
వైద్య కళాశాలలను ప్రైవేటుపరం చేస్తే ఉద్యమిస్తాం
● ప్రజల ఆస్తులను పప్పులు, బెల్లాలకు అమ్మేస్తారా...?
● పులివెందుల్లో మెడికల్ కాలేజీ
ఉండరాదనే కక్ష?
● మంజూరైన సీట్లను వెనక్కి ఇవ్వడం దుర్మార్గం
● వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు
పి.రవీంద్రనాథ్‌రెడ్డి
కడప కార్పొరేషన్ : ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటుపరం చేస్తే ప్రజా ఉద్యమం తప్పదని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్‌రెడ్డి హెచ్చరించారు. వైఎస్సార్‌సీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో అవినీతి విలయతాండవం చేస్తోందన్నారు. చంద్రబాబు అవినీతి చక్రవర్తి అని తెహల్కా డాట్‌కామ్ ఎప్పుడో చెప్పిందని, దేశంలో ఆయనంత సంపన్నుడు ఎవరూ లేరని, ఆయనకున్న ఆస్తులు మరెవరికీ లేవని ఆరోపించారు. పెద్ద హాస్పిటల్స్ అన్నీ హైదరాబాద్, బెంగళూరు, చైన్నె నగరాల్లో ఉన్నా.. ఏపీలో కరోనాను వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి అధిగమించారన్నారు. తద్వారా రాష్ట్రంలో తక్కువ మరణాలు నమోదయ్యాయన్నారు. భవిష్యత్‌లో ఇలాంటి పరిస్థితి రాకుండా మాజీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఒక విజన్‌తో ఒక్కో జిల్లాకు ఒక వైద్య కళాశాల చొప్పున 17 కొత్త మెడికల్ కాలేజీలను మంజూరుచేయించారన్నారు. 1923 నుంచి రాష్ట్రంలో 12 మెడికల్ కాలేజీలే ఉన్నాయని, కొత్తగా మంజూరైన మెడికల్ కాలేజీల్లో ఐదు కాలేజీలు పూర్తయ్యాయని, మరో రెండు ప్రారంభోత్సవానికి సిద్ధగా ఉన్నాయని పేర్కొన్నారు. పులివెందుల మెడికల్ కాలేజీలో అన్ని వసతులు, వైద్య పరికరాలు ఉన్నా.. పులివెందులకు 50 సీట్లు వద్దు అని లేఖ రాసిన దుర్మార్గ ప్రభుత్వం ఇదేనని ధ్వజమెత్తారు. ఎవరైనా మెడికల్ సీట్లు కావాలని కోరుకుంటారని, సీట్లు వద్దని చెప్పిన ఏకై క ప్రభుత్వాన్ని ఇప్పుడే చూస్తున్నామన్నారు. పులివెందుల ప్రజలు మనకు ఓట్లేయరు...అక్కడ మెడికల్ కాలేజీలు ఉండకూడదనే కక్షతోనే ఇలా చేస్తున్నారని మండిపడ్డారు. 2024–25 సంవత్సరానికి 50 సీట్లు తీసుకొని ఉంటే, 2025–26 సంవత్సరానికి మరో 150 సీట్లు వచ్చి ఉండేవన్నారు. ఆ అవకాశాన్ని ప్రభుత్వం తుంగలో తొక్కిందన్నారు. వైఎస్ జగన్ మొదటి విడత చేపట్టిన 10 మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేస్తూ జీవో ఇవ్వడం దుర్మార్గమన్నారు. ఒక్కో మెడికల్ కాలేజీ 50–100 ఎకరాల్లో రూ.500 కోట్లతో నిర్మించారని, అవి లక్షల కోట్ల రూపాయల విలువజేసే ప్రజా ఆస్తులని తెలిపారు. ఈ మెడికల్ కాలేజీల వల్ల 2360 మెడికల్ సీట్లు వస్తాయని, 2550 సీట్లు అదనంగా వచ్చే అవకాశముందన్నారు. ఇక్కడ మెడికల్ సీట్లు లేక రాష్ట్రంలోని విద్యార్థులు రష్యా, చైనా, జార్జియా వంటి దేశాలకు పోతుంటే వచ్చిన వాటిని వెనక్కి ఇవ్వడం దారుణమన్నారు. ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటు పరం చేయడమే చంద్రబాబు నైజమని, 2014–19లో కూడా ఆయన అనేక ప్రభుత్వ హాస్పిటళ్లను ప్రైవేటుపరం చేశారన్నారు. చిత్తూరు మెడికల్ కాలేజీని అపోలోకు అప్పగించారని గుర్తుచేశారు. ప్రభుత్వ ఆస్తులను పప్పులు, బెల్లాలకు అమ్మేయాలనుకోవడం సరికాదన్నారు. తాను, తన బినామీలను బాగుపరచాలనే ఉద్దేశ్యంతోనే ఇలా చేస్తున్నారన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వస్తే ప్రైవేటీకరణను రద్దు చేస్తామని, బాబు పాలనలో ప్రభుత్వ రంగంలోని ఎన్నో పరిశ్రమలు మూతపడ్డాయని గుర్తు చేశారు. విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటు పరం చేస్తుంటే చూస్తూ ఊరుకున్నారని విమర్శించారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను అడ్డుకుని తీరుతామని హెచ్చరించారు. సూపర్ ప్లాఫ్ సినిమాకు విజయోత్సవాలు చేసినట్లు కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ సూపర్‌హిట్ అంటూ సభలు నిర్వహిస్తోందని ఎద్దేవా చేశారు. ఈ సమావేశంలో వైఎస్సార్‌సీపీ నాయకులు పులి సునీల్, ఎస్. వెంకటేశ్వర్లు, యానాదయ్య, షేక్ షఫీ, శ్రీరంజన్‌రెడ్డి, వి. నాగేంద్రారెడ్డి, కంచుపాటి బాబు, సాయి, నిరంజన్, తదితరులు పాల్గొన్నారు.