
పాలకవర్గం పట్టు.. కమిషనర్ బెట్టు
● రెండో రోజున కొనసాగిన
కౌన్సిల్ సమావేశం
● చైర్ పర్సన్ ఫిర్యాదుతో
నిర్వహించిన కమిషనర్
ప్రొద్దుటూరు : మున్సిపల్ పాలకవర్గం పట్టుబట్టి భీష్మించగా.. మున్సిపల్ కమిషనర్ రవిచంద్రారెడ్డి తన బెట్టు వదలి రెండో రోజున బుధవారం ఎట్టకేలకు కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించారు. దీంతో సమస్య పరిష్కారమైంది. అత్యవసర కౌన్సిల్ సమావేశాన్ని మంగళవారం సాయంత్రం మున్సిపల్ చైర్‌పర్సన్ భీమునిపల్లి లక్ష్మీదేవి అధ్యక్షతన నిర్వహించారు. అజెండాలోని ఒక అంశం చదివిన తర్వాత గత నెలలో ఎందుకు కౌన్సిల్ సమావేశం నిర్వహించలేకపోయారో కమిషనర్ సమాధానం చెప్పాలని చైర్ పర్సన్ ప్రశ్నించారు. ఫోన్ చేసినా స్పందన లేకపోవడం, వాట్సాప్ మెసేజ్ పెట్టినా పలకకపోవడానికి కారణమేమిటని అడిగారు. ఎక్స్‌అఫిషియో మెంబర్ హోదాలో హాజరైన ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి స్పందించి మీ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన అవసరం కమిషనర్‌కు లేదని, ఆయన క్షమాపణ ఎందుకు చెబుతారు.. ఏమైనా ఉంటే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసుకోండి .. అంటూ అడ్డు చెప్పారు. కమిషనర్ కౌన్సిల్ సభ్యులందరికీ జవాబుదారీగా వ్యవహరించాలని.. గతంలో ఎమ్మెల్యే చెప్పిన విషయాన్ని మున్సిపల్ వైస్‌చైర్మన్ ఆయిల్‌మిల్ ఖాజా ఈ సందర్భంగా గుర్తుచేశారు. బీసీ మహిళా చైర్ పర్సన్ అని చులకనగా చూస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. చైర్ పర్సన్‌కు కమిషనర్ సారీ చెప్పాల్సిందేనని వైఎస్సార్‌సీపీ మహిళా కౌన్సిలర్లు పోడియం వద్ద బైఠాయించారు. దీంతో కొంతమంది టీడీపీ సభ్యులు కమిషనర్‌కు మద్దతుగా బైఠాయించారు. వాగ్వాదాల మధ్య సభ జరుగుతుండగా ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి అర్ధంతరంగా బయటికి వెళ్లిపోయారు.
సమావేశం నుంచి వెళ్లిన కమిషనర్
కౌన్సిల్ సమావేశం జరుగుతుండగానే మున్సిపల్ కమిషనర్ రవిచంద్రారెడ్డి ఎమ్మెల్యే వరదరాజులరెడ్డితోపాటు కిందివైపున ఉన్న తన ఛాంబర్‌కు వెళ్లిపోయారు. సమావేశం వాయిదా వేయకుండా, చైర్ పర్సన్ అనుమతి లేకుండా ఆయన ఎలా వెళ్లిపోతారని చైర్‌పర్సన్, వైస్ చైర్మన్లు ఆయిల్ మిల్ ఖాజా, పాతకోట బంగారుమునిరెడ్డి, వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లు ప్రశ్నించారు. తిరిగి కమిషనర్ సమావేశం జరిపే వరకు ఇక్కడే ఉంటామని హాల్‌లోనే రాత్రంతా గడిపి... అక్కడే భోజనాలు చేసి నిద్రకు ఉపక్రమించారు.
