వరనాయుడు
● ఘనంగా పెన్షనర్స్ దినోత్సవం
కడప ఎడ్యుకేషన్ : పెన్షన్ అనేది ఉద్యోగుల హక్కు అని డీఆర్‌ఓ విశ్వేశ్వరనాయుడు అన్నారు. వైఎస్సార్ కడప జిల్లా ప్రభుత్వ పెన్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం పాత రిమ్స్‌లోని బీసీ భవన్‌లో జాతీయ పెన్షనర్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వర నాయుడు మాట్లాడుతూ పెన్షనర్స్ అందరూ వివిధ రంగాలలో నాలుగు దశాబ్దాల పాటు కష్టించి ప్రభుత్వానికి, ప్రజలకు వారధులుగా పనిచేసిన వారన్నారు. వారి న్యాయమైన కోర్కెలు నెరవేర్చడం ప్రభుత్వ బాధ్యత అన్నారు. తమ పరిధిలో ఉన్న సమస్యలను తప్పక పరిష్కరిస్తామని, పెన్షన్ పొందే హక్కు ప్రతి పెన్షనర్‌కు ఉందని పేర్కొన్నారు. ఉపాధ్యాయ శాసన మండలి మాజీ సభ్యులు పోచంరెడ్డి సుబ్బారెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయ, ఉద్యోగ పెన్షనర్లకు రావాల్సిన బకాయిలను వాయిదాలు వేస్తూ, మానసిక క్షోభకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మెడికల్ బిల్లులు కూడా ప్రస్తుత ప్రభుత్వాలు చెల్లించడం లేదన్నారు. జిల్లా ఎన్‌జీఓ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు శ్రీనివాసులు, నిత్యపూజయ్య మాట్లాడుతూ పెన్షనర్స్ సమస్యలు తమ సమస్యలు గానే భావించి, వాటి సాధనకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. సంఘం కార్యదర్శి రామమూర్తి నాయుడు, వర్కింగ్ ప్రెసిడెంట్ నాగముని రెడ్డి, అసోసియేట్ ప్రెసిడెంట్ రాధాకృష్ణ మాట్లాడుతూ పెన్షనర్స్ డే ప్రాముఖ్యతను వివరించారు. అనంతరం 75 వసంతాలు పూర్తి చేసుకున్న 51 మంది విశ్రాంత ఉద్యోగులను ముఖ్య అతిథుల చేతుల మీదుగా ఘనంగా సన్మానించారు. సన్మాన గ్రహీతలు నారాయణ, రాయుడు, సుబ్బారెడ్డి, ఉత్తన్న తదితరుల మాట్లాడుతూ తమను సత్కరించడం సంతోషాన్ని ఇచ్చిందన్నారు. కోశాధికారి నాగేష్ వందన సమర్పణతో సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో సంఘం నాయకులు ఆకేపాటి సుబ్బారాయుడు, సుభాన్, చలపతి, నాగరత్నాచారి, మస్తాన్, రామ్మోహన్ రాజు, సత్యరాజు, రామకృష్ణ, సంఘం కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.


