
నేడు మాజీ సైనిక సంక్షేమ సంఘం సమావేశం
కడప అర్బన్ : కడప నగరంలోని సీఎస్‌ఐ హైస్కూల్‌లో ఆదివారం ఉదయం 9:30 గంటల నుంచి కడప, అన్నమయ్య ఉమ్మడి జిల్లాల మాజీ సైనిక సంక్షేమ ఉద్యోగుల సంఘం సర్వ సభ్య సమావేశం నిర్వహించనున్నట్లు అధ్యక్షుడు దాసరి రమణయ్య, ప్రధాన కార్యదర్శి కెప్టెన్ ఎస్.ఎస్ రాముడు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. కడప, అన్నమయ్య ఉమ్మడి జిల్లాల సైనిక సంక్షేమ సంఘం నేతలు, మాజీ సైనిక ఉద్యోగులు తమ సంక్షేమం, ఇళ్ల స్థలాల కోసం పత్రాలు తీసుకుని రావాలని వారు పేర్కొన్నారు. భూ, స్థలాల సమస్యలపై చర్చించడం జరుగుతుందని వివరించారు.
వైఎస్సార్‌సీపీ బీసీ సెల్‌లో నియామకాలు
కడప కార్పొరేషన్ : వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఆ పార్టీ రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శులుగా వైఎస్సార్, అన్నమయ్య జిల్లాలకు చెందిన వారిని నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. పులివెందులకు చెందిన వడ్డెరపు గంగాధర్ యాదవ్, రాయచోటికి చెందిన రమేష్ అంపాబత్తినలను నియమించారు. అలాగే అన్నమయ్య జిల్లా పీలేరు మండల పంచాయతీరాజ్ విభాగం అధ్యక్షుడిగా అంబవరం మల్లికార్జునరెడ్డిని నియమించారు.
నేటి నుంచి
ఏసీఏ మల్టీ డే మ్యాచ్‌లు
కడప వైఎస్‌ఆర్ సర్కిల్ : కడపలో ఆదివారం నుంచి ఈ నెల 31 వరకు ఏసీఏ సౌత్‌జోన్ అండర్–16 మెన్ మల్టీ డే మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ మ్యాచ్‌లో కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం, నెల్లూరు జట్లు పాల్గొంటున్నాయి. కేఎఆర్‌ఎం, కేవోఆర్‌ఎం క్రికెట్ మైదానంలో ఈ మ్యాచ్‌లు జరుగుతాయి.
మూఢ నమ్మకాల తొలగింపే ధ్యేయం
కడప ఎడ్యుకేషన్ : సమాజంలో మూఢ నమ్మకాలను తొలగించడమే జన విజ్ఞాన వేదిక లక్ష్యమని జేవీవీ వ్యవస్థాపకుడు బ్రహ్మారెడ్డి పేర్కొన్నారు. శనివారం కడప నగరంలోని యస్.వి.ఇంజినీరింగ్ కాలేజీలో జెవీవీ రాష్ట్ర అధ్యక్షుడు సురేష్‌కుమార్ అధ్యక్షతన రాష్ట్ర మహాసభలను నిర్వహించారు. ముందుగా జాతీయ పతాకం, జన విజ్ఞాన వేదిక పతాకాల ఆవిష్కరణతోపాటు గీతాలాపనతో ప్రారంభించారు. అనంతరం బ్రహ్మారెడ్డి మాట్లాడుతూ జేవీవీ ప్రజల ఆరోగ్యం, విద్యకు సంబంధించి ప్రధానంగా కృషి చేస్తుందన్నారు. మాజీ ఎమ్మెల్సీ గేయానంద్ మాట్లాడుతూ ప్రజలను చైతన్యవంతులను చేయడం, అన్ని రంగాల్లో సంతులిత అభివృద్ధిని సాధించే విధంగా ఉత్సాహపరచడంలో జేవీవీ తన వంతు పాత్ర పోషిస్తుందన్నారు. కార్యక్రమంలో జమ్మలమడుగు నియోజకవర్గం తెలుగుదేశం ఇన్‌చార్జి భూపేశ్ రెడ్డియోగి వేమన యూనివర్సిటీ రిజిస్ట్రార్ పుత్తా పద్మజ కడప మున్సిపల్ కార్పొరేషన్ అదనపు కమిషనర్ కె.రాకేష్ చంద్ర, జేవీవీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోపాల్ నాయక్, జాతీయ నాయకులు బి.విశ్వనాథ, కృష్ణాజీ, శ్రీనివాసులు, సనావుల్లా, మహమ్మద్ మియా, యస్.స్వరాజ్యలక్ష్మి, వెంకటరామిరెడ్డి మాట్లాడారు. ఈ రాష్ట్ర మహాసభలకు ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని జిల్లాలు, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి జేవీవీ ప్రతినిధులు హాజరయ్యారు.