అరెస్టు చేసేందుకు పోలీసుల యత్నం
మున్సిపల్ కౌన్సిల్ హాల్‌లో ఉన్న చైర్‌పర్సన్, వైస్ చైర్మన్లను, కౌన్సిలర్లను అరెస్టు చేసేందుకు రాత్రి పోలీసులు బెదిరింపులకు దిగారు. మంగళవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో పోలీసులు మీరు కౌన్సిల్ హాల్ నుండి వెళ్లిపోకుంటే అరెస్టు చేస్తామని మున్సిపల్ వైస్ చైర్మన్ పాతకోట బంగారు మునిరెడ్డితో అన్నారు. చైర్‌పర్సన్ అనుమతి లేకుండా పోలీసులు కౌన్సిల్ హాల్‌లోకి వచ్చేందుకే వీలులేదని, ఏ చట్ట ప్రకారం తమను అరెస్టు చేస్తారని ప్రశ్నించారు. ఏ చర్యలు తీసుకువాలన్నా చైర్ పర్సన్ అనుమతి తీసుకోవాలని అనడంతో పోలీసులు వెళ్లిపోయారు. బుధవారం ఉదయం చైర్‌పర్సన్ పలుమార్లు అనంతపురంలోని మున్సిపల్ రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ నాగరాజుకు ఫిర్యాదు చేశారు. సమావేశం జరుపుతారా లేదా? అని అడిగారు. చైర్‌పర్సన్ ఫిర్యాదుతో ఆర్డీడీ కమిషనర్ ఆగ్రహంతో కమిషనర్, ఆర్‌ఓ, క్లర్క్‌లను సస్పెండ్ చేస్తామని హెచ్చరించినట్లు విశ్వసనీయ సమాచారం.లార్డీడీ ఆదేశాల మేరకు కమిషనర్ దిగి వచ్చి 20 గంటల తర్వాత మధ్యాహ్నం యథావిధిగా కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించారు. అజెండాలోను అంశాలకు సభ్యులు ఆమోదం తెలిపారు. ఎగ్జిబిషన్ గెజిట్‌ను సవరణ చేయాలని సూచించారు. సమావేశానికి కేవలం వైఎస్సార్‌సీపీ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. ఈ సందర్భంగా వైఎస్ చైర్మన్ ఆయిల్ మిల్ ఖాజా మాట్లాడుతూ సభా సాంప్రదాయం ప్రకారం కౌన్సిల్ సమావేశాలు నిర్వహించుకోవాలని, నిబంధనలను పాటించాలని సూచించారు. పంతాలకు, పట్టింపులకు పోతే నష్టపోయేది అధికారులేనన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ కౌన్సిలర్లు చేపట్టిన నిరసనకు 13వ వార్డు కౌన్సిలర్, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి ఇర్ఫాన్ బాషా మద్దతు తెలిపారు.
పొరపాటు చేసిన కమిషనర్
మంగళవారం కౌన్సిల్ సమావేశం జరుగుతుండగా మధ్యలోనే ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి వెంట వెళ్లిన కమిషనర్ పొరపాటు చేసి ఇరుక్కుపోయారు. ఎందుకు సమావేశం నుంచి మధ్యలో వెళ్లిపోయారని చైర్‌పర్సన్ ఫిర్యాదు చేయగా విధి నిర్వహణ సమయం దాటిపోయిందని (ఆఫీస్ అవర్స్) వెళ్లిపోయినట్లు కమిషనర్ లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు. దీంతో వైఎస్సార్‌సీపీ సభ్యులు బుధవారం ఆఫీస్ అవర్స్ ప్రారంభమయ్యాయని తిరిగి సమావేశం నిర్వహించాలని కోరారు. దీంతో కమిషనర్‌కు సందిగ్ద పరిస్థితి ఏర్పడింది. సభ్యులందరు బ్లాక్ రిబ్బన్లు ధరించి కౌన్సిల్ హాల్‌లో నిరసన వ్యక్తం చేయడంతోపాటు సెల్ఫీ వీడియోల ద్వారా ఆర్డీడీ, కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో మళ్లీ కౌన్సిల్ సమావేశం జరిగింది.