 
															అన్నమయ్యా...ఇదేందయ్యా..!
కమిటీ నిర్ణయం మేరకే నిర్మాణం
● టెండరు రద్దు చేయకుండానే
కమిటీ ఏర్పాటు
● వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో కొత్త ప్రాజెక్టు నిర్మాణానికి రూ.787.77 కోట్లు
● రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌కు టెండరు ఖరారు
● ఐదు గేట్లు ఉన్న అన్నమయ్య ప్రాజెక్టు 14గేట్ల నిర్మాణానికి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చర్యలు
● కూటమి ప్రభుత్వం వచ్చాక
నిర్మాణానికి అడుగులు పడని వైనం
కడప సిటీ : అన్నమయ్య ప్రాజెక్టు నిర్మాణాన్ని కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది. కమిటీ పేరుతో కాలయాపన చేస్తూ కాలం గడుపుతోంది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రూ. 787.77 కోట్లతో నిర్మాణం చేపట్టేందుకు ముందుకువచ్చింది. ఈ పనులకు సంబంధించి రాఘవ కన్‌స్ట్రక్షన్స్ కంపెనీ టెండర్ దక్కించుకుంది. ఇన్వెస్టిగేషన్‌కే రూ.కోటి ఖర్చు చేసింది. అంతలోపే ఎన్నికలు రావడం, అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం పనులు కొనసాగించకుండా కాలం వృథా చేస్తోంది. టెండరు రద్దు చేయకుండా కమిటీ ఏర్పాటుచేసి నిర్మాణానికి ఆలస్యం చేస్తూ మళ్లీ ఇన్వెస్టిగేషన్, కొత్త డిజైన్‌తో పనులు చేపడతామంటూ సాకులు చెబుతోంది. వైఎస్సార్‌సీపీ హయాంలో ప్రాజెక్టు గురించి ఎన్నో ఆరోపణలు చేసిన టీడీపీ అధికారంలోకి వచ్చాక నిర్మాణాలు చేపట్టడం లేదు.
కమిటీతో కాలయాపన
2.20 టీఎంసీల సామర్థ్యంతో చెయ్యేరు నదిపై 2001 నాటికి ఐదు గేట్లతో అన్నమయ్య ప్రాజెక్టు నిర్మించారు. అయితే 2021 నవంబరు, 19న అకస్మిక వరదలతో ప్రాజెక్టు తెగిపోయింది. దీంతో అప్పుడు అధికారంలో ఉన్న వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రూ.787.77 కోట్లతో ప్రాజెక్టు నిర్మించి ఐదు గేట్ల నిర్మాణాన్ని 14 గేట్లకు పెంచేందుకు టెండర్ ఖరారుచేసింది. రాఘవ కన్‌స్ట్రక్షన్స్ కంపెనీ టెండర్ దక్కించుకుని ఇన్వెస్టిగేషన్ పనులు చేపట్టింది. అంతలోపే ఎన్నికల కోడ్ రావడంతో పనులు నిలిచి పోయాయి. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిక కూటమి ప్రభుత్వం 25శాతంలోపు జరిగిన పనులను రద్దుచేయాలని ఆదేశాలు జారీ చేసింది. చేసిన రూ.కోటి పనులకు బిల్లు చెల్లించకుండా ఎగనామం పెట్టింది. ఇదే కంపెనీతో డిజైన్ వర్క్ చేయమని చెప్పినా కాంట్రాక్టర్ అందుకు అంగీకరించలేదు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రత్యేక నిపుణులు, నీటిపారుదలశాఖ అధికారులతో కమిటీ ఏర్పాటుచేసింది. అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కాలం దాటినా కమిటీ నివేదిక ఇంత వరకూ రాలేదు. కేవలం కమిటీ నెపంతో కాలయాపన చేస్తున్నారే గానీ, నిర్మించే యోచనలో కూటమి ప్రభుత్వం లేదని అక్కడి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గేట్ల సంఖ్య పెంపు
చెయ్యేరుకు వందేళ్లలో ఒకసారి గరిష్ఠంగా 2.40 లక్షల క్యూసెక్కులు, 200 ఏళ్లకు ఒకసారి గరిష్టంగా 2.80 లక్షల క్యూసెక్కుల వరద వస్తోందని అఽధికారులు అంచనా వేశారు. 140 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా అన్నమయ్య ప్రాజెక్టుకు 3.20 లక్షల క్యూసెక్కుల వరద నీరు చేరి 2021 నవంబరు, 19న తెగిపోయింది. ఈ నేపథ్యంలో నాలుగు లక్షల క్యూసెక్కుల కంటే ఎక్కువ వరద వచ్చినా సులభంగా దిగువకు విడుదల చేసేలా స్పిల్‌వే నిర్మించాలని అప్పటి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు జల వనరులశాఖ అఽధికారులు అన్నమయ్య ప్రాజెక్టు రీడిజైన్ చేశారు. ఐదే గేట్లుగా ఉన్న అన్నమయ్య ప్రాజెక్టును 14 గేట్లుగా నిర్మించాలని సంకల్పించారు.
