
ఎనిమిది తరగతులు..ముగ్గురు ఉపాధ్యాయులు
బద్వేలు : మండల పరిధిలోని చింతలచెరువు గ్రామ ప్రాథమికోన్నత పాఠశాలలో 1 నుండి 8 వరకు తరగతులు ఉన్నాయి. అందులో ఒకటి నుంచి ఐదవ తరగతి వరకూ 20 మంది విద్యార్థులు ఉండగా 6,7,8 తరగతుల్లో 18 మంది విద్యార్థులు ఉన్నారు. ఆరు నుంచి ఎనిమిదవ తరగతి వరకు సబ్జెక్ట్‌ల వారీగా ఆరుగురు ఉపాధ్యాయులు ఉండాల్సి ఉంది. కానీ ఇక్కడ ముగ్గురు ఉపాధ్యాయులు మాత్రమే ఒకటి నుంచి ఎనిమిదవ తరగతి వరకు బోధిస్తున్నారు.
మూడు పాఠ్యాంశాల బోధన ఒకరిచేతే..
ఇటీవల విద్యాశాఖలో జరిగిన బదిలీల్లో చింతలచెరువు పాఠశాలకు ఇద్దరు మాత్రమే స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయులు వచ్చారు. వారిలో ఒకరు ఇంగ్లీషు టీచర్ కాగా మరొకరు గణితశాస్త్రం ఉపాధ్యాయురాలు. గణితం ఉపాధ్యాయురాలు గణితం, జీవశాస్త్రం, భౌతికశాస్త్రం బోధిస్తుండగా ఇంగ్లీషు ఉపాధ్యాయుడు ఇంగ్లీషు, సాంఘీక శాస్త్రం పాఠ్యాంశాలు బోధిస్తున్నారు. తెలుగు, హిందీ పాఠ్యాంశాలు బోధించే ఉపాధ్యాయుల నియామకం జరగలేదు. దీంతో 6,7,8 తరగతుల విద్యార్థులకు ఆ రెండు భాషలను బోధించే ఉపాధ్యాయలు కరువయ్యారు. దీనిపై పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జాన్‌వెస్లీ మాట్లాడుతూ కనీసం డిప్యుటేషన్‌పై అయినా ఉపాధ్యాయులను నియమిస్తే విద్యార్థులకు ఇబ్బంది లేకుండా ఉంటుందన్నారు. కాగా ఎంఈఓ–1 చెన్నయ్య మాట్లాడుతూ పాఠశాలలో ఉన్న విద్యార్థుల సంఖ్యను బట్టి ఉపాధ్యాయుల నియామకం జరిగిందన్నారు. సబ్జెక్టుల వారీగా నియమించలేదన్నారు. ప్రభుత్వం నిబంధనల మేరకే ఉపాధ్యాయులను కేటాయించిందని స్పష్టం చేశారు.
విద్యాశాఖలో వింత పోకడలు
ఉపాధ్యాయుల కొరతతో విద్యార్థులకు ఇక్కట్లు