
గ్రామీణ విద్యార్థులకు బంగారు భవిత
వేంపల్లె: గ్రామీణ పేదవర్గాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులకు అంతర్జాతీయస్థాయి ఇంజినీరింగ్ విద్యను అందించేందుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆలోచనలకు రూపమే ట్రిపుల్ ఐటీలు. వీటిని ఆర్జేయూకేటీ నిర్వహిస్తోంది. ఇడుపులపాయ ఆర్కే వ్యాలీ ట్రిపుల్ ఐటీలో 2025– 26 విద్యా సంవత్సరానికి సంబంధించి అడ్మిషన్ల ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభం కానుంది. తెలిపారు. ఉదయం 9 గంటలకు క్యాంపస్‌లోని సెంట్రల్ లైబ్రరీలో కౌన్సెలింగ్ ప్రక్రియ జరుగుతుందన్నారు. ఈనెల 23న రాష్ట్రంలోని నాలుగు ట్రిపుల్ ఐటీలు నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలకు సంబంధించి అధికారులు ఎంపిక జాబితా విడుదల చేశారు. ఇడుపులపాయ ఆర్కే వ్యాలీ ట్రిపుల్ ఐటీకి సంబంధించి ఈనెల 30 వ తేదీ, జులై 1వ తేదీలలో ఎంపికై న విద్యార్థులకు కౌన్సెలింగ్ పక్రియ ఉంటుంది. ఈ పక్రియకు కావలసిన అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేసినట్లు డైరెక్టర్ ఏవీఎస్ కుమార స్వామిగుప్తా తెలిపారు.
రెండు రోజుల్లో 1,060 మందికి కౌన్సెలింగ్
ఇడుపులపాయ ఆర్కే వ్యాలీ ట్రిపుల్ ఐటీలో ప్రథమ సంవత్సరంలో ప్రవేశం కోసం నిర్వహిస్తున్న కౌన్సెలింగ్‌లో భాగంగా రెండు రోజుల్లో ప్రత్యేక కేటగిరీ మినహా 1060మందికి కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. 30వ తేదీ (సోమవారం) 530 మంది అభ్యర్థులకు, జూలై 1వ తేదీన 530 మంది అభ్యర్థులకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఇందుకోసం రాష్ట్రంలోని నలుమూలల నుంచి సీట్లు వచ్చిన అభ్యర్థులు పాల్గొననున్నారు. అభ్యర్థులందరికీ ఇప్పటికే ట్రిపుల్ ఐటీ అధికారులు కాల్ లెటర్లు, వారి మొబైల్స్‌కు సందేశాలు పంపించారు.
కౌన్సెలింగ్‌కు అవసరమైనవి
పదోతరగతి హాల్ టికెట్, పదోతరగతి మార్కుల జాబితా, 10వ తరగతి టీసీ, కాండక్ట్ సర్టిఫికెట్, స్టడీ సర్టిఫికెట్ (4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు), మీసేవా కేంద్రం నుంచి తీసుకున్న కుల ధ్రువీకరణ పత్రం, ఈ ఏడాది ఏప్రిల్ తర్వాత మీసేవా కేంద్రం ద్వారా తీసుకున్న ఆదాయ ధ్రువీకరణ పత్రం, అభ్యర్థి, అతని తల్లిదండ్రుల రెండు పాసు పోర్టు ఫొటోలు, రేషన్ కార్డు, అభ్యర్థి ఆధార్ కార్డు, విద్యార్థులకు ఎవరికై నా బ్యాంకు లోన్ అవసరమైతే పైన పేర్కొన్న సర్టిఫికెట్లన్నీ నాలుగు సెట్లు, అభ్యర్థి తండ్రి ఉద్యోగి అయితే ఎంప్లాయి ఐడెంటీ కార్డు, శాలరీ సర్టిఫికెట్, అభ్యర్థి తండ్రి పాన్, ఆధార్, ఓటర్ ఐడీ కార్డు అందజేయాలి.
విద్యార్థులు ఎలా రావాలంటే ..
అనంతపురం, కర్నూలు, కడప, చిత్తూరు తదితర జిల్లాల వైపు నుంచి వచ్చేవారు వేంపల్లె బస్టాండుకు చేరుకున్న తర్వాత అక్కడి నుండి ప్రతి నిమిషానికి ఇడుపులపాయకు ఆర్కే వ్యాలీ ట్రిపుల్ ఐటీకి ప్రత్యేక బస్సులు ఉన్నాయి. వేంపల్లె నుంచి ఆర్కే వ్యాలీ ట్రిపుల్ ఐటీకి 15 కిలోమీటర్లు దూరం మాత్రమే ఉంది. అంతేకాకుండా వేంపల్లె బస్టాండు, నాలుగు రోడ్ల కూడలిలో దిగిన తర్వాత అక్కడనుండి వీరన్నగట్టుపల్లి మీదుగా ట్రిపుల్ ఐటీకి నిత్యం ఆటోలు ఉంటాయి.
