
బాలిక హత్య కేసులో పదేళ్ల జైలు శిక్ష
కడప అర్బన్ : కడప నగరం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో మూడేళ్ల బాలికను హత్య చేసిన కేసులో నిందితుడికి పదేళ్లు జైలు శిక్షతోపాటు 1000 రూపాయలు జరిమానా విధిస్తూ నాలుగో అదనపు జిల్లా కోర్టు, ఎస్సీ ఎస్టీ సెల్ జడ్జి మంగళవారం తీర్పునిచ్చారు. కర్నూలుకు చెందిన కత్తెర విశ్వనాథం కూలి పనుల కోసం కడప ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో అద్దె ఇల్లు తీసుకొని నివాసం ఉంటున్నాడు. విశ్వనాథం బంధువు సుజాత కూడా అక్కడే ఉండేది. సుజాత కుమార్తె శ్రీలత (3) రాత్రి సమయంలో నిద్రకు భంగం కలిగిస్తుందన్న ఉద్దేశంతో ఆ బాలికను దారుణంగా హత్య చేశాడు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు చిన్న చౌక్ పోలీస్ స్టేషన్‌లో 2017 ఫిబ్రవరి నెలలో కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి వాదో పవాదాలు విన్న జడ్జి నేరం రుజువు కావడంతో విశ్వనాథంకు పదేళ్లు జైలు శిక్షతోపాటు రూ.1000 జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు.