
అర్జీలకు త్వరగా పరిష్కారం
కడప సెవెన్‌రోడ్స్ : ప్రజాసమస్యల పరిష్కార వేదిక ద్వారా అందిన అర్జీలకు త్వరితగతిన, నాణ్యమైన పరిష్కారం అందించాలని డీఆర్వో విశ్వేశ్వరనాయుడు అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని సభాభవన్‌లో ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్‌ఎస్)లో ఆయన అధికారులతో కలిసి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఫిర్యాదుదారుల విజ్ఞప్తులపై సంబంధిత అధికారులు క్షేత్ర స్థాయికి వెళ్లి పరిశీలించి పారదర్శకంగా విచారణ చేయాలన్నారు. అర్జీదారులు సంతృప్తి చెందేలా నిర్ణీత గడువులోపు పరిష్కరించాలన్నారు. అనంతరం డీఆర్వో అర్జీదారుల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈ ఓబులమ్మ, జిల్లా వ్యవసాయ అధికారి నాగేశ్వరరావు, సర్వే ల్యాండ్ అధికారి మురళికృష్ణ, ఎస్డీసీలు శ్రీనివాసులు, వెంకటపతి, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీ అనుబంధ విభాగంలో నియామకాలు
కడప కార్పొరేషన్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్సార్ జిల్లాకు చెందిన పలువురిని.. పార్టీ రాష్ట్ర దివ్యాంగుల విభాగ కమిటీలో వివిధ హోదాల్లో నియమించినట్లు ఆ పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. రాష్ట్ర దివ్యాంగుల విభాగం ప్రధాన కార్యదర్శిగా కడపకు చెందిన షేక్ జిలానీబాషా, రాష్ట్ర సంయుక్త కార్యదర్ళులుగా జమ్మలమడుగుకు చెందిన సి.ఆంజనేయరెడ్డి, కడపకు చెందిన ఎం.సుమన్‌కుమార్‌రెడ్డిలను నియమించారు.
జూన్ 5న ఏపీజీఈఏ
రాష్ట్ర కౌన్సిల్ సమావేశం
రాయచోటి జగదాంబసెంటర్ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం(ఏపీజీఈఏ) రాష్ట్ర 3వ కౌన్సిల్ సమావేశం జూన్ 5న నిర్వహించనున్నట్లు జిల్లా అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మీప్రసాద్ తెలిపారు. సోమవారం రాయచోటిలో ఆయన మాట్లాడుతూ సమావేశానికి ఉద్యోగ, ఉపాధ్యాయ, కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులు పెద్ద ఎత్తున హాజరై సభను జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో రాయచోటి తాలూకా అధ్యక్షుడు సాయికుమార్, కార్యదర్శి సుజిత్ డాల్, కోశాధికారి సురేష్, ఉపాధ్యక్షుడు వలి, సంయుక్త కార్యదర్శి రఘు, సభ్యులు శివనాయక్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

అర్జీలకు త్వరగా పరిష్కారం