
ఇద్దరు ఎర్రచందనం దొంగల అరెస్ట్
చాపాడు : మైదుకూరు – ప్రొద్దుటూరు జాతీయ రహదారిలోని నాగులపల్లె సమీపంలో బుధవారం ఎర్రచందనం దుంగలను అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు దొంగలను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 14 దుంగలు, కారును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఐ చిన్న పెద్దయ్య తెలిపారు. ప్రొద్దుటూరు మండలంలోని మీనాపురం వద్ద గల జగనన్న కాలనీలో నిల్వ ఉంచిన 14 ఎర్రచందనం దుంగలను ఏపీ07సీఏ9939 నెంబరు గల వోక్స్ వ్యాగన్ కారులో మైదుకూరు వైపు తరలిస్తున్నారు. తమకు అందిన సమాచారం మేరకు రూరల్ సీఐ శివశంకర్ ఆదేశాలతో మండలంలోని నాగులపల్లె వద్ద గల పెట్రోల్ బంక్ సమీపంలో వాహన తనిఖీ చేపట్టారు. ఈ తనిఖీలో ఎర్రచందనం దుంగలను తరలిస్తున్న కారు వేగంగా వస్తుండగా సిబ్బంది అడ్డుకోబోగా వారిపై దూసుకెళ్లి తప్పించుకుని వెళ్తుండగా చాకచక్యంగా కారును పట్టుకున్నారు. పట్టుబడిన కారు నుంచి ముగ్గురు దొంగలు పారిపోగా, ప్రొద్దుటూరు మండలం ఖాదర్‌బాద్‌కు చెందిన బోయ కుమార్, బోయ కిషోర్ అనే వ్యక్తులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 14 ఎర్రచందనం దుంగలు, కారును స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన దుంగలు 281 కేజీలు ఉండగా వీటి విలువ అధికారికంగా రూ.1.50లక్షలు ఉంటుంది. అనధికారికంగా రూ.15లక్షలు ఉంటుంది. ఈ ఘటనపై కేసు నమోదు దర్యాప్తు చేసి పారిపోయిన మరో ముగ్గురు దొంగలను త్వరలోనే పట్టుకుంటామని ఎస్‌ఐ చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏఎస్‌ఐలు బాషా, నాగేంద్రప్రసాద్ ఎఫ్‌బీఓ హరినాథరాజు, కానిస్టేబుళ్లు మధు, అభిరాం, బ్రహ్మేంద్ర తదితరులు పాల్గొన్నారు.
14 దుంగలు, కారు స్వాధీనం
పరారీలో మరో ముగ్గురు, ఎర్రచందనం విలువ రూ.1.50 లక్షలు