వేంపల్లె ఘటనలో 150 మందికి పైగా కేసులు | - | Sakshi
Sakshi News home page

వేంపల్లె ఘటనలో 150 మందికి పైగా కేసులు

Jul 11 2025 6:07 AM | Updated on Jul 11 2025 6:07 AM

వేంపల్లె ఘటనలో 150 మందికి పైగా కేసులు

వేంపల్లె ఘటనలో 150 మందికి పైగా కేసులు

వేంపల్లె : వేంపల్లె ఘటనలో 150 మందికి పైగా కేసులు నమోదు చేసినట్లు పులివెందుల డీఎస్పీ మురళీ నాయక్‌ తెలిపారు. కానిస్టేబుల్‌ బి.రామాంజనేయులు ఫిర్యాదు మేరకు.. ఎస్పీ అశోక్‌ కుమార్‌ ఆదేశాలతో కేసు నమోదు చేసినట్లు చెప్పారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో గురువారం డీఎస్పీ మీడియాతో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘వేంపల్లెలోని పక్కీర్‌పల్లెకు చెందిన మైనర్‌ బాలిక అదృశ్యంపై పోలీస్‌స్టేషన్‌పై దాడి చేసిన ఘటనలో 150 మందికి పైగా కేసులు నమోదు అయ్యాయి. ఈ నెల 7వ తేదీన సాయంత్రం 7 గంటల సమయంలో పోలీస్‌ స్టేషన్‌లో సెంట్రీగా రామాంజనేయులరెడ్డి విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ క్రమంలో వేంపల్లె పంచాయతీ పరిధిలోని పక్కిర్‌పల్లెకు చెందిన సయ్యద్‌ సుమియా, చింతలమడుగుపల్లెకు చెందిన మడకబాబులు ప్రేమించుకున్నారని, వారిని మధ్యాహ్న సమయంలో ముచ్చుకోన దగ్గర ఉన్న వజ్రాల గుట్టలో ఉండగా.. సుమియా తల్లిదండ్రులు చూసి మడక బాబుపై చర్యలు తీసుకుని, న్యాయం చేయాలని పోలీసు స్టేషన్‌ వద్దకు వచ్చారు. ఈ నేపథ్యంలో మడక బాబుతోపాటు వల్లెపు గంగాధర్‌, విజయ్‌ కుమార్‌లను అదుపులోకి తీసుకొని విచారణ చేస్తుండగా ముస్లిం వర్గానికి చెందిన పక్కీర్‌ పల్లెకు చెందిన సయ్యద్‌ మహమ్మద్‌ మూసా, రాజీవ్‌ నగర్‌ కాలనీకి చెందిన మస్తాన్‌, వేంపల్లెకు చెందిన మాజీ జెడ్పీటీసీ షబ్బీర్‌, బిడ్డాలమిట్టకు చెందిన అబ్దుల్‌, ఇబ్రహీం, హైదర్‌ వలి (లాడెన్‌), మదీనాపురానికి చెందిన గుజిరి దర్బార్‌, అక్బర్‌, ఇబ్రహీం, సమీర్‌, ఈసుబ్‌, కోహీనూర్‌ నజీర్‌లతోపాటు దాదాపు 150 మందికి పైగా మూకుమ్మడిగా పోలీస్‌ స్టేషన్‌ అవరణలోకి వచ్చి మడక బాబుపై వెంటనే చర్యలు తీసుకోవాలని గొడవకు దిగారు. నిందితులను విచారణ చేస్తున్నామని పోలీసులు ఎంత చెప్పినా వినకుండా పోలీసులు డౌన్‌ డౌన్‌ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ.. పోలీసులనే హత మార్చాలనే ఉద్దేశంతో రాళ్లు విసరగా హెడ్‌ కానిస్టేబుల్‌ సాయిబాబా, కానిస్టేబుల్‌ కిరణ్‌ కుమార్‌, మహమ్మద్‌ ఆలీ, నజీర్‌ అహమ్మద్‌ తప్పించుకున్నారు. పోలీస్‌స్టేషన్‌ ముట్టడిదారులు అంతటితో ఆగకుండా రాళ్లు తీసుకుని పోలీస్‌ స్టేషన్‌ కిటికీ అద్దాలు, వరండాలోని ఇనుప కుర్చీ, వెనుక వైపు ఉన్న డోరును ధ్వంసం చేసి ప్రభుత్వ ఆస్తి నష్ట పరిచారు. అంతే కాకుండా పోలీసు యూనిఫాంలో ఉన్న వారికి విధులకు ఆటంకం పరిచినట్లు ఫిర్యాదులో తెలిపారు. ఎస్పీ ఆదేశాల మేరకు నాన్‌ బెయిలబుల్‌ కేసు నమోదు చేసినట్లు’ డీఎస్పీ వివరించారు.

పోలీసుల అదుపులో 40 మంది?

వేంపల్లె : వేంపల్లె పోలీస్‌స్టేషన్‌ ముట్టడి కేసులో 200 నుంచి 300 మందిని అరెస్టు చేసే అవకాశం ఉందని సమాచారం. ఇప్పటికే పోలీస్‌ స్టేషన్‌ను ముట్టడి చేసిన కేసులో 40 మందిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. పోలీస్‌ స్టేషన్‌పై దాడి చేసిన వారిని అదుపులోకి తీసుకోవాలనే ఉద్దేశంతో నాలుగు బృందాలుగా పోలీసులు ఏర్పడి వేంపల్లెలో జల్లెడ పట్టడం జరుగుతోంది. గురువారం వేంపల్లెలో ఉన్న 40 మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని ఇతర ప్రాంతాల పోలీస్‌స్టేషన్లకు తరలించినట్లు సమాచారం. వేంపల్లెలోని ఆయా ప్రాంతాల్లో పోలీసులు గాలింపు చర్యలు తీసుకోవడంతో.. పోలీస్‌ స్టేషన్‌ వద్దకు వచ్చిన చాలా మంది వేంపల్లెను విడిచి పెట్టి ఇతర ప్రాంతాలకు వెళ్లిపోవడం జరిగింది. పోలీస్‌ స్టేషన్‌పై దాడి చేసిన వారితోపాటు సంఘటనను చూసేందుకు వచ్చిన వారు కూడా తమను ఎక్కడ అరెస్టు చేస్తారోనని భయంతో ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారు. డీఎస్పీ వేంపల్లెలో మకాం వేసి ముట్టడిదారుల అరెస్టుపై ఆరా తీస్తున్నారు. బాలిక తండ్రి మాబువలి ఫిర్యాదు మేరకు మడక బాబుపై అత్యాచార కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ తెలిపారు.

పోలీస్‌స్టేషన్‌పై దాడి చేశారని

కానిస్టేబుల్‌ ఫిర్యాదు

ఎస్పీ ఆదేశాల మేరకు నమోదు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement