
ఎమర్జెన్సీలో కూడా ఇలా లేదు..
నేను ఎమర్జెన్సీ రోజులను ప్రత్యక్షంగా చూసిన అనుభవంతో చెబుతున్నాను. ఆరోజుల్లో పత్రికలపై సెన్సార్‌షిప్ మాత్రమే ఉండేది. ఇప్పటిలాగా సాక్షి పత్రికా కార్యాలయాలు, పాత్రికేయులపై ప్రత్యక్ష దాడులకు పా ల్పడటం, కేసులు నమోదు చేయడం వంటివి చూడలేదు. వ్యక్తులు లేదా ప్రభుత్వంపై ఏవైనా వ్యతిరేక వార్తలు వచ్చిన సందర్భాల్లో వాటిని ఖండించాలి. నిజానిజాలేవో తెలియజేస్తూ ప్రకటనలు ఇవ్వాలి. ఒకవేళ పత్రికా యాజమాన్యం స్పందించకపోతే చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఇలాంటి పద్ధతులను పక్కకు నెట్టి దాడులు, ‘సాక్షి’ ఎడిటర్‌పై కేసులు నమోదు చేయడం అంటే అది పూర్తిగా అప్రజాస్వామికమవుతుంది. ఇలాంటి ధోరణులను ప్రజాస్వామిక వాదులు ముక్తకంఠంతో ఖండించాలి.
– సీహెచ్ చంద్రశేఖర్‌రెడ్డి, అధ్యక్షుడు,
రాయలసీమ కార్మిక కర్షక సమితి, కడప
రాష్ట్ర ప్రభుత్వం కక్షసాధింపు ధోరణితో ‘సాక్షి’ ఎడిటర్ ధనుంజయరెడ్డిపై అక్రమ కేసులు బనాయించడం పత్రికా స్వేచ్ఛపై జరుగుతున్న దాడిగానే పరిణించాల్సి ఉంటుంది. ఓ నాయకుడు ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన విషయాలను వార్తగా ప్రచురిస్తే కేసు నమోదు చేయడం గతంలో ఎన్నడూ చూడలేదు. డీఎస్పీల పదోన్నతుల్లో లంచాలు చోటుచేసుకున్నాయనే కథనంపై ‘సాక్షి’ ఎడిటర్ ధనుంజయరెడ్డిపై వరుస కేసులు నమోదు చేయడం పత్రికా స్వేచ్ఛను కోరుకునే వారంతా తీవ్రంగా ఖండించాల్సిన విషయం. ఒకవేళ ‘సాక్షి’లో తప్పుడు కథనాలు ప్రచురితమయ్యాయని భావిస్తే వివరణ ఇవ్వాలి. నిజాలేవో వెల్లడించాలి. అంతేగానీ కేసులు, దాడులకు దిగడం రాజ్యాంగ హక్కులను కాలరాయడమే అవుతుంది.
– పి.రామసుబ్బారెడ్డి, రాష్ట్ర నాయకుడు,
ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్
రోజురోజుకూ రాష్ట్రంలో పత్రికలపై దాడు లు పెచ్చరిల్లిపోతున్నాయి. రాష్ట్ర ప్రభు త్వ వైఫల్యాలు, అవినీతి వంటి అంశాలను వెలుగులోకి తీసుకు వస్తున్న ‘సాక్షి’పై ప్రభుత్వం కక్షగట్టి దాడులు చేయిస్తోంది. ఓ ప్రెస్‌కాన్ఫరెన్స్ వార్తను రాసినందుకు ఎడిటర్‌కు నోటీసులు ఇవ్వడం చూస్తుంటే, రాష్ట్రంలో పత్రికా స్వేచ్ఛ ఎలా ఉందో అర్థమవుతుంది. ‘సాక్షి’లో వచ్చిన వార్తలకు ఖండన లేదా వివరణ లాంటివి ఇవ్వకుండా ఎడిటర్‌పై కేసులు నమోదు చేసి భయభ్రాంతులకు గురిచేయాలనుకోవడం తగదు. పత్రికా స్వేచ్ఛపై జరుగుతున్న దాడులను చూస్తుంటే రాష్ట్రంలో ప్రజాస్వామిక పాలన ఉన్నట్లు కనిపించడం లేదు. ఇలాంటి ప్రభుత్వ ధోరణులను ప్రతి ఒక్కరూ ఖండించడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి.
– సి.వెంకటరెడ్డి,
రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు, ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్

ఎమర్జెన్సీలో కూడా ఇలా లేదు..

ఎమర్జెన్సీలో కూడా ఇలా లేదు..

ఎమర్జెన్సీలో కూడా ఇలా లేదు..