వైఎస్సార్‌సీపీ కార్యాలయంపై దాడి హేయం
లక్కిరెడ్డిపల్లి : సత్యసాయి జిల్లా, హిందూపురం పట్టణంలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంపై టీడీపీ నాయకులు, కార్యకర్తలు కలిసి దాడికి తెగబడి కార్యాలయం ధ్వంసం చేయడం, ఫర్నీచర్‌ను పగులకొట్టడం హేయమైన చర్య అని హిందూపురం పార్లమెంట్ పరిశీలకులు, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రెడ్డప్పగారి రమేష్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం మండలంలోని ఆర్‌ఆర్ నివాసంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు ప్రోత్సాహంతోనే హిందూపురంలో స్థానిక ఎమ్మెల్యే బాలకృష్ణ రౌడీయిజం మొదలుపెట్టారని, అందులో భాగంగానే వైఎస్సార్‌సీపీ కార్యాలయంపై టీడీపీ రౌడీమూకలను పంపించి ధ్వంసం చేయించడం వారి వికృతచేష్టలకు పరాకాష్టగా మారిందన్నారు. దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ దుశ్చర్యకు స్థానిక ఎమ్మెల్యే బాలకృష్ణనే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. ఇటువంటి దాడులకు అక్కడున్న అభ్యర్థి, వైఎస్సార్ సీపీ నాయకులు భయపడతారని మీరు అనుకుంటున్నారేమో.. ఇంకా రెట్టింపు ఉత్సాహంతో పార్టీకోసం పనిచేస్తారన్నారు. రాబోయే రోజుల్లో మీకు కూడా ఇటువంటి సమస్యలు తప్పకుండా పునరావృతం అవుతాయనే విషయాన్ని గుర్తు చేసుకోవాలన్నారు. మీకు చంద్రబాబు నేర్పిన సంస్కారం, సంస్కృతి ఇదేనా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పరిరక్షించాల్సిన పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా మారారన్నారు. హిందూపురం పట్టణంలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంపై దాడి చేసిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
ఆర్ రమేష్ కుమార్ రెడ్డి


