అసభ్యంగా ప్రవర్తించినందుకు ఇద్దరికి జైలు శిక్ష
ఎర్రగుంట్ల : ఓ అమ్మాయి పట్ల అసభ్యంగా ప్రవర్తించినందుకు ఇద్దరు యువకులకు కోర్టు జైలు శిక్ష, జరిమానా విధించింది. కలమల్ల ఎస్‌ఐ డి.సునీల్ కుమార్ రెడ్డి వివరాల మేరకు.. ముద్దనూరు మండలం చెర్లోపల్లి గ్రామానికి చెందిన కుంచెం శ్రీధర్, కుంచెం గోపాల్ అనే యువకులు 2023 సంవత్సరంలో ఒక అమ్మాయితో అసభ్యకరంగా ప్రవరించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు అప్పటి ఎస్‌ఐ సంజీవరెడ్డి కేసు నమోదు చేశారు. ఈ కేసును విచారించిన కడప పోక్సో కోర్టు జడ్జి ఎస్.ప్రవీణ్ కుమార్ కుంచెం శ్రీధర్‌కు 21 రోజుల జైలు శిక్ష రూ.25 వేలు జరిమానా, కుంచెం గోపాల్‌కు 17 రోజుల జైలు శిక్ష, రూ.10 వేలు జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చారు. నిందితులకు శిక్ష పడేందుకు సహకరించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ కొమ్మినేని వేణుగోపాల్, ఎస్‌ఐ సునీల్‌కుమార్ రెడ్డి , కోర్టు కానిస్టేబుల్ ఎం.నారాయణ, కోర్టు మానిటరింగ్ ఏఎస్‌ఐ నాగేంద్ర, సీఐ వినయ్‌కుమార్‌రెడ్డిలను ఉన్నతాధికారులు ప్రశంసించారు.
క్విజ్ పోటీల్లో
జిల్లా విద్యార్థుల ప్రతిభ
కడప కార్పొరేషన్ : జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా ఇంధన పొదుపుపై విద్యార్థుల్లో అవగాహన పెంపొందించేందుకు ఏపీఎస్‌పీడీసీఎల్ సీఎండీ శివశంకర్ లోతేటీ ఆధ్వర్యంలో సంస్థ పరిధిలోని 9 జిల్లాలలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఇంధన పొదుపుపై క్విజ్ పోటీలు నిర్వహించారు. ఇందులో జిల్లాకు చెందిన విద్యార్థులు ప్రతిభ కనబరిచారని కడప డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ హరిసేవ్యా నాయక్ తెలిపారు. బుధవారం డివిజన్ కార్యాలయంలోని తన ఛాంబర్‌లో వారిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. క్విజ్ పోటీల్లో ఖాజీపేట ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థి జీవీవీ నాగిరెడ్డి, ఈ. నాగ రిషిత, ప్రొద్దుటూరు ఎస్‌పీసీఎన్ మున్సిపల్ హైస్కూల్ విద్యార్థి వై. ప్రణీత్‌రెడ్డి, వైవీఎస్ మున్సిపల్ హైస్కూల్ వి. వైష్ణవ్‌లు విజేతలుగా నిలిచారని తెలిపారు.


