విద్యార్థి నాయకుడి నుంచి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి దాకా.
కడప వైఎస్‌ఆర్ సర్కిల్ : విద్యార్థి దశ నుంచి సీపీఐ అనుబంధ సంఘాల్లో పనిచేసిన గుజ్జుల ఈశ్వరయ్య సీపీఐ రాష్ట్ర కార్యదర్శి స్థాయికి ఎదిగారు. పులివెందుల నియోజకవర్గం తొండూరు మండలం, బద్రంపల్లె గ్రామంలో బాలమ్మ ఓబన్న దంపతులకు సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన ఈశ్వరయ్య ప్రొద్దుటూరు పట్టణంలోని హన్నమ్మ అనాథాశ్రమంలో ప్రాథమిక విద్యను చదివారు. తొండూరులో హైస్కూల్ విద్య, కడప శ్రీ రామక్రిష్ణ జూనియర్ కాలేజిలో ఇంటర్, కడప ఆర్ట్స్ కాలేజీలో డిగ్రీ చదివేటప్పుడు హైస్కూల్, హాస్టల్, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ విద్యార్థుల సమస్యలపై పోరాటాలు నిర్వహించారు. విద్యార్థులకు చదువుతో పాటు రాజకీయాలు అవసరం అని భావించి విద్యార్థి యూనియన్ ఎన్నికల్లో ఏఐఎస్‌ఎఫ్ అభ్యర్థులను అన్ని స్థానాల్లో గెలిపించారు. అనతి కాలంలోనే ఏఐఎస్‌ఎఫ్ జిల్లా కార్యదర్శిగా ఎన్నికయ్యారు. కరువు సీమకు కృష్ణా జలాలు మళ్లించాలని చేపట్టిన అనేక పోరాటాల్లో అరెస్టు అయ్యారు. తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో ఎంఏ చదువుతూ యూనివర్సిటీ విద్యార్థుల రాష్ట్ర కన్వీనర్ బాధ్యతలు చేపట్టారు. డిటెన్షన్ విధానానికి, విద్యావ్యాపారీకరణకు, కాషాయీకరణకు వ్యతిరేకం పోరాటాలు నిర్వహించారు. ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షునిగా, ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. కడప బసవతారకం లా కళాశాలలో బి.ఎల్ పూర్తి చేశారు. సీపీఐ కడప జిల్లా కార్యదర్శిగా, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యునిగా పనిచేశారు. ప్రజాసమస్యల పరిష్కారమే ధ్యేయంగా, ఉద్యమాలు చేపట్టి ప్రజానాయకుడిగా ఎదిగిన ఈశ్వరయ్య సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులు కావడం పట్ల పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా నియమితుడైన గుజ్జుల ఈశ్వరయ్య


