నజీరుల్లా మఠం, మసీదు వక్ఫ్‌బోర్డు స్వాధీనం
ప్రొద్దుటూరు కల్చరల్ : మైదుకూరు రోడ్డులోని నజీరుల్లా షా మఠం, ఖాదర్ హుస్సేన్ మసీదులను వక్ఫ్‌బోర్డు స్వాధీనం చేసుకుంటున్నట్లు వక్ఫ్ బోర్డు ఇన్‌స్పెక్టర్ వసీం అక్రం తెలిపారు. బుధవారం ఆయన నజీరుల్లా షా మఠం వద్ద నోటీసులు అతికించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కొంత మంది నజీరుల్లా షా మఠం ఆస్తులు ఆక్రమణకు గురవుతున్నాయని హైకోర్టులో పిటీషన్ వేశారన్నారు. హైకోర్టు, వక్ఫ్ బోర్డు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వక్ఫ్‌బోర్డు ఆస్తులను స్వాధీనం చేసుకుంటున్నట్లు తెలిపారు. అలాగే ఖాదర్ హుస్సేన్ మసీదును సక్రమంగా నిర్వహించడం లేదని, కమిటీని సక్రమంగా నిర్వహించాలని అనేక సార్లు చెప్పినా పరిస్థితిలో మార్పులేదన్నారు. దీంతో ఆ మసీదును వక్ఫ్‌బోర్డు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కాగా నజీరుల్లాషా మఠం వద్ద అంజుమన్ అహలే ఇస్లాం కమిటీ అధ్యక్షుడు వీఎస్ ముక్తియార్, నజురుల్లా షా మఠం ట్రస్టు ప్రతినిధులు, సభ్యులు వక్ఫ్‌బోర్డు ఇన్స్‌పెక్టర్‌తో చర్చించారు. కోర్టు తీర్పు మేరకు ఆస్తులపై సర్వే నిర్వహించాలని, నజీరుల్లా షా మఠాన్ని స్వాధీనం చేసుకోవడాన్ని తాము ఒప్పుకోమని తెలిపారు.


