సంపన్నులు, వ్యాపారవేత్తల పిల్లలే టార్గెట్
ప్రొద్దుటూరు క్రైం : ప్రొద్దుటూరులోని సంపన్నులు, వ్యాపార వేత్తల పిల్లలను లక్ష్యంగా చేసుకొని క్యాషినో టూర్ పేరుతో టీడీపీ నాయకులు జూదాలు ఆడేందుకు గోవాకు తరలిస్తున్నారని ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి తెలిపారు. ప్రొద్దుటూరులో గతంలో ఈ తరహా క్యాషినో గేమ్‌లు ఎప్పుడూ లేవని, టీడీపీ నాయకులు ప్రొద్దుటూరు వాసులకు వీటిని పరిచయం చేసి కొత్త సంస్కృతికి శ్రీకారం చుట్టారని తెలిపారు. దొరసానిపల్లెలోని తన స్వగృహంలో మంగళవారం రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రొద్దుటూరులో మట్కా, క్రికెట్ బెట్టింగ్, పేకాట తదితర జూదాలు ఎప్పటి నుంచో ఉన్నాయన్నారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి, ఆయన కుమారుడు కొండారెడ్డి నేతృత్వంలో కొంత మంది కౌన్సిలర్లు, టీడీపీ నాయకులు కలిసి పాత అసాంఘిక కార్యకలాపాలతో పాటు ప్రొద్దుటూరు వాసులు గతంలో ఎన్నడూ వినని, చూడని విలాసవంతమైన, ఖరీదైన జూదాలను ఆడిస్తూ నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారని తెలిపారు. ఈ నెల 23, 24, 25 తేదీల్లో కడప, బెంగళూరు, హైదరాబాద్‌ల నుంచి ఇండిగో ఫ్లైట్‌లలో గోవాకు తీసుకెళ్లేందుకు టికెట్లు కూడా బుక్ చేసుకున్నారని తెలిపారు. ఇప్పటికే 100 మందికి పైగా ప్రొద్దుటూరులోని యువకులు గోవాకు వెళ్లేందుకు సమాయత్తమవుతున్నారని రాచమల్లు పేర్కొన్నారు. ఏడాది నుంచి జరిగే ఈ తంతు ఇక్కడి పోలీసులకు తెలుసునని, అయినా ఇక్కడి రాజకీయ నేతల జోక్యంతో ఏమీ చేయలేని స్థితిలో ఉన్నారన్నారు. ప్రారంభ దశలోనే దీన్ని అణచివేయకుంటే ధనవంతుల పిల్లలను సర్వనాశనం చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రొద్దుటూరులో అసాంఘిక కార్యక్రమాలకు గేట్లెత్తేశారు..
టీడీపీ నాయకులు ప్రొద్దుటూరును జూదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మార్చారని రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి అన్నారు. ప్రొద్దుటూరులో అసాంఘిక కార్యకలాపాలు ఎక్కువగా జరుగుతున్నాయని, వాటిని కట్టడి చేయాలని ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి అసెంబ్లీలో మాట్లాడితే.. ఇక్కడ మాత్రం ఆయన కుమారుడు నంద్యాల కొండారెడ్డి అన్ని రకాల జూదాల నిర్వహణకు గేట్లు ఎత్తేశాడన్నారు. చౌకదుకాణాల్లోని రేషన్ బియ్యాన్ని టీడీపీ నాయకులు, కొందరు కౌన్సిలర్లు ప్రొద్దుటూరు కేంద్రంగా అక్రమ రవాణా చేస్తున్నారని ఆరోపించారు. ఎమ్యెల్యే వరద, కొండారెడ్డి ఆదేశాలతో రెవెన్యూ అధికారులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారన్నారు. జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్‌ను కలిసి ప్రొద్దుటూరులో జరుగుతున్న అన్ని రకాల అసాంఘిక కార్యకలాపాల గురించి వివరిస్తానని రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి తెలిపారు. సమావేశంలో కౌన్సిలర్లు వరికూటి ఓబుళరెడ్డి, నూకా నాగేంద్రారెడ్డి, గుర్రం లావణ్య పార్టీ నాయకులు పాల్గొన్నారు.
క్యాషినో టూర్ పేరుతో విమానాల్లో గోవాకు తరలింపు
ప్రొద్దుటూరులో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిన టీడీపీ నాయకులు
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రాసాద్‌రెడ్డి


