
కొండాపురంలో ఆగిన ఎక్స్‌ప్రెస్ రైళ్లు
కొండాపురం : కొండాపురం రైల్వేస్టేషన్‌లో బుధవారం ఉదయం కన్యాకుమారి ఎక్స్‌ప్రెస్ రైలు ఆగింది. మనోహర్‌బాబు ఆద్వర్యంలో రైలుకు పూజలు నిర్వహించారు. కన్యాకమారి– పూణే మధ్య నడిచే 16381,16382 ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆపాలని కడప ఎంపి వైఎస్ అవినాష్‌రెడ్డి రైల్వే ఉన్నతాధికారులతో మాట్లాడి స్టాపింగ్ చేయించడంతో కొండాపురం ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే జయంతిఎక్స్ ప్రెస్ నిలుపుదలకు కృషి చేసిన కడపఎంపి వైఎస్ అవినాష్‌రెడ్డికి ఎల్లనూరు, కొండాపురం,సింహాద్రిపురం మండల ప్రజలు అభినందనలు తెలిపారు.
12వ పీఆర్సీ కమిషన్‌ను
వెంటనే ప్రకటించాలి
ప్రొద్దుటూరు కల్చరల్ : రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు 12వ పీఆర్సీ కమిషన్‌ను వెంటనే ప్రకటించాలని ఏపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్యాంసుందర్‌రెడ్డి తెలిపారు. మండలంలోని ఉన్నత పాఠశాలల్లో బుధవారం నిర్వహించిన ఏపీటీఎఫ్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. శ్యాంసుందర్‌రెడ్డి మాట్లాడుతూ 2024 నుంచి పెండింగ్‌లో ఉన్న నాలుగు డీఏలను వెంటనే విడుదల చేయాలని, సీపీఎస్ రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని అమలుచేయాలని డిమాండ్ చేశారు. 2003 డీఎస్సీ వారికి మెమో 57 ప్రకారం పాత పెన్షన్ విధానం వర్తింపచేయాలన్నారు. 12వ పీఆర్సీ కమిషన్‌ను వెంటనే నియమించాలని, 30 శాతం ఐఆర్ ప్రకటించాలని కోరారు. ఈ నెల 11వ తేదీ నుంచి 17వ తేదీ వరకు ఏపీటీఎఫ్ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలను చేపడుతోందన్నారు. 11న నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరు, 12న మండల కేంద్రాల్లో నిరసన, 13, 14న ప్రజాప్రతినిధులకు వినతిపత్రాల సమర్పణ, 15న పాత తాలూకా కేంద్రాల్లో నిరసన, 16న జిల్లా కేంద్రాల్లో నిరసన, 17న సీఎంకు మెయిల్స్ ద్వారా విజ్ఞాపనలు చేయనున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో ఏపీటీఎఫ్ నాయకులు శ్రీనివాసరెడ్డి, కృష్ణారెడ్డి, సుబ్బారెడ్డి, సయ్యద్ బాషా, వెంకటేశ్వర్లు, ఖాజాపీరా, వరప్రసాద్ రెడ్డి, అబ్దుల్ ఫయాజ్ తదితరులు పాల్గొన్నారు.
పట్టపగలే నగల చోరీ
బద్వేలు అర్బన్ : ఇంటికి తాళం వేసి బయటికి వెళ్లాలంటే పట్టణ వాసులు భయపడిపోతున్నారు. అలా తాళం పడిందో లేదో.. ఇలా దొంగలు చొరబడి ఉన్నదంతా దోచేస్తున్నారు. రాత్రి పూట కాకుండా పట్టపగలే చోరీలకు పాల్పడుతూ రెచ్చిపోతున్నారు. పట్టణంలోని వెంకటయ్యనగర్‌లో బుధవారం మధ్యాహ్నం తాళం వేసిన ఓ ఇంటిలో దొంగలు చొరబడి 12.50 తులాల బంగారు నగలు, 100 గ్రాముల వెండి ఆభరణాలు దోచుకెళ్లారు. వివరాల్లోకి వెళితే.. పట్టణంలోని వెంకటయ్యనగర్‌లో సునీత, శ్రీనివాసులు దంపతులు నివశిస్తున్నారు. శ్రీనివాసులు ఉదయమే బయటికి వెళ్లగా, మధ్యాహ్నం సమయంలో సునీత పక్కవీధిలోని తండ్రి ఇంటికి వెళ్లింది. ఇదే అదునుగా భావించిన దొంగలు ఇంటి తాళం పగులకొట్టి లోపలికి చొరబడ్డారు. బీరువా తలుపులు పగులకొట్టి లాకరులో దాచిన 12.50 తులాల బంగారు నగలు, వంద గ్రాముల వెండి ఆభరణాలు అపహరించుకువెళ్లారు. గంట తర్వాత ఇంటికి వచ్చిన సునీత చోరీ జరిగినట్లు నిర్ధారించుకుని అర్బన్ పోలీసులకు సమాచారం అందించారు. సీఐ లింగప్ప ఘటనా స్థలాన్ని పరిశీలించి బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. వేలిముద్రలు సేకరించారు.

కొండాపురంలో ఆగిన ఎక్స్‌ప్రెస్ రైళ్లు

కొండాపురంలో ఆగిన ఎక్స్‌ప్రెస్ రైళ్లు