 
															‘ప్రైవేటీకరణ’రద్దు కోసం పోరాడుతాం
పులివెందుల: రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయాలని చూస్తున్న కూటమి ప్రభుత్వ కుట్రను అడ్డుకునేందుకు ఎంతవరకైనా పోరాటం చేస్తామని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం పట్టణంలోని స్థానిక భాకరాపురంలోని వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రభు త్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు అనేక రకాలుగా నిరసన కార్యక్రమాలు చేశామన్నారు. అందులో భాగంగా చేపట్టిన కోటి సంతకాల సేకరణకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నుంచి విశేషమైన ఆదరణ లభిస్తోందన్నారు. రాష్ట్రంలో దాదాపు జిల్లాకు ఒకటి చొప్పున ఉన్న మెడికల్ కళాశాలలను ప్రైవేట్‌పరం చేయడాన్ని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారన్నారు. పేద ప్రజలకు ఉచిత వైద్య, విద్యను దూరం చేయాలనుకోవడం చంద్రబాబు దుర్మార్గపు చర్యకు పరాకాష్టగా చెప్పుకోవచ్చని ధ్వజమెత్తారు. అమరావతి రాజధానికి లక్షల కోట్లు ఖర్చు పెడుతున్న ఈ ప్రభుత్వం కేవలం రూ.5వేల కోట్లు వెచ్చిస్తే మెడికల్ కళాశాలలు పూర్తిస్థాయిలో నిర్మాణాలు పూర్తవుతాయన్నారు. కూటమి ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తులకు లబ్ధి చేకూర్చేందుకు ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని దుయ్యబట్టారు.
తుపాన్‌వల్ల నష్టపోయిన
రైతులను ఆదుకోవాలి
రెండు రోజుల క్రితం రాష్ట్రంలో కురిసిన మోంథా తుపాన్‌వల్ల పంట నష్టం జరిగిన ప్రతి రైతన్నలను ప్రభుత్వం ఆదుకోవాలని ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి డిమాండ్ చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో పంట నష్టం జరిగిన నెలలోపే రైతులకు ప్రభుత్వ సాయం అందేదన్నారు. ఈ ప్రభుత్వంలో ఇప్పటివరకు పంట నష్టపోయిన ఏ రైతులను ప్రభుత్వం ఆదుకోలేదన్నారు. అనంతరం ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేశారు.
ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
