
మీడియాకు ప్రశ్నించే హక్కులేదు..!
తొండూరు : మీడియాకు ప్రశ్నించే హక్కే లేదంటూ గురువారం జరిగిన మండల సమావేశంలో విలేకరులపై ఎంపీడీఓ విష్ణుప్రసాద్ చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా దుమారం రేపుతున్నాయి. తొండూరు ఎంపీడీఓ కార్యాలయ సభా భవనంలో ఎంపీడీఓ విష్ణుప్రసాద్ అధ్యక్షతన గురువారం మండల సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 15వ ఆర్థిక సంఘం నిధుల దుర్వినియోగంపై అధికారులు, ప్రజాప్రతినిధులు చర్చిస్తుండగా.. దీనిపై విలేకరులు నిధుల వినియోగంపై స్పష్టతను కోరారు. దీనిపై ఎంపీడీఓ విలేకరులపై ఒక్కసారిగా మీకు ప్రశ్నించే హక్కు లేదు, కేవలం సమాచారం అడగడమే మీ పని అంటూ విలేకరులపై అసభ్య వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. విలేకరులు హద్దుమీరి ప్రవర్తిస్తే వాళ్ల మీద కేసులు పెట్టండి నేను చూసుకుంటానని జిల్లా కలెక్టర్ చెప్పారని ఎంపీడీఓ తెలిపారు. ఒక అధికారిపై అక్రమాల ఆరోపణలుంటే మీడియా ప్రశ్నించడం తప్పుకాదని, దానిపై అసభ్యంగా స్పందించడమే చట్ట వ్యతిరేకమని స్థానిక విలేకరులు అంటున్నారు. కలెక్టర్ స్పందించి ఎంపీడీఓ విష్ణుప్రసాద్‌పై చర్యలు తీసుకోవాలని స్థానిక పాత్రికేయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.