
ఆదివాసుల హక్కుల కోసం స్టాన్‌స్వామి పోరాటం
ప్రొద్దుటూరు కల్చరల్ : ఆదివాసుల హక్కుల కోసం ఫాదర్ స్టాన్‌స్వామి తన జీవితాంతం పోరాటం చేశారని జన విజ్ఞాన వేదిక జిల్లా యూత్ కన్వీనర్ హేమంత్ కుమార్ తెలిపారు. స్థానిక జేవీవీ కార్యాలయంలో మానవ హక్కుల కార్యకర్త ఫాదర్ స్టాన్ స్వామి జైలులో రాసిన ‘మౌన ప్రేక్షకుణ్ణి కాను’ పుస్తక పరిచయ సభ బుధవారం నిర్వహించారు. కవి మహమూద్ అధ్యక్షతన జరిగిన ఈ సందర్భంగా హేమంత్‌కుమార్ మాట్లాడుతూ ఆదివాసుల గ్రామసభ అనుమతి లేనిదే ఎవరు భూములు కొనడానికి వీలులేదని అన్నారు. అటవీ హక్కుల చట్టాన్ని గత ప్రభుత్వాలు తుంగలో తొక్కాయన్నారు. కనీస వసతులు కల్పించకుండా జైలులో ఆయన చనిపోవడానికి కారణమయ్యారన్నారు. మిత్రజ్యోతి సాహితీ సంస్థ కన్వీనర్ మహమూద్ మాట్లాడుతూ ప్రస్తుత సామాజిక స్థితికి పుస్తకం అద్దం పడుతుందని, హక్కుల కోసం గొంతెత్తితే ఎటువంటి వారైనా కఠిన పరిస్థితులను ఎదుర్కోవాల్సిందేనని చెబుతోందని అన్నారు. విరసం కార్యవర్గ సభ్యురాలు వరలక్ష్మి మాట్లాడుతూ ఈ పుస్తకం భీమా కొరేగాం అక్రమ కేసులో నిబంధించబడిన బుద్ధి జీవుల గొంతుక అని చెప్పారు. మధ్య భారతంలో కగార్ పేరుతో సహజ వనరులను తవ్వి తీయడానికి ఆదివాసులపై నరమేధం చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో జేవీవీ రాష్ట్ర నాయకుడు తవ్వాసురేష్, రచయితలు దాదాహయత్, కుప్పిరెడ్డి పద్మనాభరెడ్డి, జింకా సుబ్రహ్మణ్యం, చైతన్య మహిళా సంఘం పద్మ, గోపీనాథ్‌రెడ్డి, సీపీఐ పట్టణ కార్యదర్శి సుబ్బరాయుడు, ఇన్నర్‌వీల్ భారతి, దేవానంద్, కొత్తపల్లి శ్రీను, పౌరహక్కుల సంఘం సురేష్, ప్రొఫెసర్ షఫీవుల్లా, హైమ, రాకేష్, బాల నరసింహులు తదితరులు పాల్గొన్నారు.