
జేబీ ఆసుపత్రిలో ట్యూమర్ ప్రాసెస్ సర్జరీ విజయవంతం
కడప రూరల్ : కడప నగరంలోని జేబీ ఆసుపత్రిలో ట్యూమర్ ప్రాసెస్ సర్జరీని విజయవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదివారం ఆసుపత్రిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో డాక్టర్ జహంగీర్‌బాషా వివరాలను వెల్లడించారు. చాగలమర్రికి చెందిన వృద్ధురాలు మహబూబ్‌చాన్ మోకాలి ఆపరేషన్ చేయించుకొని, చీము పట్టి నడవలేని స్థితిలో ఉండేవారని పేర్కొన్నారు. ఆమె జేబీ ఆసుపత్రికి రావడంతో వైద్య పరీక్షలు నిర్వహించామన్నారు. ఈ పరీక్షల్లో ఎముక పూర్తిగా పాడైపోయినట్లు ధృవీకరించామని తెలిపారు. ఆమె 120 కేజీల బరువు ఉండడం చేత సర్జరీ చేయడం కష్టంగా మారిందన్నారు. పూర్తిగా చెడిపోయిన 25 సెంటీ మీటర్ల ఎముకను తొలగించి, దాని స్థానంలో ఇంప్లాంట్‌ను అమర్చామని తెలిపారు. హైదరాబాద్ నుంచి ట్యూమర్ ప్రాసెస్ తెప్పించి సర్జరీని విజయవంతంగా నిర్వహించడంతో పాటు పేషెంట్‌ను మరుసటి రోజే నడిపించామన్నారు. ఇలాంటి ఆపరేషన్లు చాలా అరుదుగా జరుగుతుంటాయని పేర్కొన్నారు. ఆసుపత్రి ఎండీ డాక్టర్ జయభారతి మాట్లాడుతూ తమ ఆసుపత్రిలో లభించే అధునాతన వైద్య సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పేషెంట్ మహబూబ్‌చాన్ మాట్లాడుతూ సర్జరీ తరువాత ఆరోగ్యంగా ఉన్నానని, అందరిలా నడవగలుగుతున్నానని తెలిపారు.