విద్యాభ్యాసం గురించి
‘అన్ని సబ్జెక్టులకు ప్రతినెల పరీక్షలు ఉంటాయి. ప్రతి సెమిస్టర్ 24 వారాలు ఉంటుంది. వేసవి సెలవులు 3 వారాలు మాత్రమే ఉంటాయి. జూలై 15వ తేదీ తరగతులు ప్రారంభమై నవంబరు 30 వరకు జరుగుతాయి. అనంతరం సెమిస్టర్ పరీక్షలు ఉంటాయి. పీయూసీలో ఆరు సబ్జెక్టులుంటాయి. ఆంగ్లం (రెండు పేపర్లు), గణితం (రెండు పేపర్లు), భౌతికశాస్త్రం, రసాయనశాస్త్రం, తెలుగు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సబ్జెక్టులుంటాయి.
కౌన్సెలింగ్‌కు ఏర్పాట్లు పూర్తి
రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయ పరిధిలోని ఇడుపులపాయ ఆర్కే వ్యాలీ ట్రిపుల్ ఐటీలో 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి అడ్మిషన్ల కౌన్సెలింగ్ ప్రక్రియకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సోమవారం ఆర్కే వ్యాలీ ట్రిపుల్ క్యాంపస్‌లోని సెంట్రల్ లైబ్రరీలో 530 మంది విద్యార్థులకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. అందుకు సంబంధించి కొత్తగా వచ్చిన విద్యార్థులకు భోజనం వసతి, మౌలిక వసతులు తదితర ఏర్పాట్లు చేశారు. ముందుగా ట్రిపుల్ ఐటీ ముఖద్వారం వద్ద విద్యార్థులు టోకెన్ తీసుకుని సెంట్రల్ లైబ్రరీలో దరఖాస్తు పూర్తి చేసుకుని సర్టిఫికెట్లు వెరిఫికేషన్ ఉంటుంది. అనంతరం పదవ తరగతిలో పాసైన ఒరిజినల్ సర్టిఫికెట్లు, టీసీ, విద్యార్థి ఫోటోలు, తల్లిదండ్రుల ఫోటోలు తదితర వాటిని పొందుపరిచి అడ్మిషన్ పూర్తి చేస్తారు. జూలై 15 తేదీ నుంచి తరగతులు ప్రారంభమవుతాయి.
క్రమశిక్షణ..ఉత్తమ విద్యాబోధన
ఆరేళ్ల సమీకృత ఇంజినీరింగ్ విద్యా బోధనలో భాగంగా ఆహ్లాదకరమైన వాతావరణం, నాణ్యమైన విద్యాబోధన, క్రమశిక్షణ, ఉత్తమ సామాజిక స్పృహ ఇడుపులపాయ ఆర్కే వ్యాలీ ట్రిపుల్ ఐటీ సొంతం. ఉదయం 7గంటలకు అల్పాహారం, అనంతరం అసెంబ్లీ, 8 గంటల నుంచి 12 గంటల వరకు తరగతులు, ఒంటిగంట వరకు భోజన విరామం, మళ్లీ ఒంటిగంట నుంచి సాయంత్రం 5గంటల వరకు తరగతులు తరగతులు, అనంతరం టీ, స్నాక్స్, 6గంటల వరకు ఆటలు, రాత్రి 7గంటలకు భోజనం, అనంతరం రాత్రి 10 గంటల వరకు స్టడీ అవర్స్ ఇవి ట్రిపుల్ ఐటీ విద్యార్థుల దైనందిన కార్యక్రమాలు. మొదటి రెండు సంవత్సరాలు ఇంటర్ కు సమానమైన పీయూసీ కోర్సును, తర్వాత నాలుగేళ్లు ఇంజినీరింగ్ విద్యను బోధిస్తారు. ‘ట్రిపుల్ ఐటీలో చేరిన తర్వాత విద్యార్థులు మొదటి, రెండు సంవత్సరాలు (పీయూసీ) ఏడాదికి రూ.45 వేలు, తర్వాత నాలుగేళ్లు (ఇంజనీరింగ్) ఏడాదికి రూ.50వేల చొప్పున చెల్లించాలి. ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు అర్హత కలిగిన విద్యార్థులకు ప్రభుత్వమే చెల్లిస్తుంది. ప్రభుత్వం చెల్లించిన నగదుపోను మిగిలిన సొమ్మును విద్యార్థులే చెల్లించాల్సి ఉంటుంది.
నేటి నుంచి ఇడుపులపాయ ఆర్కే వ్యాలీ
ట్రిపుల్ ఐటీలో కౌన్సెలింగ్