టీడీపీ నిర్లక్ష్యం
2012లో జలవనరులశాఖ 3డీ అధ్యయనంలో అన్నమయ్య ప్రాజెక్టు స్పిల్‌వే నుంచి గరిష్ఠంగా 2.17 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేయవచ్చని నివేదికలు ఇచ్చారు. 2017లో ప్రాజెక్టును తనిఖీ చేసిన డ్యాం సేఫ్టీ కమిటీ 1.30 లక్షల క్యూసెక్కుల వరదను దిగువకు విడుదల చేసేలా అదనంగా మరో స్పిల్ వే నిర్మించాలని ఇచ్చిన నివేదికను అప్పటి టీడీపీ సర్కార్ పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో 2021 నవంబరు, 16, 17, 18, 19 తేదీల్లో శేషాచలం–నల్లమల అడవులు, చెయ్యేరు, బాహుదా, మాండవ్య పరిసర ప్రాంతాల్లో కుంభవృష్టి కురిసింది. ఈ నేపథ్యంలో నవంబరు 17న అన్నమయ్య ప్రాజెక్టులో సగటున 1.77 టీఎంసీలు నిల్వచేస్తూ వచ్చిన వరదను వచ్చినట్లుగా దిగువకు వదిలారు. 18వ తేదీ రాత్రి 8 గంటలకు 77.125 క్యూసెక్కులకు చేరడంతో దిగువకు 1,09,124 క్యూసెక్కుల నీటిని వదలారు. అదే రోజున రాత్రి 10 గంటలకు ప్రాజెక్టు గేట్లను పూర్తిగా ఎత్తివేసి 1,46,056 క్యూసెక్కుల నీటిని దిగువకు పంపారు. 19వ తేదీ అర్ధరాత్రి ఊహించని పరిణామాలు ఎదురై 3.20 లక్షల క్యూసెక్కుల నీరు రావడంతో నీటిమట్టం గరిష్ఠ స్థాయికి చేరింది. సామర్థ్యం చాలక మట్టి కట్టపై నుంచి దిగువకు వరద నీరు చేరింది. దీంతో 19వ తేదీ ఉదయం 6.30 గంటలకు అన్నమయ్య ప్రాజెక్టు మట్టికట్ట తెగిపోయింది. అదే అప్పటి టీడీపీ ప్రభుత్వం అదనంగా స్పిల్‌వే నిర్మించి ఉంటే ప్రాజెక్టు తెగిపోకుండా ఉండేది. ఆ నిర్లక్ష్యం వల్లే ప్రాజెక్టు తెగిపోవడం జరిగిందని నిపుణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వం అన్నమయ్య ప్రాజెక్టు నిర్మాణం చేపట్టేందుకు కమిటీ ఏర్పాటుచేసింది. ఇన్వెస్టిగేషన్, డిజైన్ వర్క్ చేపట్టాల్సి ఉంది. కమిటీ అంచనాల మేరకు ప్రాజెక్టు రూపకల్పన జరుగుతుంది. ప్రస్తుతమున్న విధానాన్ని కొనసాగించే అవకాశం కనిపించడంలేదు. కమిటీ నిర్ణయించిన తర్వాత ప్రాజెక్టు నిర్మాణం చేపట్టేందుకు చర్యలు తీసుకుంటాం. – అబ్దుల్‌షమీ, ఎస్‌ఈ, నీటిపారుదలశాఖ, కడప

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
