
వివాహేతర సంబంధంతోనే మహిళ హత్య
చాపాడు : వివాహేతర సంబంధాలు పెట్టుకుందనే కారణంతో మండల పరిధిలోని చియ్యపాడు గ్రామంలో ఈ నెల 17న నల్లబోతుల సుజాత (37) అనే వివాహితను ఆమె భర్త గోపాల్ హత్య చేసినట్లు మైదుకూరు రూరల్ సీఐ శివశంకర్ తెలిపారు. ఈ హత్య కేసులో భర్త గోపాల్‌ను మంగళవారం అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచారు. మంగళవారం రూరల్ సీఐ వివరాలను వెల్లడించారు. 20 ఏళ్ల క్రితం గోపాల్ చియ్యపాడు గ్రామంలోనే ఉన్న తన అక్క గుజ్జల పార్వతమ్మ పెద్ద కూతురు సుజాతను వివాహం చేసుకున్నాడు. పదేళ్ల పాటు అన్యోన్యంగా జీవిస్తున్న వీరి మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. గత కొన్నేళ్ల క్రితం నుంచి తన భార్య సుజాత ఇతరులతో వివాహేతర సంబంధాలు పెట్టుకుందనే అనుమానంతో గోపాల్ తరచూ గొడవ పడుతుండేవాడు. ఈ క్రమంలో ఈ నెల 17న రాత్రి 11.30 గంటల ప్రాంతంలో భార్యతో గొడవపడ్డ గోపాల్ టవల్‌తో తన భార్య గొంతుకు బిగించి ఊపిరాడకుండా చేసి హత్య చేశాడు. మృతదేహాన్ని గోనె సంచిలో కట్టుకుని తనకున్న ఏపీ04ఏఏ4288 నెంబరు గల స్కార్పియో కారులో తీసుకెళ్లి మైదుకూరు మండలం పోరుమామిళ్ల రహదారిలోని ముదిరెడ్డిపల్లె సమీపంలో ఎద్దడుగు కనుమ అటవీ ప్రాంతంలోని మట్టి కాలువలో పడేశాడు. ఇంట్లో, గ్రామంలో సుజాత కనిపించకపోవడంతో తన తల్లి గుజ్జల పార్వతమ్మ తన అల్లుడు గోపాల్‌పై అనుమానంతో గాలించింది. అతను పరారీలో ఉండంతో ఈ నెల 19న చాపాడు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు దర్యాప్తు చేపట్టగా గోపాల్ తన భార్యను హత్య చేసినట్లు తేలిందన్నారు. ఈ క్రమంలో మంగళవారం మధ్యాహ్నం కుందూనది సమీపంలోని చియ్యపాడు క్రాస్ రోడ్డు వద్ద వాహన తనిఖీ చేస్తుండగా నిందితుడైన గోపాల్ తన స్కార్పియో వాహనంలో పారిపోతుండగా పోలీసు సిబ్బంది వెంబడించి పట్టుకున్నారు. నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచినట్లు రూరల్ సీఐ తెలిపారు.
వివరాలు వెల్లడించిన
మైదుకూరు రూరల్ సీఐ శివశంకర్