 
															కోర్టు స్టే
వల్లూరు: డాక్టర్ వైఎస్‌ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ తరలింపుపై హైకోర్టు స్టే విధించింది. ఈ యూనివర్సిటీ ఏర్పాటైనప్పటి నుంచి కడప నగర సమీపంలోని శ్రీనివాస ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి భవన సముదాయంలో నడుస్తోంది. ప్రస్తుత ఆర్కిటెక్చర్ యూనివర్సిటీ వీసీ జయరామిరెడ్డి బాధ్యతలు స్వీకరించిన అతి కొద్ది రోజుల్లోనే ఈ యూనివర్సిటీని వైవీయూ ప్రాంగణంలోని 21 వ శతాబ్దం గురుకులంలోకి తరలించాలని నిర్ణయం తీసుకున్నారు. లీజు అగ్రిమెంట్ నిబంధనలను పక్కనపెట్టి హడావుడిగా యూనివర్సిటీ తరలింపు చర్యలు చేపట్టడం విమర్శలకు తావిచ్చింది.
కొనసాగిస్తామని చెప్పి..
నిజానికి శ్రీనివాస ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ భవన సముదాయంలో ఆర్కిటెక్చర్ యూనివర్సిటీ నిర్వహణకు సంబంధించి 2024 డిసెంబర్‌లో అగ్రిమెంట్ ముగిసింది. ఈ క్రమంలో తమ భవనాలను ఖాళీ చేయాలని యాజమాన్యం జనవరిలో యూనివర్శిటీ అధికా రులకు నోటీసులు అందచేసింది. వైవీయూలో ఈ యూనివర్సిటీ నిర్వహణకు కేవలం 4 భవనాలు మాత్రమే అందుబాటులో ఉన్న కారణంగా అక్కడ పూర్తి స్థాయిలో తరగతులు, కార్యకలాపాలు నిర్వహించడం వీలు కాదని భావించిన యూనివర్శిటీ వారు ఇక్కడే కొనసాగించడానికి సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ఈ నెల 22న తమ అగ్రిమెంట్‌ను రెన్యువల్ చేయాలని యాజమాన్యం యూనివర్సిటీని కోరింది. ఈ క్రమంలో తాము ఈ నెల 31లోపు యూనివర్శిటీని తరలిస్తున్నట్లు 24 వ తేదీ రాత్రి మెయిల్ ద్వారా యూజమాన్యానికి తెలియచేసింది. 27న నోటీసును అందచేసింది. దీంతో తమకు ఇప్పటి వరకు ఇవ్వాల్సిన అద్దె, ఇతర బకాయిలను, విద్యుత్ చార్జీలను చెల్లించాలని, అగ్రిమెంట్ నిబంధనల మేరకు మూడు నెలల ముందు నోటీస్ ఇచ్చిన తరువాత ఖాళీ చేయాలని యాజమాన్యం తెలిపింది.
సామగ్రి తరలింపుపై అభ్యంతరం
శుక్రవారం ఉదయం యూనివర్సిటీకి సంబంధించిన సామగ్రి, ఫర్నీచర్‌ను తరలించడానికి ట్రాక్టర్‌లను సిద్ధం చేయగా యాజమాన్యం అభ్యంతరం తెలిపింది. దీంతో వీసీ పోలీసులకు సమాచారం అందించగా చెన్నూరు సీఐ కృష్ణారెడ్డి తమ సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకుని యాజమాన్యంతో చర్చించారు. లీజు అగ్రిమెంట్ నిబంధనలతో బాటు, తమ దగ్గర ఉన్న డాక్యుమెంట్లను వారు ఆయనకు అందచేశారు. ఈ క్రమంలో లీజ్ అగ్రిమెంట్ విషయమై సీఐ వీసీతో చర్చలు జరిపారు.
నిబంధనలకు తిలోదకాలు
ఒక యూనివర్సిటీని మొత్తం ఒక చోట నుంచి మరో చోటికి తరలించాలంటే అందులోని సామగ్రిని, రికార్డులను తరలించడానికి టెండరు నిర్వహించాల్సి ఉంటుంది. అందులో తక్కువ మొత్తానికి కోట్ చేసిన వారికి తరలింపు కాంట్రాక్టును ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఎలాంటి టెండర్లు నిర్వహించకుండా ట్రాక్టర్లను ఏర్పాటు చేసి తరలించాలని చూడడం నిబంధనలకు విరుద్ధమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కాగా లీజు అగ్రిమెంట్‌కు సంబంధించి మూడు నెలల ముందు నోటీసు ద్వారా తెలపకపోవడంతో బాటు, తమకు చెల్లించాల్సిన సుమారు రూ 3.5 కోట్ల బకాయిలు చెల్లించకుండా యూనివర్సిటీని తరలించాలని నిర్ణయించడంపై శ్రీనివాస ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం హైకోర్టును ఆశ్రయించింది. దీంతో సదరు కోర్టు వారం రోజుల పాటు యథాతథ స్థితిని కొనసాగించాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో యూనివర్శిటీ తరలింపునకు తాత్కాలికంగా బ్రేక్ పడింది.
 
							కోర్టు స్టే

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
