 
															‘మోంథా’తో లక్షల ఎకరాల పంట నష్టం
ప్రొద్దుటూరు: రాష్ట్రంలో మోంథా తుపాన్ ప్రభావం కారణంగా 20 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగి రైతులు తీవ్రంగా నష్టపోయారని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాదరెడ్డి తెలిపారు. ఆయన గురువారం తన స్వగృహంలో విలేకరులతో మాట్లాడారు. లక్షల సంఖ్యలో రైతులు పంట నష్టాన్ని చవిచూశారన్నారు. ప్రకృతి రైతులపై కన్నెర చేస్తే కూటమి ప్రభుత్వం మాత్రం కళ్లు మూసుకుందని ధ్వజమెత్తారు. వర్షం నీరు రైతుల కన్నీళ్లలో కలిసిపోయాయని, ఇది విచారించదగ్గ విషయమని తెలిపారు. ప్రకృతి వైపరీత్యాలు రావడం ఏ ప్రభుత్వంలో అయినా సహజమని, రైతులను ఆదుకునే ఉదార స్వభావం ప్రభుత్వాలకు ఉండాల్సిన అవసరం ఉందన్నారు. లేకుంటే నష్టాలతో రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వస్తుందని తెలిపారు. వ్యవసాయం దండగ అని గతంలో అన్న ముఖ్యమంత్రి చంద్రబాబు రైతు ద్రోహిగా రైతుల మనసులో మిగిలిపోయాడ న్నారు. ఈఏడు ఖరీఫ్‌లో, రబీలో ప్రకృతి వైపరీ త్యాల ప్రభావం కారణంగా పంటలు నష్టపోయినా ప్రభుత్వం ఇసుమంతైనా సాయం చేయలేదని మండిపడ్డారు. ప్రభుత్వానికి ప్రచార యావ తప్ప రైతులను ఆదుకునే మనసు లేదని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో సాగు చేసిన వరి, మొక్క జొన్న, పత్తి, మిరప, ఉల్లి, పసుపు లాంటి అన్ని రకాల పంటలు దెబ్బ తిన్నాయని రాచమల్లు పేర్కొన్నారు.
సబ్సిడీ శనగలు కూడా ఇవ్వలేదు
వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు ప్రభుత్వం అన్ని విధాలా సా యం చేసిందని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి తెలిపారు. పంటలకు ఉచిత పంటల బీమా నమో దు చేయడం, ఎరువులు, విత్తనాలు అందించడం, 40 శాతం సబ్సిడీతో శనగలను అందించడం జరిగిందన్నా రు. కూటమి ప్రభుత్వం ఇంతవరకు శనగ విత్తనా లను రైతుల చేతికి అందించలేదన్నారు. 25 శాతం సబ్సిడీతో ఇచ్చేందుకు ఇంకా ప్రణాళికలను తయారు చేసే పరిస్థితుల్లోనే ప్రభుత్వం ఉందన్నారు. సాధారణంగా ప్రతి ఏడాది సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 5లోపు సబ్సీడీ విత్తనాలను పంపిణీ చేయాల్సి ఉందన్నారు. జగన్ ప్రభుత్వంలో పంటలు దెబ్బతింటే నెల రోజుల్లోపే రైతులకు పరిహారం అందించే పరిస్థితి ఉండేదన్నారు.మోంథా తుపాన్‌తో తీవ్రంగా నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం దీనిని జాతీయ విపత్తుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోని ఎంపీల బలంపైనే ఆధారపడి ఉందని, ఎంపీలు రైతులను ఆదుకునేందుకు కేంద్రాన్ని డిమాండ్ చేయాలని కోరారు.
ఇప్పటివరకు జరిగిన నష్టాలకుప్రభుత్వం రూపాయి చెల్లించలేదు
నష్టాలతో రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వస్తోంది
మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
