నర్సింగ్ కాలేజీ వద్ద ఉద్రిక్తత
● కాలువలపై ఉన్న ఆక్రమణల తొలగింపునకు అధికారుల యత్నం
● నోటీసులు ఇవ్వకుండా
ఎలా తొలగిస్తారని
ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి ప్రశ్న
కడప కార్పొరేషన్ : ఆక్రమణల తొలగింపు విషయంలో సాయి కృప నర్సింగ్ కాలేజీ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాలేజీ ఎదుట కాలువపై ఉన్న తాపలను తొలగించేందుకు అడిషనల్ కమిషనర్ రాకేష్ చంద్రం ఆధ్వర్యంలో నగరపాలక అఽధికారులు కాలేజీ వద్దకు చేరుకున్నారు. తమకు ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఎలా తొలగిస్తారని కళాశాల ఛైర్మన్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డి అధికారులను ప్రశ్నించారు. డ్రైనేజీ కాలువలో నీరు ప్రవహించడమే మీ ఉద్దేశమైతే తామే తొలగిస్తామని చెప్పారు. ఇందుకు అడిషనల్ కమిషనర్ అంగీకరించలేదు. తాపలు తొలగించాల్సిందేనని పట్టుబట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీకి, అడిషనల్ కమిషనర్‌కు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. చివరకు మూడు రోజుల్లో తాపలు తొలగించాలని, లేనిపక్షంలో శనివారం తామే వచ్చి తొలగిస్తామని కమిషనర్ చెప్పి వెళ్లిపోయారు.
రాజకీయ కక్షపాధింపునకు పరాకాష్ట
వైఎస్సార్‌సీపీ నాయకులపై కడప ఎమ్మెల్యే కక్ష సాధింపునకు ఇది పరాకాష్ట అని పలువురు విమర్శిస్తున్నారు. నాలుగు రోజుల క్రితం ఇదే ప్రాంతంలో పర్యటించిన ఆమె నర్సింగ్ కాలేజీ వద్ద తాపలు తొలగించాలని నగరపాలక అధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే ఆదేశాలతో అధికారులు ఉన్నఫళంగా జేసీబీ తీసుకురావడం పట్ల విస్మయం వ్యక్తమవుతోంది. సాయికృప నర్సింగ్ కాలేజీ ఎదుట చాలా ఏళ్ల క్రితమే తాపలు కట్టి ఉన్నారు. కాలువలో నీరు సక్రమంగా పోకపోయినా, కాలువల్లో పూడిక తీయాల్సి వచ్చినా గ్రిల్స్ వేసుకోవాలని చెప్పవచ్చు. లేదా తొలగిస్తామని ముందస్తు నోటీసులు ఇవ్వాలి. అలాకాకుండా రాజకీయ కోణంలో ఆక్రమణల పేరిట తొలగించే యత్నం చేయడం దుమారం రేపుతోంది. గతంలో వైఎస్సార్‌సీపీ నాయకులకు చెందిన వాటర్‌ప్లాంట్లు, కమర్షియల్ షాపులు కూలగొట్టించిన ఎమ్మెల్యే, తాజాగా వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డిని లక్ష్యంగా చేసుకొని వారి కళాశాల తాపలను తొలగించడానికి అధికారులను ఉసిగొల్పడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.


